జగన్ పై ఐవైఆర్ రెండో దాడి

July 07, 2020

తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) కొత్త పాలక మండలిని ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పటికే టీటీడీ చైర్మన్‌గా వైవీ సుబ్బారెడ్డిని గత జూన్‌ 21న నియమించిన ప్రభుత్వం బుధవారం పాలక మండలిలోని మిగిలిన సభ్యుల్ని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 24 మంది సభ్యులు, నలుగురు ఎక్స్‌అఫీషియో సభ్యులతో కూడిన కొత్త పాలకమండలిని ప్రకటించింది.  ఇందులో ఏపీ నుండి 8 మంది సభ్యులు నియమితులు కాగా, తెలంగాణ నుంచి 7 గురు సభ్యులు నియమితులయ్యారు. తమిళనాడు నుండి నలుగురు సభ్యులు ఎంపికయ్యారు.
ఇదిలా ఉంటే గత టీటీడీ బోర్డు సభ్యులా ఎంపికపై రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఐవైఆర్ కృష్ణారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ట్విట్టర్ వేదికగా 29 మంది సభ్యులతో ఉన్న బోర్డును నిర్వహించడంలో ఈవో పడే బాధ వర్ణనాతీతమని వ్యాఖ్యానించారు. భక్తి భావాలు కలిగిన వాళ్ళు బోర్డులో ఉండాలంటే అది ఏ నాడూ జరగలేదని... ఇప్పుడైనా, భవిష్యత్తులోనైనా జరుగుతుందన్న ఆశ కూడా లేదన్నారు.
రాజ్యసభ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి ప్రజా ప్రయోజన వ్యాజ్యంతోనైనా దేవాలయాలకు ప్రభుత్వం నుంచి విముక్తి వస్తేనే ముక్తి ఉంటుందన్నారు. అయితే గతంలో ఐవైఆర్ టీడీపీ ప్రభుత్వంపై విమర్శలు చేసిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు కూడా టీడీపీని ఉద్దేశిస్తూ మరో ట్వీట్ కూడా చేశారు. టీటీడీ బోర్డుపై తానేమంటానన్న ఆసక్తి తెలుగు తమ్ముళ్లలో నెలకొందని, నిన్న‌టి నుంచి తెలుగు త‌మ్ముళ్లు ఇదే విష‌యంపై త‌న స్పంద‌న కోసం తెగ ఆరాట ప‌డుతున్నార‌ని కూడా ఎద్దేవా చేశారు.
టీటీడీ వ్యవస్థలో నిర్ణయాలు ఈఓ, చైర్మన్, ముఖ్యమంత్రి మధ్య నడుస్తాయని.. బోర్డు సభ్యులు దర్శనాలకు మాత్రమే చేసుకుంటారన్నారు. ఈ సందర్భంగా తాను ఈవోగా ఉన్న రోజులను గుర్తు చేసుకున్నారు. 14 మంది సభ్యులు ఉన్న బోర్డును మేనేజ్ చేయటమే తనకు ఆ రోజుల్లో పెద్ద సమస్యగా మారిందన్నారు.