​టీవీ 9 లో ఏం జరుగుతోంది?

June 03, 2020

మెరుగైన సమాజం కోసం... టీవీ 9 అంటూ తెరమీదకు వచ్చిన సంచలన వార్తా ఛానెల్... తెలుగు మీడియాలో వార్తల ట్రెండునే మార్చింది. ఆ మాటకు వస్తే... 24 గంటల వార్తలు ఎవరైనా చూస్తారా అని నోరెళ్లబెట్టిన వారే మళ్లీ మళ్లీ పెట్టుకుని టీవీ9 చూసిన రోజులూ ఉన్నాయి. ​వార్తా స్రవంతిలో ఓ కొత్త ఒరవడిని సృష్టించి తెలుగు వారిలో వార్తలపై ఉన్న ఆసక్తిని ప్రపంచానికి చెప్పింది. టీవీ9 తో ప్రారంభం అయిన ఈ ట్రెండ్ ఇపుడు పుంఖానుపుంఖాలుగా పుట్టుకు వస్తున్న యూట్యూబ్ ఛానెళ్ల దాకా పాకింది. ఇదిలా ఉంటే... ఇంతకాలం అందరికీ అందరి వార్తలు చెప్పిన టీవీ9 ఇపుడు తనే వార్తగా మారింది. కంపెనీలో ఇపుడు పెద్ద గొడవలే జరుగుతున్నట్టు తెలుస్తోంది.
టీవీ 9 లో మేజర్ వాటాదారు శ్రీని రాజు. అతనికి పలు ఇతర కంపెనీలున్నాయి. ఈ కంపెనీలలో ప్రముఖ కంపెనీలు కొన్ని పెట్టుబడులు పెట్టాయి. ఆ పెట్టుబడులు వారి అనుమతి లేకుండా టీవీ 9 లో పెట్టారట శ్రీనిరాజు. అయితే, అపుడేమీ ఇది గొడవలకు దారితీయలేదు. కానీ తాజాగా టీవీ9 చేతులు మారింది. కేసీఆర్ కు దగ్గరగా ఉన్న ఇద్దరు ప్రముఖులు దానిని కొన్నారు. అప్పట్నుంచి అది కేసీఆర్ వ్యతిరేకంగా వార్తలు ప్రచారం చేయడం మానేసింది. విచిత్రం ఏంటంటే... దశాబ్దానికి పైగా దీనికి యజమానిగా ఉన్న శ్రీని రాజు ఏరోజు ఎడిటోరియల్ లో వేలు పెట్టలేదు. కానీ నిన్నా మొన్న వచ్చిన కొత్త ఇన్వెస్టర్లు చీటికి మాటికి కల్పించుకుంటున్నారట. అసలు వారు కొన్నదే సెల్ఫ్ డబ్బా కోసం, కేసీఆర్ను మోయం కోసమని కొన్ని ఆరోపణలు వచ్చాయి. ఏదేమైనా... రాష్ట్రంలో ఏ గొడవ జరిగినా దానిని ఇంతలింతలు చేసి బ్రహ్మాండం బద్ధలైపోయిందన్నట్టు చెప్పే స్వేచ్ఛ ఇటీవల టీవీ9లో లేదు. దీంతో ఇప్పటికి ఈ కంపెనీ డైరెక్టుగా ఉన్న రవిప్రకాష్... అసంతృప్తి వ్యక్తంచేస్తూ కొత్త యాజమాన్యాన్ని కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నారట. అది రవి కి నచ్చలేదు.
ఈగొడవ ఇలా నడుస్తుండగా... మరో వైపు శ్రీనిరాజు కు సంబంధించిన పెట్టుబడిదారులు కూడా కోర్టుకు వెళ్లారు. టీవీ9 అమ్మకం చెల్లదని వారు చెబుతున్నారు. ఎందుకంటే టీవీ9 లో శ్రీనిరాజు పెట్టిన పెట్టుబడులు మా అనుమతి లేకుండా పెట్టారని, వాస్తవానికి ఆ ఇన్వెస్ట్మెంట్ టీవీ9 కోసం ఇచ్చింది కాదని, ఇతర కంపెనీల పేరు చెప్పి పెట్టుబడులు తీసుకుని టీవీ9లో పెట్టారు కాబట్టి టీవీ9 అమ్మకం మా అనుమతి లేకుండా చేయడం కుదరదని, కాబట్టి టీవీ9 అమ్మకమే చెల్లదని .. సైఫ్ పార్టనర్స్ (శ్రీనిరాజుకు పెట్టుబడులు పెట్టిన కంపెనీ) నేనషనల్ లా ట్రిబ్యునల్ కు వెళ్లింది. ప్రస్తుతం ఇది కేసు నడుస్తోంది. అయితే... సైఫ్ పార్టనర్స్ ను శ్రీనిరాజు బుజ్జగించినట్లు తెలుస్తోంది. 65 కోట్లు చెల్లిస్తే ఈ అమ్మకానికి మాకు అభ్యంతరం లేదని సైఫ్ పార్టనర్స్ అంగీకరించినట్టు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో 16వ తేదీ ఫైనల్ హియరింగ్ ఉంటుందంటున్నారు.
మరి ఈ తీర్పు శ్రీనిరాజుకు అనుకూలంగా వస్తే... టీవీ9 ని పూర్తి కొత్త ఇన్వెస్టర్స్ చేతుల్లో ఉంటుంది. అపుడు కచ్చితంగా
రవి ప్రకాష్ మాటకు విలువ లేకపోవచ్చు. ఎందుకంటే... రవి ప్రకాష్ సంచలనాలు కొత్త పెట్టుబడుదారులకు నచ్చకపోవచ్చు. అయితే, రవి ప్రకాష్ దీనికి తగిన ఏర్పాట్లు కూడా ముందే చేసుకున్నట్లు వార్తలు వచ్చాయి.
ఒకవేళ రవిప్రకాష్ బయటకు వస్తే మోజో టీవీ ని ఆయన నడిపే అవకాశాలు ఉన్నాయంటున్నారు. అంటే... ఛానెల్ మారినా రవి ప్రకాష్ ను మిస్సయ్యే అవకాశం అయితే లేదు. బ్రేకింగ్ న్యూస్ కోసం చూస్తూనే ఉండండి... ఈక్యాప్షన్లో ఛానెల్ మాత్రమే మారుతుందన్నమాట.