​టీవీ9 లోనే షో చేస్తా, కుదరకపోతే కొత్త ఛానెల్ పెడతా- రవి ప్రకాష్

May 24, 2020

​ఎన్నో వార్తలు, ఎన్నో గాసిప్పులు... రవి ప్రకాష్ ఏం చేస్తున్నాడు? ఏం చేయబోతున్నాడు. టీవీ9లో ఉంటాడా? కొత్త ఛానెల్ పెడతాడా? ఉన్న ఛానెల్ కొంటాడా?.... ఎన్నికల ఫలితాల కంటే అతను ఏం చేస్తాడు అన్నదానిపై తెలుగు వాళ్లు ఒక మూడు నాలుగు రోజులు ఆసక్తి చూపించాడు. ఇందులో కొన్ని వార్తలు రవి ప్రకాష్ ను బాధపెట్టి ఉన్నా.... తను ఇంత సెలబ్రిటీగా గుర్తిస్తున్నందుకు బాగా సంతోషపడి కూడా ఉంటాడు. అయితే... ఎట్టకేలకు జనాల మనసుల్లో ఉన్న అనుమానాలను నివృత్తి చేస్తూ ఆయన స్పందించారు. తన మనసులోని మాటను బయటపెట్టారు.
రవిప్రకాష్ సందేశంలో అత్యంత ఆసక్తికరమైన విషయం ఏంటంటే.... అతనికి ఇంకా టీవీ9 నుంచి మానసికంగా బయటకు పోలేదు. ఇప్పటికీ అందులో ఉండటానికి స్వయంగా ఆసక్తి చూపిస్తున్నాడు అనే విషయాన్ని తనే చెప్పుకున్నాడు. ఇక ఆయన మాటల్లోనే ఆయన అభిప్రాయాలను తెలుసుకుందాం. ఆయన ఆరోపణలను కూడా విందాం.
‘‘టీవీ9 చానల్ ను ఏ పార్టీకి కొమ్ముకాయని మీడియా సంస్థగా రూపుదిద్దాను. ఏనాడూ మా ఛానెల్లో మూఢనమ్మకాలను, జ్యోతిష్యాలను ప్రోత్సహించలేదు. టీవీ9 చానల్ పై కన్నేసిన 'మై హోం' జూపల్లి రామేశ్వర్ రావు అలంద మీడియా సంస్థ ద్వారా దొడ్డిదారిన ఇందులో ప్రవేశించారు. రామేశ్వర్ రావు ఇప్పుడు టీవీ9 చానల్ లో మార్పులు తీసుకువచ్చే అవకాశం ఉంది. మా 15 ఏళ్ల కృషి ఫలితమైన టీవీ9 చానల్ యథాతథంగా ఉంటుందని, ఉండాలని ఆశిస్తున్నాను. నేనో జర్నలిస్టును. అసాధ్యమనదగ్గ రీతిలో చానల్ ను అభివృద్ధి చేశాను. ఇప్పటికీ టీవీ9 చానల్ లో షో నిర్వహించాలని బలంగా కోరుకుంటున్నాను. ఒకవేళ వీలవకపోతే మరో చానల్ ప్రారంభించి, పునాది రాయి నుంచి దానిని ఉన్నతంగా అభివృద్ధి చేస్తాను. తనపై మరిన్ని కేసులు పెట్టి జైలుకు పంపాలని కొందరు కోరుకుంటున్నారు’’.... ఇది రవిప్రకాష్ స్వయంగా వెల్లడించిన సందేశం.
దాదాపు మెడపట్టి గెంటేసినంత పనిచేసినా రవి ప్రకాష్ కు ఇంకా టీవీ9పై మోజు ఉండటం ఆశ్చర్యకరమే. అయితే, దానిని నెం.1 ఛానెల్ గా తీర్చిదిద్దడంలో మాత్రం ఆయన కృషి ఎంతో ఉంది. టీవీ9ను బ్లేమ్ చేస్తూ దానిని చూడకుండా ఉండలేని పరిస్థితికి తీసుకెళ్లారు రవిప్రకాష్. 24 గంటలు వార్తల కోసం ఛానెలా? అని నోరెళ్లబెట్టిన వాళ్లచేతే... గంటల తరబడి వార్తలు చూయించాడు రవి. అతను టీవీ9లోనే ఉదయిస్తాడా? ఇంకో దిక్కున ఉదయిస్తాడా? అన్నది కొన్నాళ్లు వేచిచూడక తప్పదు.