ఎన్నారైలకు చేదు వార్త తెలిపిన ట్రంప్

August 09, 2020

రాబోయే రోజుల్లో కొత్త వీసా ఆంక్షలను ప్రకటించనున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. అయితే, ఏ వివరాలు వెల్లడించలేదు. కానీ కరోనా వల్ల విపరీతంగా నిరుద్యోగం పెరిగిన నేపథ్యంలో ఇతర దేశాల నిపుణులకు ఇచ్చే వీసాల్లో కోత పడొచ్చు లేదా ఆంక్షలుండొచ్చని తెలుస్తోంది. 

పరిస్థితును మెరుగుపరిచేందుకు  తాత్కాలికంగా కఠిన నిర్ణయాలు ఉండొచ్చే విషయాన్ని మాత్రం ట్రంప్ వెల్లడించారు. అయితే, ట్రంప్ వ్యాఖ్య అనంతరం ఫాక్స్ న్యూస్ చీఫ్ వైట్ హౌస్ కరస్పాండెంట్ జాన్ రాబర్ట్స్ హెచ్ -1 బి, హెచ్ -2 బి, ఎల్ -1, జె -1 వీసాలపై ఆంక్షలు విధించనున్నట్లు సంచలన ట్వీట్ చేశారు.

కరోనావైరస్ మహమ్మారి మధ్య, అమెరికన్లలో అధిక నిరుద్యోగంతో సహా, ఒక పెద్ద ఆర్థిక పతనానికి దారి తీసిన నేపథ్యంలో ఈ ఏడాది చివరినాటికి వీసాలను నిలిపివేయాలని ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఉత్తర్వుపై సంతకం చేయనున్నట్లు సమాచారం. వలసల నిరోధానికి ట్రంప్ చేసిన తాజా చర్య అది.

ఇది నిరుద్యోగం కోసం అని పైకి చెబుతున్నా... రాబోయే ఎన్నికలే ఈ వీసా నిబంధనల టార్గెట్ అని తెలుస్తోంది. ఏప్రిల్‌లో, కొంతమంది విదేశీయులకు యుఎస్ గ్రీన్ కార్డుల జారీని తాత్కాలికంగా నిలిపివేయడం కూడా ఇందులో వ్యూహమే అంటున్నారు.

ఏ వీసాలు ఎవరికి?

H-1B వీసాలు -  సైన్స్, ఇంజనీరింగ్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నిపుణలకు ఇచ్చేవి

H-2B వీసాలు - హోటల్, భవన నిర్మాణ సిబ్బంది వంటి సీజనల్ కార్మికులకు ఇచ్చేవి

L-1 వీసాలు - పెద్ద కార్పొరేట్ల కోసం పనిచేసే ప్రతినిధులకు ఇచ్చేవి

J-1 వీసాలు - పరిశోధకులు, ప్రొఫెసర్లు, సాంస్కృతిక కార్యక్రమాలు, వర్క్ ఎక్జేంజ్ ఇచ్చేవి.