టీఆర్ఎస్‌కు ముందు ముందు గ‌డ్డురోజులేనా..?

August 11, 2020

తెలంగాణ‌లో అధికార టీఆర్ఎస్‌కు ప్ర‌తికూల ప‌రిస్థితులు ఎదుర‌వుతున్నాయా..? పార్టీలో, ప్ర‌భుత్వంలో ఏదైనా ముస‌లం మొద‌లైందా..? ఇటీవ‌ల ప‌లువురు కీల‌క నేత‌ల నుంచి వినిపించిన ధిక్కార గ‌ళ‌మే ఇందుకు నిద‌ర్శ‌న‌మా..? అంటే తాజా ప‌రిణామాలు మాత్రం ఔన‌నే అంటున్నాయి. ముంద‌స్తు ఎన్నిక‌ల్లో ఘ‌న విజ‌యం సాధించి త‌న‌కు తిరుగేలేద‌నుకున్న పార్టీ అధినేత‌, ముఖ్య‌మంత్రి కేసీఆర్‌లో ఏదో తెలియ‌ని ఆందోళ‌న మొద‌లైంద‌నే టాక్ గులాబీ శ్రేణుల్లోనే వినిపిస్తోంది. ఇందుకు ప‌లు బ‌ల‌మైన కార‌ణాలు క‌నిపిస్తున్నాని చెప్పొచ్చు. ఇందులో ప్ర‌ధానంగా టీఆర్ఎస్ పార్టీని కేసీఆర్‌, ఆయ‌న త‌న‌యుడు మాజీమంత్రి కేటీఆర్‌లు త‌మ గుప్పిట్లోపెట్టుకున్నార‌ని, మ‌రెవ్వ‌రికీ క‌నీసం మాట్లాడే అవ‌కాశం లేద‌నే టాక్ మొద‌టి నుంచీ ఉంది. అయితే.. ఇది క్ర‌మంలో పార్టీలో ప‌లువురు కీల‌క నేత‌ల అసంతృప్తికి దారితీస్తోంది.

అయితే.. ఇన్నాళ్లూ టీఆర్ఎస్‌కు ప్ర‌త్యామ్నాయం లేక‌పోవ‌డంతో ఎవ్వ‌రూ మాట్లాడ‌లేక‌పోయార‌ని, ఎప్పుడైతే పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో కారుకు ఎదురుదెబ్బ త‌గ‌ల‌డం.. ఏకంగా బీజేపీ నాలుగు స్థానాల్లో విజ‌యం సాధించ‌డం జ‌రిగిందో.. అప్ప‌టి నుంచి ప‌రిణామాలు అనూహ్యంగా మారుతూ వ‌స్తున్నాయి. పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో నిజామాబాద్ స్థానం నుంచి పోటీ చేసిన సిట్టింగ్ ఎంపీ క‌విత బీజేపీ అభ్య‌ర్థి అర్వింద్ చేతిలో ఓడిపోవ‌డంతో.. కేసీఆర్ ఓడిపోయినంత ప‌ని అయిపోయింది. స‌రిగ్గా ఇక్క‌డి నుంచే టీఆర్ఎస్‌కు ప్ర‌తికూల ప‌రిస్థితులు ఎదుర‌వుతున్నాయ‌నే టాక్ గులాబీ శ్రేణుల్లో ఉంది. ఇక పార్ల‌మెంట్ ఎన్నిక‌ల‌తో మొద‌లైన పాజిటివ్‌వేవ్‌ను అలాగే కాపాడుకుంటూ క‌మ‌ల‌ద‌ళం దూసుకొస్తోంది. ఆప‌రేష‌న్ ఆక‌ర్శ్ చేప‌ట్టి.. కాంగ్రెస్‌, టీడీపీల‌తోపాటు అధికార టీఆర్ఎస్ నుంచి కూడా కీల‌క నేత‌ల‌ను లాగుతోంది.

2023 ఎన్నిక‌ల్లో గెలుపే ల‌క్ష్యంగా దూసుకొస్తున్న బీజేపీ ఇప్పుడు అసంతృప్తితో ఉన్న అధికార పార్టీ నేత‌ల‌కు, రాజ‌కీయ భ‌విష్య‌త్ కోసం ఎదురుచూస్తున్న కాంగ్రెస్‌, టీడీపీ నేత‌ల‌కు ప్ర‌త్యామాయ వేదిక‌గా క‌నిపిస్తోంది. ఈ నేప‌థ్యంలోనే వ‌చ్చిన‌వాళ్ల‌ను వ‌చ్చిన‌ట్టు చేర్చుకుంటూ రోజురోజుకూ త‌న దూకుడును పెంచుతోంది క‌మ‌ల‌ద‌ళం. ఇక ఇదే స‌మ‌యంలో అధికార టీఆర్ఎస్‌లోనూ ధిక్కార స్వ‌రాలు మొద‌ల‌య్యాయి. మొన్న‌టికిమొన్న ఏకంగా మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. త‌న‌కు మంత్రి ఎవ‌రి భిక్ష కాద‌ని, గులాబీ జెండా ఓన‌ర్ల‌లో ఒక‌డినంటూ తీవ్ర‌వ్యాఖ్య‌లు చేశారు. ఆత‌ర్వాత మాన‌కొండూరు ఎమ్మెల్యే ర‌స‌మ‌యి బాల‌కిష‌న్ కూడా బోర్డులు త‌ప్ప‌ ఏమీ మార‌లేదంటూ గురుపూజోత్స‌వం వేదిక‌పై కుండ‌బ‌ద్ద‌లు కొట్టారు. ఈ జాబితాలో ఇంకా చాలామందే ఉన్నార‌నే టాక్ వినిపిస్తోంది.

ఇన్నాళ్లూ ప్రాంతీయ వాదంతో తిరుగులేని శ‌క్తిగా ఎదిగిన టీఆర్ఎస్‌కు ఇప్పుడు రాజ‌కీయంగా గ‌ట్టిపోటీ ఎదుర‌వుతోంది. జాతీయ‌వాదంతో వ‌స్తున్న‌బీజేపీని ఎదుర్కొన‌లేక పోతుంద‌నే చెప్పొచ్చు. మ‌రోవైపు.. ముఖ్య‌మంత్రి కేసీఆర్ పోక‌డ‌పై ప్ర‌జ‌ల్లోనూ ఏదో అసంతృప్తి క‌లుగుతోంది. ఇటీవ‌ల యూరియా కోసం రైతులు నానాక‌ష్టాలు ప‌డుతున్నారు. అంతేగాకుండా.. యాదాద్రి దేవాల‌యం శిల‌ల‌పై కేసీఆర్‌, కారు త‌దిత‌ర బొమ్మ‌లు చెక్క‌డంపై కూడా ప్ర‌జ‌ల నుంచి వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మ‌వుతోంది. అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు ఇంకా సుమారు నాలుగేళ్ల స‌మ‌యం ఉంది. ఇప్పుడే ప‌రిస్థితులు ఇలా ఉంటే.. ముందుముందు క‌ష్ట‌కాలం త‌ప్ప‌ద‌నే టాక్ గులాబీ శ్రేణుల్లోనే వినిపించ‌డం గ‌మ‌నార్హం. దీని నుంచి కేసీఆర్ ఎలా ? బ‌య‌ట‌ప‌డుతారో చూడాలి మ‌రి.