గులాబీ గూట్లో కేసీఆర్‌పై ర‌గులుతోందెవ‌రు..!

February 19, 2020
CTYPE html>
తెలంగాణ రాష్ట్ర సాధ‌న ఉద్య‌మంతో కేసీఆర్ ఎంత వేగంగా ఎదిగారో.. ఇప్పుడు అంతే వేగంగా ప‌త‌న‌మ‌వుతున్నారా..?  టీఆర్ఎస్‌ను తిరుగులేని శ‌క్తిగా తీర్చిదిద్దిన కేసీఆర్‌.. ఇప్పుడు ఆయ‌నే పార్టీ ప్ర‌తిష్ట‌ను దిగ‌జార్చుతున్నారా..? అంటే గులాబీ గూటిలో అంత‌ర్గ‌తంగా గుస‌గుస‌లు మాత్రం ఔన‌నే అంటున్నాయి. ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఒంటెత్తుపోక‌డ‌పై గులాబీ గూటిలో తీవ్ర అసంతృప్తి ర‌గులుకుంటోంద‌నే టాక్ బ‌లంగా వినిపిస్తోంది.
ఉద్య‌మ స‌మ‌యంలో ఆర్టీసీ కార్మికుల‌తో క‌లిసి న‌డిచిన కేసీఆర్‌, కార్మికుల కాలికి ముల్లు దిగితే త‌న పంటితో తీస్తాన‌ని చెప్పిన కేసీఆర్‌.. ఇప్పుడు ఇలా వారిప‌ట్ల దుర్మార్గంగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని సొంత పార్టీ నేత‌లే లోలోప‌ల ఆవేద‌న చెందుతుండ‌డం గ‌మ‌నార్హం. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్య‌మంగా కోసం ఎన్ఎంయూ నుంచి టీఎంయూ ఆవిర్భ‌వించింది. ఈ సంఘానికి గౌర‌వ అధ్య‌క్షుడిగా హ‌రీశ్‌రావు కూడా గ‌తంలో కొన‌సాగారు. టీఆర్ఎస్ తొలి ప్ర‌భుత్వం ఏర్ప‌డిన కొంత‌కాలం వ‌ర‌కూ గౌర‌వ అధ్య‌క్షుడిగా హ‌రీశ్‌రావు కొన‌సాగారు. ఆ త‌ర్వాత సీఎం కేసీఆర్ ఆదేశంతో ఆయ‌న త‌ప్పుకున్నారు.
35రోజుల ముందుగానే ఆర్టీసీ కార్మికులు స‌మ్మె నోటీసు ఇచ్చినా.. వారితో చ‌ర్చలు జ‌రుపకుండా.. వారికి జీతాలు ఇవ్వ‌కుండా.. సెల్ఫ్ డిస్మిస్ అయ్యారంటూ సీఎం కేసీఆర్ ప్ర‌క‌టించ‌డంపై టీఆర్ఎస్ పార్టీలోకి ప‌లువురు కీల‌క నేత‌లు తీవ్ర అసంతృప్తితో ఉన్న‌ట్లు తెలుస్తోంది. త‌మ ఆవేద‌న‌ను స‌న్నిహితుల వ‌ద్ద చెప్పుకుంటున్నారు. ఇక ఇదే స‌మ‌యంలో సామాన్య ప్ర‌జ‌ల్లోనూ కేసీఆర్ పోక‌డ‌పై అసంతృప్తి వ్య‌క్త‌మ‌వుతోంది. కేసీఆర్‌కు, ఆయ‌న ప్ర‌భుత్వానికి ఇది మంచి ప‌రిణామం కాద‌ని, ఇప్ప‌టికైనా కార్మికుల‌తో చ‌ర్చ‌లు జ‌రిపి, స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించాల‌ని లోలోప‌ల చ‌ర్చించుకుంటున్నారు.
నిజానికి.. తాము ఉమ్మ‌డి రాష్ట్రంలోనూ ఇలాంటి ప‌రిస్థితుల‌ను చూడ‌లేద‌ని చెబుతుండ‌డం గ‌మ‌నార్హం. నిజానికి.. మొన్న‌టికి మొన్న మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ‌కు ముందు మంత్రి ఈట‌ల  రాజేంద‌ర్ తీవ్ర అసంతృప్తిని వెల్ల‌గ‌క్కిన విష‌యం తెలిసిందే. ఆ త‌ర్వాత చాలా మంది నేత‌లు కేసీఆర్‌పై ధిక్కార స్వ‌రాన్ని వినిపించారు. ఇక తాజాగా ఆర్టీసీ కార్మికుల‌పై సీఎం కేసీఆర్ తీసుకుంటున్న నిర్ణ‌యాల‌తో మ‌రోసారి అసంతృప్తి సెగ‌లు ర‌గిలే అవ‌కాశాలు క‌నిపిస్తున్న‌ట్లు తెలుస్తోంది.
ఇద్ద‌రు కార్మికుల ఆత్మ‌హ‌త్య‌కు ముఖ్య‌మంత్రి కేసీఆర్ పోక‌డే కార‌ణ‌మ‌ని ప‌లువురు నాయ‌కులు ఆవేద‌న‌కు గుర‌వుతున్నారు. ఆ నాడు తెలంగాణ కోసం ఆత్మ‌బ‌లిదానాలు జ‌రిగాయ‌ని, ఇప్పుడు స్వ‌రాష్ట్రంలో కూడా ఆత్మ‌బ‌లిదానాలు చేసుకోవాల్సి రావ‌డం చాలా బాధాక‌ర‌మ‌ని, ఇది పార్టీ ప‌త‌నానికి దారితీస్తుంద‌ని ఆందోళ‌న చెందుతున్నారు. ప‌రిస్థితులు ఇలాగే ఉంటే.. గులాబీ గూటిలో క‌ల‌క‌లం రేగ‌డం ఖాయ‌మ‌ని ప‌లువురు సీనియ‌ర్లు చ‌ర్చించుకోవ‌డం గ‌మ‌నార్హం.