​భారతీయులకు దిమ్మ తిరిగే షాకిచ్చిన ట్రంప్.. 

August 13, 2020

మరికొద్ది నెలల్లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరుగుతున్న వేళ.. తనకు పెరుగుతున్న వ్యతిరేకతను తగ్గించుకోవటానికి భారతీయులకు భారీ షాకిచ్చారు డొనాల్డ్ ట్రంప్. నిత్యం ఏదో ఒక అంశంపై వార్తల్లో ఉండే ఆయన.. తరచూ తన మాటలతోనో.. చేతలతోనో ఎవరో ఒకరిని టార్గెట్ చేయటం కనిపిస్తుంటుంది. తాజాగా ఆయన తీసుకున్న నిర్ణయం అమెరికాతో పాటు భారతీయులకుసైతం నష్టాన్ని తెచ్చి పెడుతుందన్న మాట వినిపిస్తోంది.

విదేశీ వర్కర్లు అమెరికాకు రాకుండా సస్పెండ్ చేస్తూ మంగళవారం ట్రంప్ సర్కారు ప్రత్యేక ఆదేశాల్ని జారీ చేసింది. దీంతో హెచ్1బీ వీసాలతో పాటు ఎల్ వీసాలు.. హెచ్ 2బీ సీజనల్ వర్కర్ వీసాలు.. జే వీసాలతో పాు అమెరికాకు వచ్చే వారికి తాత్కాలికంగా బ్రేకులు వేసినట్లుగా చెబుతున్నారు. ఈ కొత్త ఆదేశాలు జూన్ 24 (అంటే మరో రెండు రోజుల్లో) అమల్లోకి రానున్నాయి. ఈ ఆదేశాలు డిసెంబరు 31 నాటి వరకూ అమలవుతాయని చెబుతున్నారు. 

దీంతో.. అమెరికాలో ఉద్యోగాలకు అప్లై చేసుకునేవారికి భారీగా నష్టం వాటిల్లేలా చేస్తుంది. అమెరికాలో ఉద్యోగాల ద్వారా లబ్థి పొందుతున్న వారిలో భారతీయులున్నారు. అమెరికా ఫస్ట్ పేరుతో జాతీయ భావాన్ని రగల్చటం ద్వారా అధ్యక్ష ఎన్నికల్లో విజయాన్ని సొంతం చేసుకునే క్రమంలోనే ట్రంప్ ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లుగా చెబుతున్నారు.

మహమ్మారి పుణ్యమా అని ట్రంప్ కు అధ్యక్ష ఎన్నికల్లో ప్రస్తుతం ఎదురుగాలి వీస్తోంది. ఇలాంటివేళ.. తన అమ్ములపొదిలో ఆయుధమైన జాతీయవాదాన్ని బయటకు తీయటం ద్వారా.. అమెరికన్లకు మేలు చేస్తున్నానన్న భావనను కలుగుజేసి ఎన్నికల్లో లబ్థి పొందాలని భావిస్తున్నారు. అయితే.. అమెరికన్ కంపెనీలకు సైతం ట్రంప్ నిర్ణయం దెబ్బేనని చెబుతున్నారు. ప్రతిభతో పాటు తక్కువ వేతనానికి పని చేసే విదేశీయులకు అవకాశం ఇవ్వకుండా స్థానికులకు అవకాశాలు ఇవ్వాలని చెప్పటం ద్వారా.. తమ వ్యాపార ప్రయోజనాల్ని ట్రంప్ సర్కారు దెబ్బ తీస్తుందన్న వాదన ఉంది. 

ట్రంప్ తాజా ఆదేశాల కారణంగా అనధికారికంగా 5.25 లక్షల టాలెంటెడ్ ఇమ్మిగ్రెంట్స్ వారి కుటుంబ సభ్యులు ఎవరూ అమెరికాలో అడుగు పెట్టే అవకాశం లేకుండా పోయింది. ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయంతో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ 1.5 కోట్ల ఉద్యోగాల్ని కోల్పోయే అవకాశం ఉందంటున్నారు. ట్రంప్ తీసుకున్న తాజా నిర్ణయంతో ఆయనకు కలిగే మేలు ఇప్పటికిప్పుడు చెప్పలేమని.. చాలా అంశాలు ఇందులో ఉన్నాయని చెబుతున్నారు. మరేం జరుగుతుందో చూడాలి.