హడలెత్తిపోయే వార్త... ట్రంప్ కు కరోనా సోకిందా?

June 04, 2020

ఈ వార్త నిజంగానే ప్రపంచ దేశాలను హడలెత్తించే వార్తే. ఎందుకంటే... ప్రపంచ దేశాలన్నీ పెద్దన్నగా భావించే అగ్రరాజ్యం అమెరికాకు అధ్యక్షుడిగా కొనసాగుతున్న డొనాల్డ్ ట్రంప్ కరోనా బారిన పడితే పరిస్థితి అంతే కదా. అయినా ట్రంప్ కు కరోనా సోకడమేమిటనుకుంటున్నారా? ట్రంప్ కూడా మానవ మాత్రుడే కదా. తనతో భేటీ అయిన బ్రెజిల్ అధ్యక్షుడి ప్రెస్ సెక్రటరీ ఇప్పుడు కరోనా వైరస్ బారిన పడ్డారు. అది కూడా ట్రంప్ తో భేటీ ముగిసిన అతి కొద్దిరోజులకే ఆ సెక్రటరీ కరోనా పాజిటివ్ గా తేలారు. మరి ట్రంప్ తో భేటీలో పాలుపంచుకున్న వ్యక్తి కరోనా బారిన పడితే... ట్రంప్ ను కూడా ఆ వైరస్ వదిలిపెట్టదు కదా.

ఇటీవల అమెరికాకు వచ్చిన బ్రెజిల్ అధికారుల బృందం ఫ్లోరిడాలోని మార్ లాగో రిసార్ట్ లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో భేటీ అయ్యింది. ఈ బృందంలో బ్రెజిల్ అధ్యక్షుడు జెయిర్ బోల్సోనారోకు ప్రెస్ సెక్రటరీగా పనిచేస్తున్న పాబియో వజన్ గార్టెన్ కూడా ఉన్నారు. ట్రంప్ తో భేటీని ముగించుకుని సదరు బృందం తిరిగి బ్రెజిల్ వెళ్లిపోయింది. ఇంతదాకా బాగానే ఉన్నా... ట్రంప్ తో భేటీ తర్వాత ఐదు రోజులకు గార్టెన్... కరోనా బారిన పడ్డారట. అంటే ట్రంప్ తో భేటీ ముగిసిన ఐదు రోజులకే గార్టెన్.. కరోనా బారిన పడ్డారంటే... ఆ భేటీ నాటికే గార్టెన్ కు ఆ వైరస్ సోకినట్టే కదా అన్న వాదనలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి.

తనతో భేటీ అయిన బ్రెజిల్ అధికారి కరోనా బారిన పడ్దారన్న విషయం తెలుసుకున్నంతనే ట్రంప్ తో పాటు అమెరికా అధ్యక్షుడి కార్యాలయ అధికారులు కూడా షాక్ కు గురయ్యారు. అంతేకాకుండా ఈ విషయంపై ట్రంపే స్వయంగా స్పందించారు. తానైతే ఇప్పటిదాకా వైద్య పరీక్షలు చేయించుకోలేదని ట్రంప్ పేర్కొన్నారు. అంటే... గార్టెన్ కు కరోనా సోకిన వైనంపై ట్రంప్ ఆందోళనకు గురవుతున్నట్లే కదా. మరి ఆ వైద్య పరీక్షలేదో త్వరగా చేయించుకుంటే... ట్రంప్ కు కరోనా సోకిందో, లేదో తేలిపోతుంది కదా. తనకు కరోనా సోకిందేమోనన్న విషయంపై జనమంతా ఆందోళన చెందుతుంటే... ట్రంప్ ఇలా తానింకా వైద్య పరీక్షలు చేయించుకోలేదని చాలా ఈజీగా చెప్పడం కూడా ఇప్పుడు సంచలనంగానే మారిపోయింది. అయితే అంతా అనుమానిస్తున్నట్లుగా ట్రంప్ కు కరోనా సోకిందని తేలితే మాత్రం ప్రపంచ దేశాలన్నీ కుదేలు కావడం ఖాయమేనన్న వాదనలు వినిపిస్తున్నాయి.