HYD: సర్కారు బడిని తనఖా పెట్టేసుకుని లోనిచ్చేసిన బ్యాంకు

August 13, 2020

ఒకప్పుడు హైదరాబాద్ మహానగరంలో తరచూ దానం నాగేందర్ పేరు తరచూ వినిపిస్తూ ఉండేది. ఆయన తీరుపై పలువురు విమర్శలు చేసేవారు. తప్పు పట్టేవారు. గడిచిన కొన్నేళ్లుగా ఆయన పేరు పెద్దగా వినిపించని పరిస్థితి. 2018లో జరిగిన ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ అభ్యర్థిగా ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగేందుకు ఆయన పడిన ప్రయాస అంతా ఇంతా కాదు. ఆఖరి నిమిషం వరకూ టికెట్ ఫైనల్ కాలేదు.

చివరకు ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత కూడా అనారోగ్యం కారణంగా కొంతకాలం బయటకు రాలేని పరిస్థితి. గడిచిన కొన్నేళ్లుగా కామ్ గా ఉన్నారన్న పేరును సొంతం చేసుకున్న ఆయన.. తాజాగా ఒక వివాదంలో తలదూర్చటం.. దానికి సంబంధించిన వీడియో ఒకటి వైరల్ గా మారింది. తాజా ఎపిసోడ్ లో ఆయన ఆగ్రహానికి పెద్ద ఎత్తున మద్దతు రావటం గమనార్హం. అయితే.. బ్యాంకు అధికారులపై ఆయన అనుచరుల తీరు బాగోలేదన్న విమర్శలు వస్తున్నాయి. ఇంతకీ అసలు వివాదం ఏమిటన్నది చూస్తే..

ఒక ప్రభుత్వ స్థలాన్ని ప్రైవేటు స్థలంగా చెప్పే ప్రయత్నం చేయటం.. స్థానికులు అడ్డుకోవటం.. ఈ సందర్భంగా ఎంట్రీ ఇచ్చిన దానం తీరు ఇప్పుడు పలు ప్రశ్నల్ని సంధిస్తోంది. ఖైరతాబాద్ ఓల్డ్ సీబీఐ క్వార్టర్స్ లో ప్రభుత్వ పాఠశాల శిథిలావస్థకు చేరింది. దీంతో దాన్ని వేరే చోటుకు తరలించారు. అక్కడి స్థలం ఖాళీగా ఉంది.సరిగ్గా ఇదే సమయంలో ఆ స్థలాన్ని తనఖా పెట్టి బాకీ చెల్లించని కారణంగా ఆ స్కూల్ స్థలాన్ని బ్యాంకు వేలం వేసేందుకు రంగం సిద్దం చేసింది.

దీనిపై రగడ మొదలైంది. అది ప్రైవేటు వ్యక్తుల స్థలమని.. తమ వద్ద అప్పు తీసుకున్నట్లుగా బ్యాంకు చెబుతోంది. అది.. ప్రభుత్వ స్థలమని స్థానికులు మండిపడుతున్నారు. ప్రభుత్వ స్థలంలో ఉన్న స్కూల్ స్థానంలో కొత్త స్కూల్ ఏర్పాటు చేయాలన్న డిమాండ్ ను తెర మీదకు వచ్చారు. స్థానికుల ఫిర్యాదు చేయటంతో ఎమ్మెల్యే దానం సీన్లోకి వచ్చారు. బ్యాంకు అధికారులతో మాట్లాడి పనుల్ని నిలిపివేశారు.  పనులు నిలిపివేసే క్రమంలో బ్యాంకు అధికారులతో దానం అనుచరులు దురుసుగా వ్యవహరించినట్లుగా ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.

మీరు దొంగతనం చేశారు. ప్రభుత్వ స్థలాన్ని మార్టిగేజ్ చేసుకొని ఫిజికల్ పొజిషన్ ఇవ్వటానికి మీకెంత ధైర్యం? మీరు ఇక్కడ నిలబడొద్దు. వెంటనే వెళ్లిపోవాలి. లేకుంటే పరిస్థితులు భిన్నంగా ఉంటాయి’’ అంటూ మాట్లాడిన మాటలు వివాదంగా మారాయి. ఒకఎమ్మెల్యేగా ఉండి.. అంత దురుసుగా మాట్లాడటం.. బ్యాంకు అధికారులపై ఆగ్రహాన్ని వ్యక్తం చేయటాన్ని పలువురు ప్రస్తావిస్తున్నారు.

ప్రభుత్వ స్థలాన్ని కాపాడేందుకు ఎమ్మెల్యే స్వయంగా రావటంలో తప్పేముందన్న వాదన వినిపిస్తోంది. ఎమ్మెల్యే రావటం తప్పు కాదని.. కాకుంటే బ్యాంకు అధికారులతో ఎమ్మెల్యే అనుచరులు అనుసరించిన తీరు సరికాదన్న మాట వినిపిస్తోంది. మొత్తంగా ఈ వైరల్ వీడియో దానంకు ప్లస్సా.. మైనస్సా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. 

Read Also

ఉద్యోగం పోయిందని ఏడ్చేవాళ్లు సిగ్గుపడండి ఈ అమ్మాయిని చూసి
తెలంగాణ బులిటెన్ లో కేసీఆర్ చతురత... వాట్ నెక్ట్స్
అమెరికా ఫ్రీ సీటు గెలిచిన తెలంగాణ అమ్మాయి