46 మంది జవాన్ల బలిదానం వెనుక ఓ షాకింగ్ నిజం...

February 19, 2020

మా పాలనలో ఉగ్రవాదుల పీచమణిచాం అంటూ ఘనంగా చెప్పుకొంటున్న మోదీ అండ్ కోకు గణాంకాలు షాకిస్తున్నాయి. లోక్ సభలో ప్రభుత్వం ఇచ్చిన సమాధానం ప్రకారం చూసుకున్నా కూడా మోదీ పాలనలో ఉగ్రవాద దాడులు తీవ్రమైనట్లు అర్థమవుతోంది. ముఖ్యంగా జమ్ముకశ్మీర్ రావణ కాష్ఠమే అయింది.

మోదీ అధికారం చేపట్టిన 2014 నుంచి 2018 వరకు చూసుకుంటే జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాద దాడులు 176 శాతం పెరిగాయి. 1989లో ఇక్కడ ఉగ్రవాదం ఊపిరి పోసుకున్నది మొదలు ఇప్పటివరకు మునుపెన్నడూ లేని రీతిలో తాజాగా భారీ దాడి జరిగి 46 మంది సైనికులు అసువులు బాసారు. 

మోదీ అధికారం చేపట్టిన తొలి ఏడాది జమ్ముకశ్మీర్‌లో 222 ఘటనలు జరగ్గా… ఆ తరువాత 2015లో 208 ఘటనలు చోటుచేసుకున్నాయి. ఆ తరువాత ఉగ్రదాడులకు అంతూపొంతు లేకుండా పోయింది. 2016లో ఏకంగా 322 దాడులు జరిగాయి. 2017లో 342 దాడులు.. 2018లో ఏఖంగా 614 దాడులు జరిగాయి.

మోదీ కాషాయ విధానాలు.. జమ్ముకశ్మీర్ వివాదాన్ని సరైన కోణంలో చూడకుండా సైనిక బలాన్ని ఉపయోగించి మానవ హక్కుల ఉల్లంఘలనకు పాల్పడడం వంటి కారణాలతో మోదీ హయాంలో టెర్రరిస్టులు మరింత రెచ్చిపోయే పరిస్థితి వచ్చింది. జమ్ముకశ్మీర్‌లో మునుపెన్నడూ లేని రీతిలో అక్కడ సైనికుల చేతిలో మరణిస్తున్న ఉగ్రవాదుల కంటే కొత్తగా పుట్టుకొస్తున్న ఉగ్రవాదుల సంఖ్య ఎక్కువగా ఉంటోంది. ముఖ్యంగా 2016లో బుర్హాన్ వనీ ఎన్‌కౌంటర్ తరువాత ఉగ్రవాదం మరింత పెరిగిపోయింది. ఇప్పుడు ఏకంగా జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదం మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు ఎన్నడూ లేనట్లుగా భారీ దాడిజరిగింది. అది కూడా నిత్యం వేలాది మంది పహారా ఉంటే రహదారిలో జరగడం మరింత విచిత్రం. దీనిపై నిఘా వర్గాలకూ సమాచారం లేదంటే దేశ రక్షణ వ్యవస్థ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. 56 అంగుళాల చాతీ నాదంటూ గొప్పలు పోయే మోదీ సాబ్ ఇప్పుడు దీనికేం సమాధానం చెబుతారో మరి.