3 కోతుల బొమ్మ‌కు ట్రంప్ ఫిదా!

August 12, 2020

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తొలి భారత ప‌ర్య‌ట‌న కోసం భారీగా ఏర్పాట్లు చేసిన సంగ‌తి తెలిసిందే. దాదాపు 100 కోట్ల వ్య‌యంతో ట్రంప్ 3 గంట‌ల ప‌ర్య‌ట‌న‌ను విజ‌య‌వంతం చేసేందుకు మోడీ స‌ర్కార్ ప్లాన్ చేసింది. అహ్మదాబాద్‌ విమానాశ్రయానికి ఎయిర్ ఫోర్స్ వ‌న్‌లో వ‌చ్చిన ట్రంప్‌న‌కు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఘన స్వాగతం పలికారు. ట్రంప్‌న‌కు హ‌గ్ ఇచ్చిన మోడీ...ఆయ‌న స‌తీమ‌ణి మెలానియాకు షేక్ హ్యాండ్ ఇచ్చారు. ట్రంప్‌తో పాటు ఆయన భార్య మెలానియా, కూతురు ఇవాంక ట్రంప్‌, అల్లుడు జారెడ్‌ కుష్నర్ అహ్మ‌దాబాద్ చేరుకున్నారు. శంఖాలు ఊదుతూ, డప్పు వాయిద్యాలు వాయిస్తూ, సంప్రదాయ నృత్యాలతో, గరగాటాలతో ట్రంప్‌న‌కు సంప్ర‌దాయ‌ స్వాగతం ల‌భించింది.

యూఎస్ నుంచి వార్ షిప్‌లో తెచ్చిన `బీస్ట్` వాహనంలో మొతేరా స్టేడియానికి ట్రంప్ చేరుకోనున్నారు. విమానాశ్రయం నుంచి 'నమస్తే ట్రంప్‌' వేదిక వరకు లక్షలాది మంది కళాకారులు, ప్రజలు రోడ్డుకి ఇరు వైపులా నిలబడి ట్రంప్ అండ్ ఫ్యామిలీకి ఘ‌న‌స్వాగ‌తం ప‌లికారు. సబర్మతీ ఆశ్రమాన్ని సంద‌ర్శించిన ట్రంప్ అండ్ ఫ్యామిలీ గాంధీజీ చిత్రపటానికి నూలు దండ వేసి నివాళులర్పించారు. సబర్మతీ ఆశ్రమంలో గాంధీ చరఖాను తిప్పిన‌ ట్రంప్ నూలు వడికి అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచారు. సబర్మతీ ఆశ్రమంలోని 3 కోతుల బొమ్మలు ట్రంప్‌ దంపతుల‌ను ఆక‌ట్టుకున్నాయి.

ఇప్ప‌టికే అహ్మదాబాద్ లోని మొతేరా స్టేడియంలో ట్రంప్‌ ప్రసంగాన్ని తిల‌కించేందుకు ల‌క్ష‌లాది మంది చేరుకున్నారు. ప్రజలు, ప్రజా ప్రతినిధులు, సెలబ్రిటీలు, క్రీడాకారులు, పలువురు పారిశ్రామిక వేత్తలు, బాలీవుడ్ సెలబ్రిటీలు ఇప్పటికే స్టేడియానికి చేరుకున్నారు. టాటా గ్రూప్ సంస్థల అధినేత రతన్ టాటా, బాలీవుడ్ స్టార్లు షారూక్ ఖాన్, అక్షయ్, మాధురీ దీక్షిత్, కంగనా రనౌత్ తదితరులు స్టేడియంలో సంద‌డి చేశారు. స‌భ‌లో ప్ర‌సంగించిన అనంత‌రం మధ్యాహ్నం 3.30 గంటలకు ట్రంప్ తన భార్య, కూతురు, అల్లుడితో కలిసి అహ్మదాబాద్‌ నుంచి ఆగ్రా వెళ్లి తాజ్‌మహల్ సంద‌ర్శించ‌నున్నారు.