ట్రంప్ ... దెబ్బేశాడు !!

August 03, 2020

ప్రపంచ శాంతి పరిరక్షణ కోసమంటూ ఏర్పాటైన ఐక్యరాజ్యసమితి అనుబంధ విభాగాల్లో కీలకమైనదిగా భావిస్తున్న ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ)కు నిజంగానే ఇకపై ఆర్థిక గండమేనని చెప్పాలి. ప్రాణాంతక వైరస్ కరోనా వ్యవహారంలో ఆ వైరస్ ప్రాణం పోసుకున్న చైనా పట్ల సానుకూలంగా వ్యవహరించిన డబ్ల్యూహెచ్ఓ... సదరు వైరస్ ప్రపంచంలోని అన్ని దేశాలకు వ్యాపించడానికి కారణమైందని అగ్రరాజ్యం అమెరికా ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఇవే ఆరోపణలు నిజమని తేల్చేసిన అమెరికా... అందుకు ప్రతిఫలంగా డబ్ల్యూహెచ్ఓకు అందజేస్తున్న నిధులను నిలిపివేస్తున్నట్లుగా సంచలన ప్రకటన చేసింది. ఈ మేరకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బుధవారం కీలక ప్రకటన చేశారు. 

ఈ ప్రకటనలో ట్రంప్ ఏమన్నారన్న విషయానికి వస్తే... ‘డబ్ల్యూహెచ్‌ఓకు సమకూరుస్తున్న నిధులు నిలిపివేయాలని ఈ రోజు నా పాలనా యంత్రాంగాన్ని ఆదేశించాను. కరోనా వైరస్‌ వ్యాప్తి గురించి అప్రమత్తం చేయడంలో ఆ సంస్థ విఫలమైందని, కీలక విషయాలు దాచి పెట్టడంలో దాని పాత్ర ఉందని సమీక్షా సమావేశంలో అంచనాకు వచ్చాం. చైనాలో ఏం జరుగుతుందో అందరికీ తెలుసు. అమెరికా పన్ను చెల్లింపుదారులు ఏడాదికి 400 నుంచి 500 మిలియన్‌ డాలర్లు డబ్ల్యూహెచ్‌ఓకు సమకూరుస్తున్నారు. చైనా కేవలం 40 మిలియన్‌ డాలర్లు లేదా అంతకన్నా తక్కువే అందిస్తోంది. భారీ మొత్తంలో నిధులు సమకూరుస్తున్న అమెరికాకు.. సంస్థను జవాబుదారీగా ఉండాలని పట్టుబట్టడం అనేది తన కర్తవ్యంలో భాగమే’అని ట్రంప్‌ పేర్కొన్నారు.

ఈ ప్రకటనను కాస్తంత లోతుగా పరిశీలిస్తే.. భవిష్యత్తులో డబ్ల్యూహెచ్ఓకు అమెరికా నుంచి నిధులు అందే అవకాశమే లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే... కరోనా మహమ్మారి చైనాలోనే పుట్టినా దాని ప్రభావం మాత్రం అమెరికాలోనే ఎక్కువ. అమెరికాలో కరోనా పాజిటివ్ కేసులు లక్ష మార్కును దాటేయడంతో పాటు ఆ దేశ వాణిజ్య రాజధాని న్యూయార్క్ ను అతాలకుతలం చేసేసింది. వెరసి ప్రపంచ దేశాల్లో కరోనా కారణంగా అత్యంత ప్రభావిత దేశంగా అమెరికా రికార్డులకెక్కింది. ఈ నేపథ్యంలోనే చైనాపైనా, ఆ దేశానికి అనుకూలంగా వ్యవహరించిన డబ్ల్యూహెచ్ఓపైనా ఓ రేంజిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ఆ కోపాన్ని చర్యల రూపంలో ప్రదర్శించడంతో డబ్ల్యూహెచ్ఓకు అమెరికా నుంచి నిధులే నిలిచిపోయాయి.