జగన్ కు చిక్కులు మొదలైనట్టేనా?

February 20, 2020

తాను పట్టిన కుందేటికి మూడే కాళ్లు అన్నట్టు ఇష్టానుసారం నిర్ణయాలు తీసుకుంటూ వెళ్తున్న జగన్ రెడ్డికి శాసనమండలిలో నిన్న తగలిగిన దెబ్బ గట్టిదే. అక్కడ మెజారిటీ సభ్యులు టీడీపీ వారు కావడంతో రూల్ 71 పాస్ చేసి రాజధాని మార్పు బిల్లును అడ్డుకున్నారు. అయితే... దీనిపై ఏం ఎత్తుగడ వేయాలో జగన్ ఆలోచించుకునేలోపు ఈరోజు మరో చిక్కు వచ్చి పడింది.

ఏపీ అసెంబ్లీలో జగన్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సీఆర్డీయే రద్దు బిల్లుపై  కొందరు ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. సీఆర్డీఏ చట్టాన్ని రద్దు చేయాలని ఏపీ సర్కారు నిర్ణయించటం.. అసెంబ్లీలో అది పాసవడంతో  ఏపీ అసెంబ్లీ ఆమోదించిన బిల్లును సస్పెండ్ చేయాలని కోరుతూ పలువురు హైకోర్టును ఆశ్రయించారు. బిల్లును అడ్డుకునేలా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. ఈ పిటిషన్ లో కేంద్రాన్ని, ఏపీ ముఖ్యమంత్రి.. మంత్రులను ప్రతివాదులుగా చేరుస్తూ పిల్ దాఖలు చేశారు.
ఇదిలా ఉండగా... తమ స్వంత భూములను రాజధాని అమరావతి కోసం ధారాదత్తం చేసిన రైతులు.. మూడు రాజధానుల అంశం మీద పిల్ వేశారు.  ఏపీ రాజధానిగా అమరావతినే కొనసాగించాలని కోరుతూ 37 మంది రైతులు ఈ పిటిషన్ వేశారు. మరి దీనిపై విచారణ అనంతరంకోర్టు ఏం చెబుతుందో చూడాలి. దీంతో పాటు  అనేక మంది కుటుంబాల భవిష్యత్తుపై ఆధారపడిన ఈ అంశం గురించి మానవ హక్కుల కమిషన్ కూడా వెళ్లాలని టీడీపీ నిర్ణయించింది. ఎక్కడ జగన్ తప్పించుకున్నా హక్కుల కమిషన్ నుంచి బయటపడటం అంత సులువు కాదు.