తెలంగాణ‌లోనూ అమరావతి స్విచ్ నొక్కిన బాబు

May 31, 2020

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అమ‌రావ‌తి ప్రాంత రైతుల కోసం దాదాపు రెండు నెల‌లుగా శ‌క్త‌వంచన లేకుండా అండ‌గా నిలుస్తున్న సంగ‌తి తెలిసిందే. ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి మూడు రాజ‌ధానుల నిర్ణ‌యంతో రాష్ట్రం ఎదుర్కునే న‌ష్టాన్ని దూరం చేసేందుకు, అభివృద్ధి ప‌థంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ను కొన‌సాగించేందుకు ఆయ‌న పార్టీ నేత‌ల‌తో క‌లిసి శ్ర‌మిస్తున్నారు. అయితే, తెలంగాణలో తెలుగుదేశం పార్టీపై సైతం అదే రీతిలో ఫోక‌స్ పెట్టారు. ఎన్టీఆర్‌భవన్‌లో తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేత‌ల‌తో సమావేశమైన ఆయ‌న ప‌లు కీల‌క సూచ‌న‌లు చేశారు.
తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్‌. రమణ అధ్య‌క్ష‌త‌న నిర్వ‌హించిన స‌మావేశానికి ముఖ్య అతిథిగా హాజ‌రైన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో నెలకొన్న సమస్యలపై చర్చించారు. రాష్ట్ర కార్యాలయంలో కోర్‌ కమిటీ సభ్యులు ప్రతిరోజు అందుబాటులో ఉండాలని బాబు ఆదేశించినట్టు పేర్కొన్నారు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని బలోపేతం చేసేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని ముఖ్య నాయకుల సమావేశం నిర్ణయించింది. డబుల్ బెడ్‌ రూమ్‌ ఇండ్ల నిర్మాణంలో జరుగుతున్న జాప్యంపై ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలనీ సమావేశంలో తీర్మానించారు.
కాగా, చంద్ర‌బాబు పోరాటానికి ప‌లువురు ముందుకు వ‌స్తున్నారు.  అమరావతి రాజధాని ప్రాంత రైతులకు హైదరాబాద్‌కు చెందిన పలువురు రూ. 50 వేల చెక్కును టీడీపీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడుకు అందజేశారు. ఎన్టీఆర్ భవన్‌లో ఆయనను కలిసి అమరావతిని ఆంధ్రప్రదేశ్‌ రాజధానిగా కొనసాగించేందుకు తమ మద్దతు కొనసాగుతుందని తెలిపారు.