కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు గాలం.. అసలు కారణం ఇదే

May 30, 2020

తెలంగాణలో అధికారంలో ఉన్న తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వానికి ఢోకా లేదు. ఆ పార్టీ ఇటీవల జరిగిన ముందుస్తు ఎన్నికల్లో భారీ మెజారిటీతో విజయం సాధించింది. అధికారాన్ని చేపట్టిన తర్వాత ఆ పార్టీ నేతలు ‘‘మాకు మిగిలిన పార్టీ ఎమ్మెల్యేలతో పని లేదు.. ఇంకెవరినీ చేర్చుకోము’’ అని బహిరంగంగానే చెప్పారు. ఇదే విషయాన్ని గులాబీ బాస్, తెలంగాణ ముఖ్యమంత్రి కూడా పలుమార్లు స్పష్టం చేశారు. ‘‘మా పార్టీలోకి చాలా మంది వస్తామంటున్నారు. మేమే గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం లేదు. వాళ్లంతా మేము ఎప్పుడంటే అప్పుడు టీఆర్ఎస్‌లోకి వస్తారు’’ అని ఆయన ఇటీవల కూడా మీడియాతో చెప్పారు. కానీ, ఇప్పుడు రాష్ట్రంలో పరిస్థితి దీనికి భిన్నంగా ఉంది. కాంగ్రెస్ పార్టీలోని ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా గులాబీ గూటికి చేరిపోతున్నారు. టీడీపీ చెందిన సండ్ర కూడా వారి బాటలోనే పయనించబోతున్నారు.

కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు సక్కు, కాంతారావు, చిరుమర్తి లింగయ్య, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య గులాబీ కండువా కప్పుకోబోతున్నట్లు ప్రకటించగా, ఇల్లందు ఎమ్మెల్యే బానోతు హరిప్రియ నాయక్ కూడా టీఆర్ఎస్‌లో చేరుతున్నానంటూ ప్రకటించారు. వీరితో పాటు తాజాగా మాజీ హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి కూడా ఆ పార్టీలో చేరబోతున్నారని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే దీనికి సంబంధించిన చర్చలు కూడా జరిగాయని విశ్వసనీయంగా తెలిసింది. వీళ్లే కాదు.. కాంగ్రెస్ పార్టీకి చెందిన మరికొందరు ఎమ్మెల్యేలను కారెక్కించే ప్రయత్నాలు జోరుగా జరుగుతున్నాయి. ఇప్పటికే ముగ్గురు ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేల చేరికతోనే టీఆర్‌ఎస్‌, మజ్లిస్‌ ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎన్నిక ఖాయమైనా.. ఆ పార్టీ ఆపరేషన్‌ ఆకర్ష్‌ను కొనసాగించడం వెనుక ఓ వ్యూహమే ఉందని తెలుస్తోంది. 

తాజాగా ఆపరేషన్‌ ఆకర్ష్‌కు పదును పెంచడానికి లోక్‌సభ ఎన్నికలే కారణం అని సమాచారం. కేంద్రంలో ఏ పార్టీకీ పూర్తి మెజార్టీ వచ్చే పరిస్థితి లేదని ఇటీవల పలు సర్వేలలో వెల్లడైన విషయం తెలిసిందే. అదే సమయంలో ఫెడరల్‌ ఫ్రంట్‌తో అక్కడ చక్రం తిప్పాలని భావిస్తున్నారు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్. ఇందులో భాగంగానే రాష్ట్రంలోని 17 స్థానాలనూ తమ ఖాతాలో వేసుకోవాలన్న పట్టుదలతో ఉన్నారు. అందుకే శాసనసభ ఎన్నికల్లో చతికిలపడిన కాంగ్రెస్‌ను మరింత ఆత్మరక్షణలో పడేసి.. లోక్‌సభ ఎన్నికల్లోనూ పైచేయి సాధించాలన్న వ్యూహంలో టీఆర్‌ఎస్‌ ఉందనే టాక్ వినిపిస్తోంది. దీనికితోడు, లోక్‌సభ స్థానాల్లోని ఎమ్మెల్యేలను తమ వైపు లాక్కోవడం వల్ల అక్కడి ఓటు బ్యాంకుపై కూడా తీవ్రంగా ప్రభావం చూపుతుందని, తద్వారా అన్ని పార్లమెంట్ స్థానాలను కైవశం చేసుకోవచ్చని టీఆర్ఎస్ అధిష్ఠానం భావిస్తున్నట్లు వినికిడి.