కిష‌న్‌రెడ్డి గాలి తీసేసిన కేసీఆర్ ఆప్తుడు

June 01, 2020

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, తెలంగాణలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ నేత‌ల మ‌ధ్య తెలంగాణ‌లో మాట‌ల యుద్ధం జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. ముఖ్య‌నేత‌లంతా తామెవ‌రికి తీసిపోం అన్న‌ట్లుగా త‌మ వాగ్ధాటిని ప్ర‌ద‌ర్శిస్తూ...విమ‌ర్శ‌లు ప్ర‌తివిమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. ఈ ఒర‌వ‌డిలో కేంద్ర హోం శాఖ స‌హాయమంత్రి కిష‌న్ రెడ్డి చేసిన వ్యాఖ్య‌ల‌కు తాజాగా తెలంగాణ‌ ముఖ్య‌మంత్రి కేసీఆర్ స‌న్నిహితుడు ఊహించ‌ని రీతిలో కౌంట‌ర్ ఇచ్చారు.
కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఇటీవ‌ల మీడియాతో మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా ఒకేసారి అసెంబ్లీ సీట్లను పెంచుతామని ప్ర‌క‌టించారు. దీనిపై గులాబీ ద‌ళ‌ప‌తి స‌న్నిహితుడు,  రాష్ట్ర ప్రణాళికాసంఘం వైస్‌చైర్మన్‌ బోయినపల్లి వినోద్‌కుమార్ ఘాటుగా స్పందించారు. అసెంబ్లీ స్థానాల పెంపు విషయంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ద్వంద్వవైఖరిని అవలంబిస్తున్నదని, తమకు అనుకూలంగాలేని రాష్ట్రాల పట్ల కేంద్రం వివక్ష చూపుతున్నదంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. కశ్మీర్‌కు ఏడు అసెంబ్లీ స్థానాలను పెంచిన కేంద్రం ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో ఎందుకు పెంచడంలేదని ప్ర‌శ్నించారు.
తెలంగాణలో అసెంబ్లీ సీట్లను పెంచాలని ఆరేళ్లుగా కోరుతున్నా కేంద్రం పట్టించుకోవడం లేదని వినోద్‌కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. అదే స‌మ‌యంలో  కశ్మీర్‌లో అసెంబ్లీ స్థానాలను 107 నుంచి 114కు పెంచారని తెలిపారు. ఒకే దేశం - ఒకే చట్టం అన్న నినాదం ఏమైందని ఆయన బీజేపీ నేతలను ప్రశ్నించారు. తెలుగు రాష్ట్రాల్లో బీజేపీకి రాజకీయంగాఎటువంటి లాభం లేనందునే దాటవేత ధోరణిని అవలంబిస్తున్నారని విమర్శించారు.  ఏపీ, తెలంగాణలో అసెంబ్లీ సీట్లు పెంచేదిలేదని కిష‌న్‌రెడ్డి చేసిన ప్ర‌క‌ట‌న‌పై స‌రికాద‌ని, అసెంబ్లీ సీట్ల పెంపు కోసం ఏపీ, తెలంగాణ ప్రజలు న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తారని వినోద్‌కుమార్‌ తెలిపారు. 
ఈ సంద‌ర్భంగా కేంద్ర మంత్రి కిష‌న్‌రెడ్డిపై వినోద్ కుమార్ సెటైర్ వేశారు. అసెంబ్లీ స్థానాల పెంపు అంశాన్ని రాత్రికి రాత్రి ఏపీ విభజన చట్టంలో పొందుపర్చారన్న కిషన్‌రెడ్డి వ్యాఖ్యలను వినోద్‌కుమార్‌ తప్పుబట్టారు. కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూపీఏ మంత్రులు, బీజేపీ అగ్రనేతలు అద్వాని, వెంకయ్యనాయుడు, సుష్మాస్వరాజ్‌, అరుణ్‌జైట్లీ వంటి నేతలు కొన్ని నెలలపాటు చర్చించి అసెంబ్లీ స్థానాల పెంపు అంశాన్ని ఏపీ విభజన చట్టంలో పొందుపర్చారని గుర్తుచేశారు. కిషన్‌రెడ్డి కామెంట్లు చేసేముందు పార్టీ అగ్రనేతల నిర్ణ‌యాల‌ను ఓ సారి తెలుసుకోవాల‌ని అన్నారు.