వెల‌మ‌లకు, రెడ్ల కు బలుపు ... టీఆర్ఎస్ ఎమ్మెల్యే షాకింగ్ కామెంట్

February 23, 2020

మ‌హబూబాబాద్‌ ఎమ్మెల్యే శంకర్‌నాయక్ కులాలను ప్రస్తావిస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగ‌తి తెలిసిందే. చర్చిలో దుస్తుల పంపిణీ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ వెలమ, రెడ్డిలకు దొరలమనే బలుపు అన్నారు. మనుషులకు మూడు రకాల బలుపులు ఉంటాయి అని అన్నారు. ''వెలమ, రెడ్డిలకు దొరలమనే బలుపు. బాగా చదువుకున్నామని రెండో రకం బలుపు. డబ్బు ఎక్కువగా ఉందని మూడో రకం బలుపు ఉంటుంది'' అని అన్నారు. మనుషుల్లో ఎవరిని కోసినా రక్తమే వస్తుందని, కానీ మనుషుల్లో బలుపులు ఎక్కువ గా ఉన్నాయని అన్నారు.

అయితే, శంక‌ర్‌నాయ‌క్ త‌న కామెంట్ల‌పై క్లారిటీ ఇచ్చారు. వెలమలను, రెడ్లను కావాలని కించ పరచలేదని శంకర్ నాయక్ అన్నారు. తన మాటల వల్ల ఎవరి మనోభావాలైనా దెబ్బతిని ఉంటే.. క్షమాపణ చెబుతున్నానని పేర్కొన్నారు. వెలమలు, రెడ్ల సహకారంతోనే తాను ఎమ్మెల్యేనయ్యానని శంకర్‌ నాయక్‌ చెప్పారు. కొందరు తన వ్యాఖ్య‌లపై అనవసర రాద్ధాంతం చేస్తున్నారని అన్నారు. కేసీఆర్ దయవల్లే నేను రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచానాన్న ఆయన ఆ వ్యాఖ్యల గురించి కేసీఆర్‌కు కూడా చెప్పానని వాటిని ఉద్దేశపూర్వకంగా మాట్లాడలేదని కేసీఆర్‌కు వివరించానని అన్నారు. రెడ్డి, వెలమ సోదరుల అండ తనకుందన్న ఆయన వారి సహకారంతోనే నేను ఎమ్మెల్యేనయ్యానని అన్నారు.

కాగా, శంకర్ నాయక్ వ్యాఖ్యలపై రెడ్డి, వెలమ వర్గాలకు చెందిన వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమను చెడుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. శంకర్ నాయక్ తీరు వల్ల పార్టీకి , ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోందని పార్టీలోనూ చర్చ జరుగుతోంది.