టీఆర్ఎస్ 16 లెక్క‌... ఓ ప‌చ్చి అబ‌ద్ధం, ఇదిగో!

August 10, 2020

సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు స‌మ‌యం ఆస‌న్న‌మైన వేళ‌... టీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ క‌ల్వ‌కుంట్ల తార‌క‌రామారావు ఓ జాతీయ వార్తాసంస్థ‌కు ఇచ్చిన సుదీర్ఘ ఇంట‌ర్వ్యూ ఇప్పుడు అంద‌రి నోటా నానుతోంది. గులాబీ పార్టీ మ‌ద్ద‌తుదారుల‌కు, ఆ పార్టీ ప‌ట్ల సానుకూల‌త వ్య‌క్తం చేస్తున్న వైసీపీకి చెందిన నేత‌ల‌కు ఈ ఇంట‌ర్వ్యూ విన‌సోంపుగా క‌నిపించ‌వ‌చ్చు గానీ... సామాన్యుల‌కు, వాస్త‌వాల‌ను ద‌గ్గ‌రి నుంచి చూసే వాళ్ల‌కు మాత్రం నేల విచిడి సాము చేసిన‌ట్టుగానే క‌నిపిస్తోంద‌న్న వాద‌న వినిపిస్తోంది. అయినా కేటీఆర్ ఆ ఇంట‌ర్వ్యూలో ఏం చెప్పార‌న్న విష‌యానికి వ‌స్తే... వ‌చ్చే నెల 11న జ‌ర‌గ‌నున్న తొలి విడ‌త పోలింగ్ లో తెలుగు రాష్ట్రాల్లోని 42 ఎంపీ సీట్ల‌కు పోలింగ్ పూర్తి అవుతుంది క‌దా. ఈ పోలింగ్ లో తెలంగాణ‌లో టీఆర్ఎస్‌కు ఏకంగా 16 సీట్లు, మిగిలిన ఒక సీటు మ‌జ్లిస్ ఖాతాలో ప‌డ‌తాయ‌ని, ఏపీలోని 25 ఎంపీ సీట్ల‌లో 15 నుంచి 22 దాకా వైసీపీ గెలుస్తుంద‌ని కేటీఆర్ చెప్పారు.

తెలంగాణ‌లో క్లీన్ స్వీప్ చేసే టీఆర్ఎస్ మాదిరిగానే ఆయా రాష్ట్రాల్లో స‌త్తా చాటే ప్రాంతీయ పార్టీలు చాలానే ఉన్నాయ‌ని కూడా కేటీఆర్ చెప్పుకొచ్చారు. ఇలాంటి పార్టీల‌న్నీ క‌లిపి ఏకంగా 150 నుంచి 170 సీట్ల దాకా సాధిస్తాయ‌ని ఆయ‌న లెక్క‌లేశారు. ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ పేరిట అటు కాంగ్రెస్‌కు ఇటు బీజేపీకి దూరంగా ఉన్న పార్టీల‌ను క‌లిపేందుకు తాము చేస్తున్న య‌త్నాలు ఫ‌లించి... ఈ పార్టీల‌న్నీ ఒకే ఫ్లాట్ పామ్ మీద‌కు వ‌స్తే... కేంద్రంలో చ‌క్రం తిప్పేది తామేన‌న్న‌ది కూడా కేటీఆర్ వాద‌న‌. అర చేతిలో క్యాలిక్యులేట‌ర్ పెట్టుకుని ఆయా పార్టీలు సాధించే సీట్ల‌న్నిటినీ కూడుకుంటే పోవ‌డం ఈజీనే గానీ... మ‌రి వాస్త‌వంగా ఆ పార్టీల‌న్నీ టీఆర్ఎస్ చెప్పిన‌ట్టుగా ఒకే ఫ్లాట్ పామ్ మీద‌కు వ‌స్తాయా? వ‌చ్చినా కేసీఆర్ నాయ‌క‌త్వంలో ముందుకు సాగేందుకు అంగీక‌రిస్తాయా? ఇప్ప‌టికే దేశంలో ఉత్త‌రాది రాష్ట్రాల‌కు చెందిన పార్టీల‌న్నీ ద‌క్షిణాది పార్టీల‌ను కాస్తంత త‌క్కువ‌గానే చూస్తున్న విష‌యం మ‌న‌కు తెలిసిందే.

