ట్రంప్ ను సైతం ఫిదా చేసిన రిపోర్టులో ఏముంది?

August 12, 2020

దేశాధినేతలు మీడియాతో మాట్లాడే వేళ.. ఆచితూచి అన్నట్లు వ్యవహరిస్తుంటారు. అప్రమత్తంగా ఉంటారు. తమ నోటి నుంచి వచ్చే మాటల ప్రభావం వారికి తెలియనిది కాదు. కానీ.. ఇందుకు భిన్నంగా వ్యవహరించే వారు లేకపోలేదు. ఆ కోవలోకి వచ్చే దేశాధ్యక్షుల్లో ప్రపంచానికే పెద్దన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఒకరు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడటానికి ముందు ఒక శాస్త్రవేత్తతో భేటీ అయ్యారు. కరోనా లాంటి కిల్లింగ్ వైరస్ అంతు చూసే శక్తి సూరీడుకు ఉందన్న మాటను ఆయన చెబుతున్నారు. అంతేకాదు.. తాము చేసిన పరిశోధనలో ఆ విషయాన్ని గుర్తించినట్లు చెప్పారు. ఆయన మాటల ప్రభావంతోనే.. ఊహించని వ్యాఖ్యలు చేసిన ట్రంప్ విమర్శల పాలయ్యారు.
ఇదంతా ఒక ఎత్తు అయితే ట్రంప్ ను కలిసిన హోమ్ ల్యాండ్ సెక్యురిటీకి చెందిన సైన్స్ అండ్ టెక్నాలజీ అడ్వైజర్ విలియం బ్రియాన్ సంచలన అంశాల్ని వెల్లడించారు. ఆయన చెప్పిన దాని ప్రకారం కరోనా వైరస్ మీద అల్ట్రా వయొలెట్ రేస్ ప్రభావం చూపుతుందన్నారు. వేసవిలో కరోనా కట్టడి అవుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న చోట వైరస్ వ్యాప్తి పెద్దగా ఉండదన్నారు. వస్తువ మీద కానీ నేల మీద కానీ.. గాల్లో కానీ సూర్యరశ్శి ప్రభావం ఉండటంతో వైరస్ నశిస్తుందన్నారు. వేడి.. గాలిలోని తేమ వైరస్ మీద ప్రభావాన్ని చూపే వీలుందని చెబుతున్నారు. అయితే.. ఈ విషయాలకు సంబంధించిన అధ్యయన పత్రం ఇంకా విడుదల కాలేదు.
సూర్యరశ్శి సోకిన రెండు నిమిషాల్లోనే వైరస్ ప్రభావం తగ్గిందని.. వైరస్ తొంభై సెకన్ల వ్యవధిలోనే సగం బలాన్ని కోల్పోయిందన్నారు. అల్ట్రా వయొలెట్ కిరణాల్లో స్టెరిలైజింగ్ ప్రభావం ఉంటుందని.. దీని రేడియేషన్ కారణంగా వైరస్ కు సంబంధించిన జెనటిక్ మెటీరియల్ నశిస్తుందన్నది వాదన. అయితే.. ఈ విషయాన్ని ధ్రువీకరించటానికి వీలుగా ఎలాంటి ప్రయోగాలు చేశారన్న విషయాన్ని తేల్చాల్సి ఉంది. ఈ అధ్యయనంలోని అంశాలు శాస్త్రీయంగా సరైనవే అయితే.. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ ప్రభావం నుంచి మన దేశం ఈ వేసవి పూర్తి అయ్యే లోపు బయటపడే అవకాశం ఉందని చెప్పక తప్పదు.

బహుశా అందుకేనేమో... మన దేశంలో ఒకరి నుంచి ఒకరికి వస్తోంది కానీ... సర్ఫేస్ మీద నుంచి ఇంకొకరికి సోకిన దాఖలాలు లేవు. అందుకే మహారాష్ట్ర, ఏపీ వంటి రాష్ట్రాల్లో మూడో దశలోకి వెళ్లి ఇటలీలోగా విజృంభణ లేకపోవడానికి కారణం వేడి వాతావరణం కావచ్చేమో.