అమెరికన్ల వెర్రి వేపకాయంత.. ట్రంప్ ది గుమ్మడికాయంత

August 13, 2020

ఒకరు కాదు ఇద్దరు కాదు.. యావత్ ప్రపంచమంతా ఒక తీరులో ఉంటే.. అమెరికన్లు మాత్రం మరో తీరులో వ్యవహరిస్తున్న వైఖరి ఇప్పుడు ప్రపంచ ప్రజల్ని విస్మయానికి గురి చేస్తుంది. మాయదారి కరోనాను తప్పించుకోవటానికి ముఖానికి మాస్కు మంచిదన్న విషయాన్ని ప్రతిఒక్కరు చెబుతున్నదే.

అందుకు భిన్నంగా పుట్టింది ఎందుకు? ముఖానికి మాస్కు పెట్టుకోవటానికా? నేను అమెరికన్ ను స్వేచ్ఛగా పుట్టాను.. స్వేచ్చగా జీవిస్తాను. ముఖానికి మాస్కు పెట్టుకోవటానికి నేను వ్యతిరేకం.. మూతికి మాస్కు పెట్టుకోకపోతే ఏమవుతుంది? చావనైనా చస్తాను కానీ ముఖానికి అడ్డుగా మాస్కుపెట్టుకునే చాన్సే లేదని వాదించే అమెరికన్లు బోలెడంతమంది కనిపిస్తారు.

ముఖానికి మాస్కు కట్టుకున్నంతనే ఉన్న స్వేచ్ఛ మాయమవుతుందని ఫీలయ్యే అమెరికన్ల వాదన వింటే.. వారి మెదడులో వేపకాయంత వెర్రితనం ఉందా? అన్న సందేహం రాక మానదు. ప్రత్యేక పరిస్థితుల్ని గుర్తించటం.. అందుకు తగ్గట్లు వ్యవహరించటం చాలా అవసరం. ఆ విషయాన్ని వదిలేసి.. అర్థం లేని భావోద్వేగాల్ని తెర మీదకు తీసుకొస్తున్న వైనం చూస్తే.. నవ్వాలో .. ఏడవాలో అర్థం కాని పరిస్థితి. కంటికి కనిపించని శత్రువుతో యుద్ధం చేస్తున్నప్పుడు అన్ని అనుకున్నట్లు జరగవన్న సత్యాన్ని అమెరికన్లు ఎందుకు గుర్తించరన్నది ప్రశ్న.

మాస్కును వ్యతిరేకించే అమెరికన్లకు ఏ మాత్రం తీసిపోని రీతిలో వ్యవహరిస్తూ..వార్తల్లో నిలుస్తున్నారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. కరోనాను కట్టడి చేయటం కోసం ముఖానికి మాస్కులు ధరించాలని తాను ఆదేశాలు జారీ చేయనని స్పష్టం చేస్తున్నారు ట్రంప్. మాస్కులు ధరించాలా? వద్దా? అన్న విషయంలో అమెరికన్లకు స్వేచ్ఛ ఇవ్వాలని తాను అనుకుంటున్నట్లుగా పేర్కొన్నారు.

అందరూ మాస్కులు ధరిస్తే.. వైరస్ అంతా మాయమవుతుందన్న వాదనతో తాను ఏకీభవించనని చెప్పే ట్రంప్ మాటల్ని అందరూ సమర్థిస్తారు. అదే సమయంలో.. ముఖానికి మాస్కు ధరించినంతనే వైరస్ మాయం కాదు కానీ.. దాని తీవ్రత తగ్గుతుంది.. కేసుల నమోదులో తేడా వచ్చే వీలుందన్న సత్యాన్ని గ్రహించాల్సిన అవసరం ఉంది. ఇదంతా చూస్తుంటే.. అమెరికన్ల మెదళ్లలో వేపకాయంతా వెర్రి ఉంటే.. ఆ దేశాధ్యక్షుడు ట్రంప్ మెదడులో మాత్రం గుమ్మడికాయంత వెర్రి ఉందన్న భావన కలుగక మానదు.