అమెరికా సంచ‌ల‌నం...భార‌త్‌కు క‌ష్ట‌కాల‌మే

August 11, 2020

ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు పెద్దన్నలా భావించే అమెరికాను... అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ దుందుడుకు వైఖరి అబాసుపాలు చేస్తోంది. నిత్యం వివాదాస్పద నిర్ణయాలతో ఇరుగుపొరుగు దేశాలతో కయ్యానికి కాలు దువ్వుతున్న ట్రంప్ తీరు.. అగ్రరాజ్య గత వైభవాన్ని మసకబారుస్తోంది. స్వేచ్ఛ, విశాల దృక్పథాలకు చిరునామాగా ఉన్న అమెరికా.. ట్రంప్ రాకతో స్వార్థ ప్రయోజనాలకు నిలయంగా మారింది. ముఖ్యంగా వ్యాపార రంగంలో ట్రంప్ సర్కారు ఆలోచనలు.. ఆ దేశ ప్రతిష్ఠను దిగజార్చుతున్నాయి. ఒకప్పుడు ప్రపంచ దేశాల ఆర్థిక అసమానతల నిర్మూలనకు పెద్దపీట వేసిన పెద్దన్న.. ఇప్పుడు ఆధిపత్య పోరుకే అగ్ర తాంబూలం ఇస్తున్నారు మరి. మొత్తానికి అభివృద్ధి చెందుతున్న దేశాలు, పేద దేశాల ప్రయోజనాలకు అండగా నిలిచిన అమెరికా దృక్పథానికే ట్రంప్ తూట్లు పొడుస్తున్నారు.

భారత్‌కు ఇచ్చిన ప్రాధాన్యత వాణిజ్య హోదా (జీఎస్‌పీ)ను వెనుకకు తీసుకోవాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యోచిస్తున్నారు. తమ ఉత్పత్తులపై అధిక సుంకాలను వేస్తూ జీఎస్‌పీ ఉద్దేశాన్ని భారత్ నీరుగార్చిందంటూ ఆరోపిస్తున్న ట్రంప్.. దాన్ని ఉపసంహరించాలని చూస్తున్నారు. ఇదే జరిగితే భారత్ నుంచి అమెరికాకు ఎగుమతి అవుతున్న 5.6 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.40,000 కోట్లు) ఉత్పత్తులపై భారం పడనున్నది. ప్రస్తుతం వీటికి జీఎస్‌పీలో భాగంగా పన్నులు లేవు. నిజానికి ఇటీవల భారత్‌ను అధిక సుంకాల దేశంగా తరచూ అభివర్ణిస్తున్నారు ట్రంప్. ఈ క్రమంలో జీఎస్‌పీ అర్హత తొలగింపునకు తన సమ్మతిని తెలుపుతూ సోమవారం ఆ దేశ పార్లమెంట్‌కు లేఖలు పంపడం గమనార్హం. తద్వారా భారత్‌కు వాణిజ్య యుద్ధ సంకేతాలను ఇచ్చారు. టర్కీపైనా అగ్రరాజ్య అధ్యక్షుడు ఇదే తీరును కనబరుచడం గమనార్హం. జీఎస్‌పీ ఉపసంహరణ జరిగితే చైనా తరహాలోనే భారత్, టర్కీలపైనా అమెరికా తీరు ఉండనున్నది. ఇప్పటికే వాణిజ్య లోటును తగ్గించడానికి పదేపదే భారత్‌లో అధిక సుంకాలు ఉన్నాయని ట్రంప్ ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో జీఎస్‌పీని వెనుకకు తీసుకుని భారత్‌తోనూ ప్రతీకార సుంకాలకు తెరతీద్దామన్నదే ట్రంప్ తాజా ఆలోచన అంతరార్థమన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆరోపిస్తున్నట్లుగా భారత్‌లో అధిక సుంకాలు ఏమీ లేవని వాణిజ్య కార్యదర్శి అనుప్ ఈ సందర్భంగా వివరణ ఇచ్చారు. ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీవో) నిబంధనలకు అనుగుణంగానే భారత్ సుంకాలున్నాయని స్పష్టం చేశారు. ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాలతో పోల్చితే భారత్ వసూలు చేస్తున్న దిగుమతి సుంకాలు తక్కువేనని ఆయన చెప్పారు. జీఎస్‌పీ ఉపసంహరణ నిర్ణయం కొన్ని రంగాలనే ప్రభావితం చేస్తుందని భారత ఎగుమతిదారుల సంఘం ఎఫ్ఐఈవో అభిప్రాయపడింది. శుద్ధిచేసిన ఆహారం, తోలు, ప్లాస్టిక్, ఇంజినీరింగ్ ఉత్పత్తులు వంటి రంగాల ఎగుమతులపై జీఎస్‌పీ ప్రభావం ఉంటుందని ఎఫ్ఐఈవో అధ్యక్షుడు గణేశ్ కుమార్ గుప్తా చెప్పారు. అయితే జీఎస్‌పీ ఉపసంహరణ జరిగితే కేంద్రం ఈ రంగాల ఎగుమతులకు చేయూతనివ్వాలని ఆయన కోరారు.