టీఆర్ఎస్ లో ఇంత రచ్చ జరుగుతోందా? 

June 06, 2020

తెలంగాణలో అధికార పార్టీ టీఆర్ఎస్ లో బయటకు అంతా బాగున్నట్లుగానే కనిపిస్తున్నా... లోలోపల రాజుకుంటున్న వివాదాలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. టీఆర్ఎస్ కు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేల మధ్య రాజుకున్న కొత్త వివాదం... మొన్నటిదాకా మిత్రులుగా ఉన్న వారిని ఏకంగా శత్రువులుగా మార్చేసింది. ఆసక్తి రేకెత్తిస్తున్న ఈ వివాదం... నిజామాబాద్ జిల్లాలో హాట్ టాపిక్ గా మారిపోయింది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు చెందిన నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే గణేశ్ బిగాల, ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిలు ఇప్పుడు నిజంగానే బద్ధ శత్రువులుగా మారిపోయారన్న వాదనలు వినిపిస్తున్నాయి.

వాస్తవానికి మొన్నటిదాకా గణేశ్, జీవన్ రెడ్డిలు క్లోజ్ ఫ్రెండ్సే. జీవన్ రెడ్డికి సొంత పార్టీకి చెందిన చాలా మంది ఎమ్మెల్యేలతో పడకున్నా... గణేశ్ తో మాత్రం అలాంటి వివాదాలే లేవు. ఒకరికి ఒకరు అన్నట్లుగా సాగిన వీరి మధ్య సొసైటీ ఎన్నికలు చిచ్చు పెట్టేశాయి. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యేగా ఉన్న గణేశ్ సొంతూరు మక్లూరు... ఆర్మూరు నియోజకవర్గంలోనే ఉంది. మక్లూరు సొసైటీ చైర్మన్ గా తన తండ్రిని ఏకగ్రీవంగా ఎంపిక చేసేందుకు గణేశ్ యత్నించారట. అయితే తన నియోజకవర్గంలో గణేశ్ హవా పెరుగుతోందని గ్రహించిన జీవన్ రెడ్డి.. మక్లూర్ సొసైటీ ఎన్నికల్లో గణేశ్ ఎంట్రీని అడ్డుకున్నారట. అంతేకాకుండా మక్లూర్ సొసైటీ చైర్మన్ పదవిని తన అనుచరులకు దక్కేలా పావులు కదిపారట.

ఇంకేముంది... తన సొంతూరుకు చెందిన సొసైటీకి తన తండ్రిని చైర్మన్ ను చేయాలన్న తన యత్నాన్ని ఎలా అడ్డుకుంటారంటూ గణేశ్ ఒకింత ఆగ్రహం వ్యక్తం చేశారట. అయినా పొరుగు నియోజకవర్గానికి తాను ఎమ్మెల్యేగా ఉంటే.. తన సొంతూరుకు రాకుండా ఎలా ఉంటానని కూడా గణేశ్ మండిపడ్డారట. తన తండ్రికి దక్కే పదవిని అడ్డుకున్న జీవన్ రెడ్డితో మునుపటిలా స్నేహాన్ని కొనసాగించేందుకు గణేశ్ ఇప్పుడు ససేమిరా అంటున్నారట. వెరసి సొసైటీ చైర్మన్ పదవిపై నెలకొన్న వివాదం ఇద్దరు మిత్రులుగా ఉన్న టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను శత్రువులుగా మార్చేసిందన్న మాట.