బసవతారకం ట్రస్టీ డాక్టర్ తులసీదేవీకి ఎన్నారైల కన్నీటి నివాళి

August 04, 2020

తెలుగు నేల ప్రజలకు కారు చౌకగా కేన్సర్ వైద్యం అందడానికే కాకుండా... ప్రపంచంలోని అత్యంత ఆధునిక చికిత్సలు కేన్సర్ రోొగులకు అందిస్తున్న బసవతారకం కేన్సర్ ఆసుపత్రి ఏర్పాటులో కీలక భూమిక పోషించడమే కాకుండా... విదేశాల్లో పేరు పొందిన వైద్యురాలిగా ఖ్యాతి గడించిన డాక్టర్ పోలవరపు తులసీదేవి(80) ఇక లేరు. తెలుగు నేలలో వైద్య వృత్తిని అభ్యసించి అగ్రరాజ్యం అమెరికాలో గైనకాలజిస్ట్ గా తనదైన శైలి సేవలు అందించి... అక్కడి మన ప్రవాసాంధ్రులకు వెన్నుదన్నుగా నిలుస్తూ వస్తున్న తులసీదేవి... శనివారం రాత్రి గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. అమెరికా నగరం న్యూయార్క్ లోని తన సొంత నివాసంలోనే ఆమె మరణించారు. డాక్టర్ తులసీదేవి మరణం ఇక్కడి మన గుండెలను బరువెక్కించడంతో పాటు అక్కడి మన ప్రవాసాంధ్రులను శోకసంద్రంలో ముంచేసిందనే చెప్పాలి. వైద్య వృత్తిలో తనదైన శైలి సేవలు కొనసాగిస్తూనే.. తన సొంత ప్రాంతం అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించిన తులసీదేవి మరణం నిజంగానే తెలుగు ప్రజలకు తీరని శోకం మిగిల్చేదే. 

గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం కంఠంరాజు కొండూరులో జన్మించిన తులసీదేవి... ప్రాథమిక విద్యాభ్యాసం తర్వాత గుంటూరు వైద్య కళాశాలలో వైద్య విద్యను అభ్యసించారు. గైనకాలజిస్ట్ గా, అబ్ స్ట్రేట్రీషియన్ గా వృత్తి జీవితాన్ని ప్రారంభించిన తులసీదేవి... న్యూయార్క్ కేంద్రంగా ఏర్పాటైన బ్రూక్లిన్ అబ్ స్ట్రేట్రీషియన్స్ అండ్ గైనకాలజిస్ట్స్ కు మేనేజింగ్ డైరెక్టర్ గా కొనసాగుతున్నారు. ఏకంగా 40 ఏళ్ల పాటు ఈ రంగంలో వైద్య సేవలు అందిస్తున్న తులసీదేవి... గుండెపోటు కారణంగా హఠాన్మరణం చెందిన వైనం ప్రవాసాంధ్రులను దిగ్భ్రాంతికి గురి చేసింది. ఓ వైపు వైద్యురాలిగి బిజీ లైఫ్ ను కొనసాగిస్తూనే... అక్కడి మన తెలుగు ప్రజల సంఘం తానా వ్యవహారాల్లోనూ కీలక భూమిక పోషిస్తున్న తులసీదేవి... మరణం తానా సభ్యులతో పాటు, ఇతర తెలుగు సంఘాల ప్రతినిధులకు, ప్రసావాంధ్రులను షాక్ కు గురి చేసింది. తులసీదేవి మృతికి మన తెలుగు సంఘాలు కన్నీటి నివాళి అర్పించాయి.

