జగన్ కామెంట్... బాబును రియల్ హీరోను చేసింది

July 07, 2020

నిజమే... ఏపీకి కొత్తగా సీఎం బాధ్యతలు చేపట్టిన వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి... టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడును రియల్ హీరోను చేసేసింది. అదేంటీ... జగన్ ఏమిటి, బాబును హీరోను చేయడమేమిటి? అనేగా మీ డౌటు. ట్విట్టర్ లో ఇప్పుడు ట్రెండింగ్ అవుతున్న హ్యాష్ ట్యాగ్ ‘#సీబీఎన్ మై రోల్ మోడల్’ ను చూస్తే మీకే అర్థమవుతుంది. ఒకరా, ఇద్దరా... ఏకంగా 12వేల మందికి పైగా నెటిజన్లు బాబే తమ రోల్ మోడల్ అని బల్ల గుద్ది మరీ చెబుతున్నారిప్పుడు. అంతేనా... బాబు విజన్ గురించి దేశంలోని ప్రముఖ రాజకీయవేత్తలు, వ్యాపారవేత్తలు గతంలో బాబు గురించి చేసిన వ్యాఖ్యలు, చేసిన ప్రసంగాలను సైతం జగన్ కామెంట్ బయటకు వచ్చేలా చేసింది. అంతేకాదండోయ్... బాబు గురించి మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ గతంలో చేసిన ఆసక్తికర కామెంట్లను కూడా జగన్ కామెంట్ మరోమారు మనకు గుర్తు చేసేలా చేసిందని చెప్పక తప్పదు. మొత్తంగా చంద్రబాబును జగన్ కామెంట్ రియల్ హీరోగానే కాకుండా కొన్ని వేల మందికి, అది కూడా ఆయా రంగాల్లో ఉన్నత శిఖరాలకు చెందిన వారికి కూడా చంద్రబాబు ఆదర్శంగా మారిన వైనాన్ని కూడా మరోమారు గుర్తు చేసింది.

సరే... ఈ ట్రెండింగ్ హ్యాష్ ట్యాగ్ ఎంట్రీ ఇవ్వడం, అది ఇప్పుడు వైరల్ గా మారిపోవడానికి కారణమైన జగన్ కామెంట్ ఏమిటన్న విషయానికి వస్తే... ప్రస్తుతం కొనసాగుతున్న ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా మంగళవారం నాటి సమావేశాల్లో భాగంగా చంద్రబాబును టార్గెట్ చేసిన జగన్ ఓ విమర్శ చేశారు. ‘అక్రమ నిర్మాణాల్లో నివాసం ఉంటూ మీరు సమాజానికి ఏం సందేశం ఇస్తున్నారు. 40 ఏళ్ల అనుభవం అంటున్నారు... నలుగురికైనా ఆదర్శంగా నిలిచారా?’ అంటూ జగన్ విమర్శించారు. దీనికి సభలో చంద్రబాబు కూడా సమాధానం చెప్పేసి వదిలేశారు. అయితే చంద్రబాబు విజన్ గురించి తెలిసిన నెటిజన్లు మాత్రం బాబు మాదిరి జగన్ కామెంట్ కు సమాధానం చెప్పేసి వదిలేయలేదు. చంద్రబాబు తమకు ఎలా ఆదర్శంగా నిలిచారో వివరిస్తూ... ట్విట్టర్ వేదికగా ‘#సీబీఎన్ మై రోల్ మోడల్’ పేరిట ఓ హ్యాష్ ట్యాగ్ ను క్రియేట్ చేశారు. ఇంకేముంది కేవలం నాలుగంటే నాలుగు రోజుల్లో వేలాది ట్వీట్లు, రీ ట్వీట్లు ఈ హ్యాష్ ట్యాగ్ కు పోటెత్తాయి.

తమకు చంద్రబాబు ఆదర్శం అని చెప్పేయడంతోనే సరిపెట్టుకోని నెటిజన్లు... బిల్ గేట్స్, ముఖేశ్ అంబానీ ఆనంద్ మహీంద్రా తదితర దిగ్గజ పారిశ్రామికవేత్తలు, అరవింద్ పనగారియా లాంటి ఆర్థిక రంగ నిపుణులు, ఇండియా టుడే లాంటి ప్రముఖ వార్తా సంస్థలు, ఉమా భారతి లాంటి సీనియర్ రాజకీయ వేత్తలు ఆయా సందర్బాల్లో చంద్రబాబు విజన్ గురించి ఏమన్నారన్న విషయాలను ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. నెటిజన్లు ప్రస్తావించిన ఈ ప్రముఖులంతా చంద్రబాబు గురించి ఆయా సందర్బాల్లో చేసిన వ్యాఖ్యలు, ప్రశంసలు చూస్తే... నిజంగానే చంద్రబాబు రోల్ మోడల్ ఎలా అయ్యారో ఇట్టే అర్థం కాక మానదు. ఈ వ్యాఖ్యల్లో మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్, రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ, మహీంద్రా గ్రూప్ సీఎండీ ఆనంద్ మహీంద్రా, బీజేపీ సీనియర్ నేత, మధ్యప్రదేశ్ మాజీ సీఎం, కేంద్ర మాజీ మంత్రి ఉమా భారతి చేసిన వ్యాఖ్యలు చూస్తే... చంద్రబాబు విజన్ ఏమిటో ఇట్టే అర్థమవుతుంది. నెటిజన్లు పోస్ట్ చేసిన ఈ ప్రముఖుల వ్యాఖ్యలను ఓ సారి పరిశీలిద్దాం పదండి.

బిల్ గేట్స్... చంద్రబాబు ఓ గొప్ప విజనరీ. ప్రస్తుత రాజకీయాల్లో అత్యంత అరుదైన నేత. భారత్ కు బాబు లాంటి విజనరీలు ఇంకా ఎంతో మంది అవసరం ఉంది.
ముఖేశ్ అంబానీ... మీ వల్లే మబైల్ నెట్ వర్క్ లోకి అడుగుపెట్టామని ముఖేశ్ నేరుగా చంద్రబాబుతోనే చెప్పారు
ఆనంద్ మహీంద్రా... దావోస్ వెళ్లినప్పుడల్లా బాబుతో భేటీనే హైలైట్ అంశం. ఆధునిక భారతావనిలో అత్యంత ప్రభావవంతమైన నేత చంద్రబాబు. బాబుతో భేటీ అంటేనే ఓ పవర్ ప్యాక్ భేటీగానే ఫీలవుతా.
ఉమా భారతి... చంద్రబాబును నేను ఓ సోదరుడిగా భావిస్తా. మధ్యప్రదేశ్ సీఎంగా ఉన్నప్పుడు బాబు అధికారంలో లేకున్నా... ఆయన విజనరీనే ఫాలో అయ్యా. నాడు గుజరాత్ సీఎంగా ఉన్న నరేంద్ర మోదీకి కూడా బాబు గొప్పతనాన్ని ఎప్పుడూ చెప్పేదానిని. చంద్రబాబుతో నాది పూర్వజన్మ బంధం.