దేశంలోనే అత్యధిక సంఖ్య‌లో ఎంపీ సీట్లు ఉన్న ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లో అక్క‌డి బీఎస్పీ, ఎస్పీలు క‌లిసి సాగుతున్నాయి. ఈ ఎన్నిక‌ల్లో ఆ కూట‌మికి ఎంత‌లేద‌న్నా 50 సీట్లకు పైగానే ద‌క్క‌నున్నాయ‌న్న విశ్లేష‌ణ‌లు వినిపిస్తున్నాయి. మ‌రి 50 సీట్లు గెలిచే అవ‌కాశాలున్న ఎస్పీ, బీఎస్పీ కూటమి... 16 సీట్ల‌ను గెలిచే టీఆర్ఎస్ మార్గంలో ఎందుకు న‌డుస్తుంది? ముమ్మాటికీ న‌డ‌వ‌ద‌నే చెప్పాలి. ఎందుకంటే.... ఉత్తారాది భావ‌న‌, త‌క్కువ సీట్లు క‌లిగిన పార్టీ చెప్పే మార్గంలో సాగ‌డ‌మేంటీ? అన్న భావ‌న‌తో ఆ కూట‌మితో పాటు ప‌శ్చిమ బెంగాల్ కు చెందిన తృణ‌మూల్ కాంగ్రెస్ గానీ టీఆర్ఎస్ బాట‌లో న‌డిచే అవ‌కాశాలే లేవ‌ని చెప్పాలి. ఎస్పీ, బీఎస్పీ, తృణ‌మూల్ పార్టీలు సాధించే సీట్టే.. కేటీఆర్ వేసిన లెక్క‌లో స‌గభాగ‌మ‌న్న వాద‌న వినిపిస్తోంది. మ‌రి అంత‌మేర సీట్లు సాధించే ఆ పార్టీలు... కేవ‌లం 16 సీట్ల‌ను (అది కూడా క్లీన్ స్వీప్ చేస్తేనే) సాధించే టీఆర్ఎస్ బాట‌లో ఎందుకు న‌డుస్తాయి? మ‌రి ఈ లెక్క‌న కేటీఆర్ అంచ‌నాలు... వెంట్రుక‌తో కొండ‌ను లాగ‌డ‌మే క‌దా.
కొస‌మెరుపు - ఒక‌వేళ అన్ని ప్రాంతీయ పార్టీలను కేసీఆర్ ఏకం చేశార‌నుకుందాం. 170 సీట్లు వ‌చ్చాయ‌నుకుందాం. మ్యాజిక్ ఫిగ‌ర్ 274. అంటే అపుడు కాంగ్రెస్ లేదా బీజేపీ మ‌ద్ద‌తు కావాలి. దొరికితే కేసీఆర్ పీక పిసికేయాల‌న్నంత కోపంతో ఉన్నారు సోనియా గాని కాంగ్రెస్ గాని. ఆ మాట‌కొస్తే వారికి మోడీ వ‌చ్చినా ప‌ర్లేదు గాని కేసీఆర్ రాకూడ‌దు. అదెంత డేంజ‌రో వారికి స్వాన‌భ‌వం. అలాంటి పార్టీ పీఎం సీటులో కేసీఆర్ ని కూర్చోబెడుతుందా? క‌చ్చితంగా లేదు. అంటే ఏతావ‌తా కేసీఆర్ క‌ల‌వాల్సింది బీజేపీతోనే ! ఇది ప‌క్కా !! ఇంకో దారే లేదు.