అది గులాబీ మీడియా కాదు... కోర్టు అండీ బాబూ

December 12, 2019

త‌ప్పు జ‌రిగిన‌ప్పుడు.. అవును త‌ప్పు జ‌రిగిందంటూ ఒప్పుకునే ధైర్యం ఉండాలి. ఒక‌సారి జ‌రిగిన త‌ప్పును మ‌రోసారి జ‌ర‌గ‌కుండా జాగ్ర‌త్త‌లు తీసుకుంటామ‌న్న మాట ఇవ్వాలి. అంతేకాదు.. అందుకు భిన్నంగా గ‌తంలో ప‌ది త‌ప్పులు జ‌రిగాయి.. ఇప్పుడు ప‌ద‌కొండు త‌ప్పులు జ‌రిగాయి.. ఇందులో త‌ప్పేముంది? అయినా.. త‌ప్పులు జ‌ర‌గ‌కుండా ఒప్పులు జ‌రుగుతాయా? గ‌తంలో జ‌రిగిన త‌ప్పుల్ని ప‌ట్టించుకోరు కానీ.. మా త‌ప్పుల్నే ప‌ట్టించుకుంటారే? భూత‌ద్దం వేసి మ‌రీ చూపిస్తారే? మా మీద మీకున్న ప‌క్ష‌పాతంతో ఇలాంటి కుట్ర‌లు చేస్తారా?
ఏదైనా అంశం మీద ప్ర‌భుత్వం ఇరుకున ప‌డితే.. ఎదురుదాడి అనే అస్త్రాన్ని ఉప‌యోగించి.. ఇష్టం వ‌చ్చిన రీతిలో ఇష్యూను త‌మ‌కు త‌గ్గ‌ట్లుగా వాద‌న‌ను వినిపించేలా కొన్ని మీడియా సంస్థ‌లు వ్య‌వ‌హ‌రిస్తున్నాయి. త‌మ వైఫ‌ల్యాల్ని క‌వ‌ర్ చేసుకోవ‌టానికి తొండి వాద‌న‌ను స‌మ‌ర్థంగా వినిపించే ప్ర‌య‌త్నం చేస్తున్నాయి.
సొంత మీడియాలో తోచిన‌ట్లుగా వార్త‌లు.. వాద‌న‌లు రాసేసి. ప్ర‌జ‌ల వ‌ద్ద‌కు తీసుకెళ్లొచ్చేమో కానీ.. కోర్టు విష‌యంలోనూ అదే తీరును ప్ర‌ద‌ర్శిస్తే ఎదురుదెబ్బ‌లు త‌ప్ప‌వు. తాజాగా తెలంగాణ ప్ర‌భుత్వానికి అలాంటి అనుభ‌వ‌మే ఎదురైంది. ఇంట‌ర్ ప‌రీక్షా ఫ‌లితాల విడుద‌ల‌లో ఇంట‌ర్ బోర్డు ఫెయిల్ అయ్యింద‌న్న విష‌యం క‌న్ఫ‌ర్మ్. ఈ విష‌యాన్ని ఒప్పుకొని.. తామేం చేయాల‌నుకుంటున్న విష‌యాన్ని చెప్పేస్తే బాగుంటుంది.అంతేకానీ.. జ‌రిగిన త‌ప్పును చిన్న‌ది చేసి చెప్ప‌టం.. బాధ్య‌త నుంచి త‌ప్పుకునే యత్నం చేయ‌టం స‌రికాదు.
స‌రిగ్గా ఈ ఇష్యూలోనే ప్ర‌భుత్వ‌ త‌ర‌ఫు న్యాయ‌వాదులు హైకోర్టులో అడ్డంగా బుక్ అయ్యారు. ఇంట‌ర్ ప‌రీక్షా ప‌త్రాల్ని స‌క్ర‌మంగా వాల్యువేష‌న్ చేయ‌క‌పోవ‌టంతో విద్యార్థులు భారీగా న‌ష్ట‌పోయార‌ని.. రీ వాల్యువేష‌న్ కు ఆదేశించాల‌ని.. ఆత్మ‌హ‌త్య చేసుకున్న 16 మంది విద్యార్థుల కుటుంబాల‌కు రూ.50ల‌క్ష‌లు చొప్పున ప‌రిహారాన్ని ప్ర‌భుత్వం అందించాలంటూ బాల‌ల హ‌క్కుల సంఘం త‌ర‌ఫున వ్య‌స్థాప‌క అధ్య‌క్షుడు అచ్యుత రావు లంచ్ మోష‌న్ ను దాఖ‌లు చేశారు. దీనిపై తెలంగాణ హైకోర్టు విచార‌ణ చేప‌ట్టింది.
