ఇండియా టూర్లో ట్రంప్ ’మాస్ కోరిక‘ తీరుతుందా?

August 14, 2020

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాటలు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అమెరికా అధ్యక్షులుగా పని చేసిన వారిలో ఎవరూ కూడా ట్రంప్ మాదిరి.. అధ్యక్ష స్థానానికి ఉండే గౌరవాన్ని పెంచినోళ్లే కానీ తగ్గించినోళ్లు పెద్దగా కనిపించరు. అందుకు మినహాయింపుగా ఉండే ట్రంప్.. తరచూ తన నోటికి పని చెబుతూనే ఉంటాడు. త్వరలో ఆయన భారత్ లో పర్యటించనున్నారు.
అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత ఇన్నాళ్లకు భారత్ పర్యటకు తొలిసారి వస్తున్న ఆయన.. తనతో పాటు తన సతీమణిని కూడా తీసుకు వస్తున్నారట. ఇదిలా ఉంటే.. భారత్ లో తన పర్యటన గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ట్రంప్. గత వారం మోడీ తనతో మాట్లాడినట్లు చెప్పిన ట్రంప్.. తనకు స్వాగతం పలికేందుకు లక్షలాది మంది సిద్ధంగా ఉన్నారని భారత ప్రధాని తనతో చెప్పినట్లు చెప్పారు.
ఎయిర్ పోర్టులు.. క్రికెట్ స్టేడియం వద్ద తన కోసం పెద్ద ఎత్తున రావాలంటూ కామెడీ చేశారు. అమెరికాలో మాదిరి 40-50 వేల మంది వస్తే తనకు నచ్చదని.. కనీసం 50-70 లక్షల మంది రావాలంటూ చతుర వ్యాఖ్యలు చేశారు. ప్రపంచంలోనే అతి పెద్ద క్రికెట్ స్టేడియంలో తమ సభ జరగబోతున్నట్లు చెప్పారు. మొత్తానికి.. భారత్ లో తనకున్న ఇమేజ్ ను తన తాజా పర్యటనతో ప్రపంచానికి చూపించాలని ట్రంప్ అనుకుంటున్నారా ఏంది?