జగన్ గాలి తీసేసిన ట్రంప్

August 14, 2020

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తొలిసారి భారత దేశ పర్యటనకు వస్తుండడం.. ఆయన రాక సందర్భంగా మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తుండడం తెలిసిందే. ట్రంప్ రాక నేపథ్యంలో అనేక విశ్లేషణలూ వినిపిస్తున్నాయి. భారతీయ అమెరికన్ల ఓట్లను మోదీ ద్వారా ఆకర్షించేందుకు ట్రంప్ వస్తున్నారని కొందరు అంటుంటే... ట్రంప్ రాక వల్ల దేశంలో ప్రస్తుతం ఉన్న ఇబ్బందికర పరిస్థుతల నుంచి ప్రజలను డైవర్ట్ చేయడంతో పాటు తన ఇమేజ్ పెంచుకోవడానికి మోదీకి ఉపయోగపడుతుందని మరికొందరు అంటున్నారు. చైనా కోణం, పాకిస్తాన్ కోణం.. ఇలా ఎన్నో జాతీయ, అంతర్జాతీయ రాజకీయాలతో ముడిపడిన విశ్లేషణలు వస్తున్నాయి. అయితే... విచిత్రంగా ట్రంప్ ఇండియా పర్యటన తెలుగు రాష్ట్రాల రాజకీయాలు, నాయకులపైనా భారీ ప్రభావమే చూపింది. ఆయన పర్యటన తెలంగాణ సీఎం కేసీఆర్‌కు లాభించగా ఏపీ సీఎం జగన్మోహనరెడ్డికి ఇరకాటంగా మారింది.
అమెరికా అధ్యక్షుడికి, ఆంధ్రా సీఎంకు ఏం సంబంధం అనుకోవచ్చు.. నిజమే ఆయనకు ప్రత్యక్షంగా ఎలాంటి సంబంధం లేదు కానీ ఆయన రాక సందర్భంగా తెలుగు సీఎంలలో ఎవరి రేంజ్ ఏంటన్నది తేలిపోయింది. ఫెడరల్ ఫ్రంట్ అంటూ హడావుడి చేసి, మోదీని, అమిత్ షాను నానా మాటలు అని... బీజేపీకి బద్ధశత్రువైన ఎంఐఎంను నెత్తికెక్కించుకుని అనేక సార్లు, అనేక రకాలుగా తమకు ఇబ్బందికరంగా మారిన తెలంగాణ సీఎం కేసీఆర్‌ను ట్రంప్ రాక సందర్భంగా ఇస్తున్న విందుకు పిలిచిన కేంద్రం.... మోదీ కాళ్లు మొక్కేందుకు సిద్ధమై, అమిత్ షా వెంట తోక ఊపుకుంటూ తిరిగే ఏపీ సీఎం జగన్‌ను మాత్రం పిలవలేదు. దీనిపై జగన్, వైసీపీ కీలక నేతలు రగిలిపోతున్నారట.
ట్రంప్ కోసం ఇస్తున్న విందుకు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ నుంచి 8 మంది ముఖ్యమంత్రులకు మాత్రమే ఆహ్వానం అందింది. పిలుపు రాష్ట్రపతి నుంచి వచ్చినా పేర్లు డిసైడైంది మాత్రం బీజేపీ పెద్దల వద్దేనన్నది అందరికీ తెలిసిన విషయమే. ఈ పిలుపు అందుకున్న 8 మందిలో కేసీఆర్ ఒకరు. మిగతా వారంతా బీజేపీ సీఎంలు, బీజేపీ కూటమి అధికారంలో ఉన్న రాష్ట్రాల సీఎంలు, ప్రస్తుతం తమతో కలిసి లేకున్నా చిరకాలంగా తమతో మైత్రి సాగించినవారు, తటస్థులే ఇందులో ఉన్నారు. వారితో పాటు కేసీఆర్‌కూ పిలుపు వచ్చింది. కానీ, మీరు ఎంతంటే అంతే అంటూ పూర్తిగా సరెండరైన జగన్‌కు మాత్రం పిలుపు రాలేదు.
దీంతో రాజకీయంగా కేసీఆర్‌కు ఇచ్చిన ప్రయారిటీ జగన్‌కు ఇవ్వలేదన్నది తేలిపోయింది. అనేక అంశాలలో తమతో విభేధించినప్పటికీ అవసరమైన బిల్లుల సమయంలో పార్లమెంటులో తమకు అనుకూలంగా వ్యవహరిస్తున్న టీఆరెస్‌ అధినేత చేసిన సాయాన్ని బీజేపీ పెద్దలు గుర్తుపెట్టుకున్నట్లే ఉన్నారు. ఈ రకమైన ప్రయారిటీ ఇచ్చి ఆయన్ను తమ చేతిలో ఉంచుకోవాలని అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది.
అదే సమయంలో ఏపీలో రాజధాని మార్పు సహా అనేక సంచలన నిర్ణయాలు తీసుకుంటూ, దానికి కేంద్రం అనుమతి ఉందని చెప్పుకొంటూ... బీజేపీ తనకు అండగా ఉందని చెప్పుకొనే ప్రయత్నం చేస్తున్న జగన్‌ను మాత్రం పిలవలేదు. దీంతో కేంద్రం వద్ద జగన్‌కు అంత సీన్ లేదన్నది స్పష్టమైపోయింది. ఈ విషయం జీర్ణించుకోలేక వైసీపీ నేతలు రగిలిపోతున్నారట. తమకు అలవాటైన పద్ధతిలో దీనంతటికీ ట్రంపే కారణమంటూ ఆయన్ను తిడుతున్నారట.