హైకోర్టు సంధించిన ప్ర‌శ్న‌ల‌కు ఇంట‌ర్ బోర్డు త‌ర‌ఫు లాయ‌ర్లు వినిపించిన వాద‌న‌ల‌పై హైకోర్టు అసంతృప్తి వ్య‌క్తం చేయ‌ట‌మే కాదు.. ఆ త‌ర‌హా వాద‌న‌ల్ని కొట్టిపారేసింది. సొంత మీడియాలో రాసుకునే రాత‌ల్ని హైకోర్టు ఎదుట ఎలా పెడ‌తార‌ని సందేహం మ‌న‌సుకు క‌లుగ‌క మాన‌దు.
గ‌త ఏడాది 3 ల‌క్ష‌ల మంది విద్యార్థులు ఫెయిల్ అయ్యారంటే.. ప్ర‌తి ఏడాది అలానే అవుతుంద‌న్న‌ట్లుగా ఇంట‌ర్ బోర్డు త‌ర‌ఫున న్యాయ‌వాది వాదించ‌గా.. దీనిపై హైకోర్టు అసంతృప్తి వ్య‌క్తం చేసింది. పిల్ల‌ల‌కు న్యాయం చేయాల‌నే మ‌న‌సుంటే మార్గం ఉంటుంద‌ని చెబుతూ.. ఒక ఏడాది ఫెయిల్యూర్స్ ను ప్ర‌తి ఏడాదికి కొల‌మానంగా ఎలా వాడ‌తారు? ప‌్ర‌శ్న‌ను సంధించింది. ఏడాదికేడాది విద్యావ్య‌వ‌స్థ అభివృద్ధి చెందింది క‌దా? అంటూ చేసిన వ్యాఖ్య ఇంట‌ర్ బోర్డు నోటి వెంట మాట రాకుండా చేసింద‌ని చెప్పాలి.
త‌ప్పు జ‌రిగిన విష‌యం బ‌య‌ట‌కు రావ‌ట‌మే కాదు.. క‌ళ్ల ముందు క‌నిపిస్తున్న‌ప్పుడు.. మ‌ళ్లీ ఆ త‌ప్పును ఎక్క‌డ స‌రిదిద్దుతామ‌న్న ఉదాసీన‌త బోర్డు మాట‌ల్లో కనిపిస్తే.. ఇలాంటి తీరును ప్ర‌ద‌ర్శిస్తారా? బాధ్య‌త‌గా వ్య‌వ‌హ‌రించ‌రా? త‌ప్పును స‌రిదిద్ద‌రా? విద్యార్థుల బాధ్య‌త మీది కాదా? నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రించారు.. త‌ప్పు జ‌రిగింద‌ని అంగీక‌రించి.. దాన్ని స‌రిదిద్దే ప్ర‌య‌త్నం చేయ‌రా? అంటూ ఇంట‌ర్ బోర్డుకు హైకోర్టు త‌లంటింది.
ఫెయిల్ అయిన‌ట్లుగా ఉన్న 3 ల‌క్ష‌ల మందికి సంబంధించిన ప్ర‌శ్నాప‌త్రాల్ని రీవాల్యువేష‌న్ చేయ‌టం ద్వారా 2 ల‌క్ష‌ల మంది పాస్ అయితే.. మంచిదే క‌దా? అలా కాకుంటే.. రీవాల్యువేష‌న్ కు రెండు నెల‌లు స‌మ‌యం ప‌డుతుంద‌ని చెప్ప‌టం ఏమిటి? వారంలో చేయ‌లేరా? అన్న ప్ర‌శ్న ఇంట‌ర్ బోర్డు నోటి వెంట మాట‌లు రాకుండా చేశాయ‌ని చెప్పాలి. త‌ప్పును ఒప్పుకోవ‌టంతోనే స‌రిపోదు.. దాన్ని స‌రిదిద్దుకునే దిశ‌గా ప్ర‌య‌త్నం చేయాలే త‌ప్పించి.. త‌ప్పుకోవ‌టం ప‌రిష్కారం కాద‌న్న హైకోర్టు వ్యాఖ్య‌ల నుంచైనా ఇంట‌ర్ బోర్డు పాఠాలు నేర్చుకుంటుందా?