భారతీయుల ఆశలను చిదిమేసిన ట్రంప్

August 03, 2020

ట్రంప్ అస్సలు నమ్మదగిన లీడర్ కాదు. ఈరోజు ఫ్రెండ్ అంటాడు. రేపు నీ అంతు చూస్తా అంటాడు. మళ్లీ ఎల్లుండి నువ్వే బెస్ట్ ఫ్రెండ్ అంటాడు. ట్రంప్ తాను చేసిన తప్పులకు అందరినీ బలిచేస్తున్నారు. ఎంతో మంది భారతీయ వైద్యులు అమెరికన్లకు సేవ చేస్తూ ప్రాణాలు విడుస్తున్నారు. తాజాగా నలుగురు ఈ ప్రమాదంలో పడ్డారు. భారత్ పెద్ద సంఖ్యలో క్లోరోక్విన్ డ్రగ్ పంపి ఆదుకుంది. అయినా తన దాకా వచ్చేసరికి తన ఇష్టమొచ్చిన నిర్ణయం తీసుకున్నారు ట్రంప్. మాకు మాత్రం అవసరం కాబట్టి మేం పంపం అంటే కోపగించుకున్న ట్రంప్... అమెరికన్లకు ఉద్యోగాలు అవసరం కాబట్టి మిమ్మల్ని గెంటేస్తాం అంటున్నాడు. తాజాగా ఇమ్మిగ్రేషన్ పాలసీని రద్దు చేస్తూ నిర్ణయం తీసేసుకున్నారు అమెరికా అధ్యక్షుడు. 

 

ట్రంప్ తాజా నిర్ణయం అక్కడ ఇంకా గ్రీన్ కార్డ్ రాని వారికి, దాని కోసం ఎదురుచూస్తున్నవారికి, చదువుకోవడానికి వెళ్లిన వారికి తీవ్ర నష్టం చేయనుంది. ఇమ్మిగ్రేషన్  పాలసీపై కఠిన ఆంక్షలు పెడితే... అమెరికాలో స్థిరపడటం కుదరదు. అసలు అమెరికా వెళ్లడమే కుదరదు. అమెరికాకు వెళ్లే వారిలో చైనా వారు నెం.1 స్థానంలో ఉంటే... ఇండియా రెండో స్థానంలో ఉంటుంది. మన వారి కలలు అన్నీ అమెరికా చుట్టూ తిరుగుతుంటాయి. ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం భారతీయుల ఆశలను చిదిమేసింది. కరోనా సృష్టించిన విలయంతో అమెరిన్ల ఉద్యోగాలు పోయాయి. అందుకే అమెరికాలో దొరికే ప్రతి ఉద్యోగమూ అమెరికన్ కే దక్కాలన్న ఉద్దేశంతో ట్రంప్ ఈ  నిర్ణయం తీసుకున్నారు. 

వాస్తవానికి ఈ పరిస్థితి వచ్చేది కాదు. ట్రంప్ కరోనాను తీవ్రంగా నిర్లక్ష్యం చేశారు. దీంతో అది రావడం రావడమే అమెరికాలో మూడో దశలోకి వెళ్లిపోయింది. లక్షల మంది చైనీయులు జనవరిలో అమెరికాకు వచ్చి జనంలో కలిసిపోయారు. దీంతో అమెరికా గట్టిగా టెస్టులు చేయడం మొదలుపెట్టేనాటికి పరిస్థితి అదుపులోలేదు. లక్షలాది ఉద్యోగాలు పోయాయి. కంపెనీలు నాశనం అయ్యాయి. ఆ నిర్లక్షం ఇపుడు ఇండియన్ల కొంప ముంచింది. ఈ ఏడాది ఎన్నికలు ఉన్న నేపథ్యంలో అమెరికన్ల దృష్టిలో తప్పు దిద్దుకోవడానికి ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నారు.