టీఆర్ఎస్ లాజిక్ బ్యాక్ ఫైర్... జనం విమర్శలు, కోలుకోలేని డ్యామేజ్

August 15, 2020

కింద పడ్డా పైచేయి నాదే అన్నట్లుగా మారింది టీఆర్ఎస్ అధికారపక్ష నేతల మాటలు. తప్పు జరిగినప్పుడు మౌనంగా ఉండటం ఒక అలవాటు. కొన్ని సందర్భాల్లో డ్యామేజ్ కంట్రోల్ చేయటం కోసం కాస్త నెమ్మదిగా అయినా నోరు విప్పేవారు. తాజాగా మాత్రం అందుకు భిన్నమైన పరిస్థితులు నెలకొన్నాయి. కళ్ల ముందు దారుణమైన తప్పు జరిగిపోయినా.. దాన్ని కవర్ చేసుకోవటం.. ఆ క్రమంలో భాగంగా వినిపించే వాదనలు వింటే అవాక్కు అవ్వాల్సిందే. మొండి కత్తి తీరుకు ఏ మాత్రం తీసిపోని రీతిలో వారి మాటలు ఉంటున్నాయి.

ఎక్కడిదాకానో ఎందుకు.. నిన్నటి రోజున ఉస్మానియా జనరల్ ఆసుపత్రి గ్రౌండ్.. ఫస్ట్ ఫ్లోర్ లోకి వర్షపు నీరు రావటం.. కాళేశ్వరం నీళ్లు ఉస్మానియాకు తాకాయంటూ ఎటకారపు వ్యాఖ్యలతో కూడి వీడియోలు మస్తుగా సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. అంతేనా.. వెనిస్ నగరాన్ని ఉస్మానియాతో పోలిస్తూ ఫోటోలు వాట్సాప్ లలో హడావుడి చేస్తున్నాయి. మొత్తంగా ప్రజల్లో కేసీఆర్ సర్కారు మీద పెల్లుబుకుతున్న ఆగ్రహం స్పష్టంగా కనిపిస్తోంది.

ఇలాంటివేళ.. గులాబీనేతలు పలువురు చేస్తున్న వ్యాఖ్యలు వారిని అడ్డంగా బుక్ చేయటమే కాదు.. వారి మీద మరింత ఫైర్ అయ్యే అవకాశం ఇస్తోంది. తప్పు జరిగినప్పుడు దానికి సమర్థింపు అంతగా అతకదు. ఎంతో తెలివిగా సర్ది చెబితే తప్పించి ప్రజలు శాంతించరన్నది మర్చిపోకూడదు. అలా కాకుండా.. ఉస్మానియా ఆసుపత్రిని కూల్చి కొత్తది కడతానంటే నానా యాగీ చేశారని.. అందుకే ఆగిందన్న వాదన కూడా ఆ కోవకు చెందిందే. నిజమే.. ఉస్మానియా చారిత్రక కట్టడం. ఆసుపత్రి ప్రాంగణంలోనే దాదాపు మూడు ఎకరాల ఖాళీ స్థలం ఉంది.

లక్ష కోట్లకు పైనే ఖర్చు చేసి ఇరిగేషన్ ప్రాజెక్టుకట్టించే సత్తా ఉన్న సర్కారుకు రూ.500 కోట్లు ఖర్చు స్తే అద్భుతమైన ఆసుపత్రి అందుబాటులోకి వస్తుందన్న విషయాన్ని ఎందుకు పట్టించుకోనట్లు? అయినా.. విపక్షాలు వ్యతిరేకిస్తోనో.. మరెవరో విమర్శిస్తేనో కేసీఆర్ సర్కారు ఆగుతుందా? అదే నిజమైతే.. సచివాలయాన్ని కూల్చివేయటాన్ని అందరూ వ్యతిరేకిస్తున్నారు. మరి.. వారి మాటకు విలువ ఇవ్వకుండా తాను అనుకున్నట్లే కేసీఆర్ నిర్ణయం తీసుకుని వ్యతిరేకించినా కట్టడం మొదలుపెడుతున్నారు కదా... ఇలాగే ఉస్మానియా ఆస్పత్రి కూడా సంకల్పంతో కట్టొచ్చు కదా.

ఉస్మానియా ఆసుపత్రిలోకి మురుగునీరు రావటం.. వర్షపు నీరు అడుగు మేర ముంచెత్తటం వెనుక అసలు కారణం.. ఆసుపత్రి చుట్టుపక్కల రోడ్డు ఎత్తును పెంచటం అన్నది నిజం. దాన్ని వదిలేసి.. అర్థం లేని వాదనను వినిపించటం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదన్న విషయాన్ని గులాబీ నేతలు ఎందుకు మర్చిపోతున్నారు? తప్పు జరిగినప్పుడు సమర్థింపు కంటే కూడా.. అధినేత కేసీఆర్ మాదిరి మౌనంగా ఉండటం మంచిది.