గేమ్ అదిరింది: రవిప్రకాష్ గెలిచాడు

May 26, 2020

కేసీఆర్ సన్నిహితుల సంస్థ అయిన అలంద మీడియాతో సున్నం పెట్టుకున్నందుకు కేసులు పాలైన టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాష్ కు పెద్ద ఊరట లభించింది. ఆయనపై అలంద మీడియా పెట్టిన మూడు కేసుల్లోనూ రవి ప్రకాష్ కి బెయిల్ మంజూరయ్యింది. ఇప్పటికే మూడు సార్లు వివిధ కోర్టుల్లో రవిప్రకాష్ కు బెయిల్ రిజెక్ట్ అయిన విషయం తెలిసిందే.

కొంతకాలం క్రితం ఇక చివరి ప్రయత్నంగా సుప్రీంకోర్టును ఆశ్రయించిన రవిప్రకాష్ కు ఓ దారి దొరికింది. రవిప్రకాష్ ను అజ్జాతంలో ఉండటాన్ని తప్పు పట్టిన కోర్టు ముందు పోలీసుల వద్ద హాజరై... మళ్లీ హైకోర్టులో బెయిలుకు దరఖాస్తు చేసుకోమని సూచించింది. ఆ మేరకు రవిప్రకాష్ హైదరాబాదు పోలీసుల వద్ద విచారణకు హాజరయ్యారు. వరుసగా కొన్ని రోజుల పాటు పోలీసులు రవిప్రకాష్ ను విచారించారు. ఈ మధ్యకాలంలో రవి ప్రకాష్ టీవీ9 కొత్త యాజమాన్యంపై పలు ఆరోపణలు చేశారు.

ఇక విచారణకు హాజరయిన రవిప్రకాష్ సుప్రీంకోర్టు చెప్పినట్లు మళ్లీ తెలంగాణ హైకోర్టులో బెయిలుకు దరఖాస్తు చేసుకోగా... ఇరువాదనలు విన్న హైకోర్టు తీర్పు రిజర్వు చేసి తాజాగా రవిప్రకాష్ కు ఈరోజు బెయిలు మంజూరు చేసింది. వాస్తవానికి రవిప్రకాష్ నవ్వుతూ పోలీసుల వద్దకు వచ్చినపుడే అతనికి ఎవరిదో పెద్ద అండ దొరికిందని అందరూ భావించారు. అందుకే రవి ప్రకాష్ పోలీసులు అరెస్టు దాకా వెళ్లకుండా విచారణతో సరిపెట్టారు. ఇక రవిప్రకాష్ తరఫు న్యాయవాది వినిపించిన వాదనలను పరిగణలోకి తీసుకున్న హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. 

అయితే, రవికి కొన్ని షరతులు విధించింది. పోలీసులకు ప్రతి వారం కనిపించాలని, విచారణకు పిలిస్తే సహకరించాలని ఆదేశించింది. అలాగే విదేశీ పర్యటనలు కోర్టు అనుమతి మేరకు చేయాలని హెచ్చరించింది. ఏది ఏమైనా... అతని మీద కొందరు పగబట్టినా... లోపల మాత్రం వేయించలేకపోయారు.