టీఆర్ఎస్ నేత‌లు బందిపోటు దొంగ‌లు ఒక‌టేన‌ట‌

July 07, 2020
CTYPE html>
తెలంగాణ‌లో జ‌రుగుతున్న ఆర్టీసీ స‌మ్మె కేంద్రంగా...రాజ‌కీయ పార్టీలు త‌మ ఎత్తులు పైఎత్తులు వేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఒక్కోపార్టీ ఒక్కో వ్యూహంతో ముందుకు సాగుతోంది. తెలంగాణ‌లో బ‌ల‌ప‌డాల‌ని భావిస్తున్న బీజేపీ ఇదే అవ‌కాశంగా త‌న దూకుడు పెంచుతోంది. తాజాగా, బీజేపీ నేతలు రాజ్ భవన్లో గవర్నర్ తమిళిసై సౌందర్రాజన్ను కలిసి ఆర్టీసీ సమ్మెపై జోక్యం చేసుకోవాలని కోరుతూ వినతిపత్రం అందించారు. గవర్నర్ ను కలిసిన సందర్భంగా 40 నిమిషాలపాటు ఆర్టీసీ సమ్మెపై బీజేపీ నేత‌ల‌ బృందం ఆమెకు వివరించినట్లు తెలిసింది. అనంత‌రం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ మీడియాతో మాట్లాడుతూ....సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు.
సమ్మెపై గవర్నర్ హోదాలో జోక్యం చేసుకుని ప్రభుత్వంతో మాట్లాడాలని విజ్ఞప్తి చేశామ‌ని  బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ తెలిపారు. ఆర్టీసీ ఆస్తులను టీఆర్ఎస్ నేతలు ఎలా కొల్లగొడుతున్నారో, పెట్రోల్ బంకుల ఆదాయాన్ని ఆర్టీసీకి దక్కకుండా ఎలా దోపిడీ చేస్తున్నారో వివరించినట్లు తెలిపారు. ‘‘అడవుల్లో అర్ధరాత్రి బస్సులు ఆపి ప్రయాణీకులను దోచుకునే బందిపోటు దొంగల గురించి విన్నాం, చూశాం.. ఇప్పుడు పట్టపగలే కొందరు టీఆర్ఎస్ నేతలు బందిపోటు దొంగల్లా ఆర్టీసీ ఆస్తిని దోచుకుంటున్నారు. రూ.80 వేల కోట్ల ఆస్తులు ఉన్న ఆర్టీసీలోని 115 పెట్రోల్ బంకుల్లో అధికార పార్టీ నేతలు పైసా పెట్టుబడి పెట్టకుండా సర్వీస్ ప్రొవైడర్స్ పేరు మీద చొరబడి 60 శాతం ఆర్టీసీ ఆదాయాన్ని దోచేస్తున్నారు”అని ఆరోపించారు.
12 రోజులుగా ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తుంటే సీఎం కేసీఆర్ మానవత్వం లేకుండా వ్యవహరిస్తున్నారని ల‌క్ష్మ‌ణ్ మండిప‌డ్డారు.
హైకోర్టు ఆదేశించినా కార్మికులను చర్చలకు పిలవకపోవడాన్ని తప్పుపట్టారు. నియంతృత్వ పోకడలు, అబద్ధపు మాటలతో కోర్టులను సైతం తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. అధికార పార్టీ ఎంపీ కేకేతో చర్చలకు ఆర్టీసీ కార్మికులు సిద్ధంగా ఉన్నప్పటికీ, సీఎం నుంచి సానుకూలత రాలేదని కేకే అంటున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థమవుతోందన్నారు. ఇద్దరు కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నా.. కొందరు గుండెపోటుకు గురైనా సీఎంలో చలనం లేదని, సెప్టెంబర్ నెల జీతం ఇవ్వకుండా కార్మిక చట్టాలను, రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నారని ఆరోపించారు. సమ్మెకు పోతే ఆర్టీసీ కార్మికులపై ఇంత కక్ష కట్టడం తగదని, ఆర్టీసీ కుటుంబాల ఉసురు సీఎం కేసీఆర్ కు తప్పకుండా తగులుతుందన్నారు. ఆర్టీసీ కార్మికులు ఆత్మస్థైర్యం కోల్పోవద్దని, ఆత్మహత్యలకు పాల్పడవద్దని, వారికి అండగా తమ పార్టీ ఉంటుందని హామీ ఇచ్చారు. సమస్య పరిష్కారమయ్యే వరకు కార్మికులతో కలిసి పోరాడుతమని, నియంత కేసీఆర్ మెడలు వంచుతామని లక్ష్మణ్ ఆర్టీసీ కార్మికులకు భరోసా ఇచ్చారు. విద్యాసంస్థలకు ఏకంగా 22 రోజులు దసరా సెలవులిచ్చి విద్యా వ్యవస్థను దెబ్బతీశారని ధ్వజమెత్తారు.