గురి చూసి కొట్టిన తెరాస ఎంపీ... ఏం తెలివి స్వామీ !

July 04, 2020

జోగినిప‌ల్లి సంతోష్ కుమార్.. తెలంగాణ గ‌డ్డ మీద ఇవాల్టి రోజున ఈ పేరు తెలీనోళ్లు ఎవ‌రున్నారు చెప్పండి. తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ కు అత్యంత స‌న్నిహితంగా.. నిత్యం ఆయ‌న వెంటే ఉండే వారిలో ఆయ‌న అత్యంత కీల‌కం. ఎంత‌టి ప్ర‌ముఖులైనా.. సారు అపాయింట్ మెంట్ కావాలంటే సంతోష్ మాష్టారి ట‌చ్ లోకి వెళ్లాల్సిందే. అప్పుడు మాత్ర‌మే సీఎం సాబ్ వారిని క‌లుసుకునే అవ‌కాశం ఉంటుంది. మ‌రి.. అలాంటి పొజిష‌న్లో ఉన్న సంతోష్ ఎంత‌టి ప్ర‌ముఖుడో ప్ర‌త్యేకించి చెప్పాలా?
తానున్న ప‌వ‌ర్ పొజిష‌న్ తెలిసిన‌ప్ప‌టికీ ఒద్దిక‌గా ఉండ‌టం మాత్రం సంతోష్ ద‌గ్గ‌ర చూసి నేర్చుకోవాల్సిందే. ఎక్క‌డా ఇజం ప్ర‌ద‌ర్శించ‌కుండా ఉండ‌టం.. సొంతోళ్ల మ‌నుల్ని ఎప్ప‌టిక‌ప్పుడు స‌రికొత్త‌గా దోచుకోవ‌టం లాంటి విష‌యాల్లో ఆయ‌న చూపించే క‌మిట్ మెంట్ కు అలా ఇలా ఉండ‌దు.
తాజాగా కేటీఆర్ పుట్టిన రోజు సంద‌ర్భంగా మిగిలిన వారికి ఏ మాత్రం త‌గ్గ‌కుండా.. ఆ మాట‌కు వ‌స్తే మిగిలిన వారి కంటే ఎక్కువ‌న్న‌ట్లుగా రియాక్ట్ అయ్యారు సంతోష్. కేటీఆర్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా గిఫ్ట్ ఏ స్మైల్ కార్య‌క్ర‌మాన్ని తీసుకున్న ఆయ‌న కీస‌ర‌గుట్ట ఫారెస్ట్ ను ద‌త్త‌త తీసుకుంటున్న‌ట్లు వెల్ల‌డించారు. ఎంపీ నిధుల‌తో 2042 ఎక‌రాల అట‌వీ ప్రాంతాన్ని అభివృద్ధి చేయ‌నున్న‌ట్లు సంతోష్ వెల్ల‌డించారు.
ఒక అట‌వీ ప్రాంతాన్ని ఎకో టూరిజం ప్రాజెక్టుగా మారుస్తాన‌ని సంతోష్ వెల్ల‌డించారు. ఇదంతా కేటీఆర్ పుట్టిన‌రోజును పుర‌స్క‌రించుకొని చేయ‌ట‌మా? లాంటి సందేహాల్ని ద‌య‌చేసి సంధించ‌కండి. కేటీఆర్ బ‌ర్త్ డే గిఫ్ట్ గా కీస‌ర‌గుట్ట రిజ‌ర్వ్ ఫారెస్ట్ ను ద‌త్త‌త తీసుకొని హైద‌రాబాద్ వాసుల‌కు బ‌హుమ‌తిగా ఇస్తాన‌న్న ఆయ‌న‌.. ప‌నిలో ప‌నిగా తాను స్వీక‌రించిన ఛాలెంజ్ కు మ‌రికొంద‌రు ప్ర‌ముఖుల్ని ట్యాగ్ చేశాడు.
ఆ జాబితాలో సినీ.. రాజ‌కీయ.. వ్యాపార ప్ర‌ముఖులు ఉన్నారు. ఆంధ్రా.. తెలంగాణ ప్రాంతాల‌కు చెందిన వారుండ‌టం మ‌రో విశేషం. ఇంత‌కీ సంతోష్ ట్యాగ్ చేసిన ప్ర‌ముఖుల జాబితాలోకి వెళితే.. క‌విత‌.. ద‌ర్శ‌కుడు పైడిప‌ల్లి వంశీ.. న‌టులు దేవ‌ర‌కొండ విజ‌య్.. నితిన్.. పారిశ్రామిక‌వేత్త ముత్తా గోపాల్ మాత్ర‌మే కాదు.. బ‌ర్త్ డే బాయ్ కేటీఆర్ కూ ట్యాగ్ చేశారు. ఇదంతా చూస్తే.. ఎవ‌రి పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఛాలెంజ్ స్వీక‌రించారో.. వారినే ట్యాగ్ చేయ‌టం సంతోష్ తెలివికి నిద‌ర్శ‌నంగా చెప్పాలి.
ఒక దెబ్బ‌కు రెండు పిట్ట‌ల‌న్న దాన్ని మార్చి రాసేలా.. ఒక్క ఛాలెంజ్.. ప‌లువురు ప్ర‌ముఖుల‌న్న‌ట్లుగా తాను చేస్తున్న ప‌నికి చేదోడువాదోడు సాయానికి క‌మిట్ చేసిన సంతోష్ ఎంత చ‌తుర‌త ప్ర‌ద‌ర్శించారో క‌దా? సీఎం కేసీఆర్ కు అంత స‌న్నిహితంగా ఉన్న‌ప్పుడు ఆ మాత్రం తెలివి రాకుండా ఉంటుందా ఏంటి?