ఆ దేశాన్ని అమెరికా కొనేస్తుందా...!

August 07, 2020

ఎప్పుడు ఎలాంటి సంచలన నిర్ణయం తీసుకుంటారో అర్ధం కానీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ భూమిపై అంటార్కిటికా తర్వాత... దాదాపు 85 శాతం మంచుతో కప్పివున్న ప్రాంతం గ్రీన్ లాండ్ పై డొనాల్డ్ ట్రంప్ కన్ను పడింది. గ్రీన్‌లాండ్‌ను కొనే అవకాశాల్ని ప్రభుత్వం తరపున పరిశీలించమని ఆయన తన సలహాదారులను కోరినట్లు తెలిసింది. డెన్మార్క్‌లో ప్రావిన్స్‌ అయిన గ్రీన్‌లాండ్‌కు స్వయంప్రతిపత్తి ఉంది. 20 లక్షల చదరపు కి.మీ విస్తీర్ణం గల గ్రీన్‌లాండ్‌ జనాభా 57వేలు.

అయితే గ్రీన్‌లాండ్‌లోని తూలేలో అమెరికాకు ఇప్పటికే వైమానిక స్థావరం ఉంది. కాబట్టి ట్రంప్‌ తీసుకుంటున్న నిర్ణయం వ్యూహాత్మకమే అని కొందరు అమెరికా మేధావులు అంటున్నారు. పైగా ఇక్కడ అపారమైన సహజవనరులు ఉన్నాయి. హైడ్రోకార్బన్‌ నిక్షేపాలు, అరుదైన ఖనిజాలు, సుదీర్ఘమైన తీర ప్రాంతం ఉంది. దీంతో దీనిపై అమెరికా అమితాసక్తితో ఉంది. కాగా, 1946లో అప్పటి అమెరికా అధ్యక్షుడు ట్రూమన్‌ గ్రీన్‌లాండ్‌ను తమకు అమ్మితే రూ.712.47 కోట్లు ఇస్తామని ప్రతిపాదనని పెట్టారు. కానీ ఈ ప్రతిపాదనను డెన్మార్క్‌ తిరస్కరించింది.

ఇక అప్పటివరకూ ఉమ్మడి పాలనలో ఉన్న గ్రీన్ లాండ్ పై 1814లో నార్వే–స్వీడన్‌ విడిపోవడంతో అధికారాలు డెన్మార్క్‌కు దక్కాయి. గ్రీన్‌లాండ్‌లో మెజారిటీ ఇన్యుట్‌ జాతిప్రజలే. వీరంతా గ్రీన్‌లాండిక్‌ భాష మాట్లాడుతారు. దీంతో ఈ ప్రాంతంపై పట్టు పెంచుకోవడంలో భాగంగా గ్రీన్‌లాండ్‌ను డెన్మార్క్‌ 1953లో విలీనం చేసుకుంది. అయితే పోను పోను గ్రీన్‌లాండ్‌ ప్రజల్లో స్వాతంత్య్ర కాంక్ష బయలుదేరింది. దీంతో డెన్మార్క్‌ 1972లో హోం రూల్‌ చట్టం తీసుకొచ్చి స్వయం ప్రతిపత్తి కల్పించింది.

డెన్మార్క్ అధీనంలో ఉన్న పాలన వ్యవహారాలు మొత్తం గ్రీన్ లాండ్ చూసుకుంటుంది. ఇక ఇలా ఉన్న గ్రీన్ లాండ్ ని కొనేయాలని ప్రయ‌త్నిస్తోంది. ఆ మేరకు అధ్యక్షుడు ట్రంప్ తమ అధికారులకు ఆదేశాలు కూడా జారీ చేశారు. అయితే ట్రంప్ ప్రతిపాదన తెలుసుకున్న గ్రీన్ లాండ్ ప్రభుత్వం, అమ్మడానికి సిద్ధంగా లేమూ అంటూ ట్రంప్‌కు కౌంటర్ ఇచ్చారు. కానీ అమెరికాతో వ్యాపారానికి మా తలుపులు ఎప్పుడు తెరిచే ఉంటాయని ప్రకటించారు.