ఇక తులసీదేవి ప్రస్థానం విషయానికి వస్తే... గుంటూరు జిల్లాలో తన సొంతూళ్లో పాఠశాల లేని నేపథ్యంలో ప్రాథమిక విద్యాభ్యాసం కోసం ఏకంగా పది కిలో మీటర్లు నడిచిన తులసీదేవి... తన తర్వాతి తరం ఆ ఇబ్బంది పడకూడదని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే తన పుట్టిన ఊరిలో తన తండ్రి కారుమంచి గోవిందయ్య పేరిట ఏకంగా ఉన్నత పాఠశాలను తన సొంత నిధులతో ఏర్పాటు చేశారు. ఇప్పటికీ ఈ స్కూలు ఒక్క కంఠంరాజు కొండూరు గ్రామ విద్యార్థులకే కాకుండా ఇరుగు పొరుగు గ్రామ విద్యార్థులకు కూడా ఉత్తమ విద్యనందిస్తోంది. ఇక తెలుగు ప్రజలకు ప్రాణాంతక కేన్సర్ నుంచి ఉపశమనం ఇవ్వాలన్న ఉద్దేశంతో ఏం చేయాలన్న ఆలోచన చేసిన టీడీపీ వ్యవస్థాపకుడు, దివంగత సీఎం స్వర్గీయ నందమూరి తారకరామారావుకు తులసీదేవి వెన్నుదన్నుగా నిలిచారు. ఎన్టీఆర్ ఆలోచన గురించి తెలుసుకున్న వెంటనే... కేన్సర్ వైద్య రంగంలోని అత్యాథుని వైద్య చికిత్సలు, అత్యాధునిక వైద్య పరికరాలపై సమగ్ర వివరాలు సేకరించడంతో పాటుగా హైదరాబాద్ లోని బంజారా హిల్స్ లో ఏర్పాటైన బసవతారకం ఇండో-అమెరికన్ కేన్సర్ ఆసుపత్రికి కావాల్సిన నిధుల సమీకరణను కూడా ఆమె తన భుజస్కందాలపై వేసుకున్నారు.

ఎన్టీఆర్ చేసిన మంచి ఆలోచనను అక్కడి మన ప్రవాసాంధ్రులకు వివరించడంతో పాటుగా బసవతారవం ఆసుపత్రి ఏర్పాటుకు అవసరమైన నిధులను కూడా సేకరించారు. ఇందుకోసం తానా సభ్యులతో పాటు అక్కడి మన తెలుగు సంఘాలకు చెందిన వారందరినీ ఒక్కతాటిపైకి తీసుకురాగలిగారు. ఈ క్రమంలోనే ఏ ఒక్క ప్రైవేట్ ఆసుపత్రికి సాధ్యం కాని రీతిలో బసవతారకం ఆసుపత్రిలో కేన్సర్ వ్యాధి చికిత్సకు సంబంధించి అత్యాధుని వైద్య చికిత్సలు ఇప్పుడు మన తెలుగు ప్రజలకు అందుబ ాటులోకి వచ్చాయి. అత్యాధునిక వైద్య చికిత్సలు, పరికరాలు, నిధులు అందించడంతోనే తన పని పూర్తి అయిపోయిందని భావించని తులసీదేవి... బసవతారకం కేన్సర్ ఆసుపత్రికి వ్యవస్థాపక ట్రస్టీగానూ వ్యవహరించి ఆసుపత్రి దినదినాభివృద్దికి తనవంతు కృషి చేశారు. ఎక్కడ ఉన్నా... తాను పుట్టిన గడ్డకు చెందిన ప్రజలకు ఎలాంటి మేలు చేసేందుకైనా సదా సిద్ధంగా ఉండే తులసీదేవి లాంటి వారు అరుదుగా ఉంటారని, ఆమె సేవలను గుర్తు చేసుకుంటూ ఎన్నారైలు ఆమెకు కన్నీటి నివాళి అర్పిస్తున్నారు. 

అమెరికాలో తులసీదేవి మరణం తర్వాత జరగాల్సిన వైద్యపరమైన లాంఛనాలు పూర్తి కాగానే... ఆమె భౌతిక కాయాన్ని గుంటూరుకు తరలించనున్నట్లు తానా ప్రతినిధులు తెలిపారు. బసవతారకం కేన్సర్ ఆసుపత్రి ఏర్పాటులో కీలక భూమిక పోషించిన తులసీదేవి మరణం పట్ల ఆసుపత్రి చైర్మన్, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సంతాపం ప్రకటిస్తూ ఓ ప్రకటన విడుదల చేశారు. ఇదిలా ఉంటే... తులసీదేవి మరణం నేపథ్యంలో న్యూయార్క్ లోని డోనోహ్యూ సిసిరే సంస్థ... తన వెబ్ సైట్ లో తులసీదేవి ప్రస్థానం, ఆమె జీవితంలోని పలు కీలక ఘట్టాలను పొందుపరిచింది. న్యూయార్క్ లో ప్రముఖులు మరణించిన సందర్భంలో వారి అంత్యక్రియలకు సంబంధించి అన్ని వ్యవహారాలను పర్యవేక్షించే ఈ సంస్థ తులసీదేవి మరణం నేపథ్యంలో ఆమె గొప్పదనాన్ని శ్లాఘిస్తూ... ఆమెకు సంబంధించిన సమగ్ర వివరాలను తన వెబ్ సైట్ లో పెట్టింది.