డా. హనిమిరెడ్డికి అరుదైన గౌరవం... యూసీ మెర్స్ డ్ ఛాన్సలర్స్ మెడల్

August 08, 2020
CTYPE html>
అగ్రరాజ్యం అమెరికాలో తెలుగు ప్రముఖులు తమదైన శైలిలో సత్తా చాటుతున్నారు. ఇలాంటి వారిలో గుండె సంబంధిత వ్యాధుల వైద్య నిపుణుడు, అమెరికాలో స్థిరపడ్డ తెలుగు ప్రముఖుడు డాక్టర్ హనిమిరెడ్డి లకిరెడ్డి ఇప్పటికే పలు అవార్డులు అందుకోగా... తాజాగా ఆయనను మరో ప్రతిష్ఠాత్మక అవార్డు వరించింది.
యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా మెర్స్ డ్ నుంచి ఆయన ఛాన్సలర్స్ మెడల్ కు ఎంపియ్యారు. ఈ మెడల్ అందుకున్న తొలి భారతీయుడిగానూ లకిరెడ్డి రికార్డులకెక్కారు. లకిరెడ్డితో పాటుగా మెర్స్ డ్ మేయర్ మైఖేల్ మర్ఫీకి యూసీ మెర్స్ డ్ ఛాన్సలర్ మెడల్ లను ప్రకటిస్తూ వర్సిటీ యాజమాన్యం కీలక ప్రకటన విడుదల చేసింది. 
 
ఎప్పుడో 1978లో అమెరికాలో కాలుమోపిన డాక్టర్ హనిమిరెడ్డి లకిరెడ్డి కాలిఫోర్నియా స్థిరపడ్డారు. అక్కడే కార్డియాలజిస్ట్ గా సేవలందించడం మొదలుపెట్టిన లకిరెడ్డి.. కాలిఫోర్నియాతో పాటు మొత్తం అమెరికాలోనే ప్రముఖ వైద్యుడిగా ఎదిగారు. అంతేకాకుండా అక్కడి తెలుగు సంఘాల్లో కీలక వ్యక్తిగా వ్యవహరించారు.
ఓ వైపు వైద్య సేవలు, మరో వైపు తెలుగు సంఘాల నిర్వహణతో పాటుగా అమెరికాలో నాణ్యమైన విద్యను అందించే కార్యక్రమాలకు వెన్నుదన్నుగా నిలిచిన లకిరెడ్డి... తనదైన ప్రత్యేక గుర్తింపును సంపాదించారు. ఈ క్రమంలోనే 2002లో యూసీ మెర్స్ డ్ వర్సిటీకి ఏకంగా మిలియన్ డాలర్లను విరాళంగా ఇచ్చిన లకిరెడ్డి... వర్సిటీలోనే అతిపెద్ద లెక్చర్ హాల్ ఏర్పాటుకు కృషి చేశారు. 
 
యూసీ మెర్స్ డ్ ఛాన్సలర్ మెడల్ ప్రకటన 2005లో ప్రారంభం కాగా... ఇప్పటిదాకా ఒక్క భారతీయుడికి కూడా ఈ మెడల్ దక్కలేదు. ఈ లెక్కన ఈ అరుదైన గౌరవాన్ని దక్కించుకున్న భారత సంతతి వ్యక్తుల్లో లకిరెడ్డే ప్రథముడని చెప్పాలి.
ఇప్పటిదాకా ఈ మెడల్ ను అందుకున్న వారిలో అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా సతీమణి మిషెల్ ఒబామా, అమెరికా కాంగ్రెస్ సభ్యుడు డెనిస్ కార్డోజా, యూసీ మెర్స్ డ్ కు చెందిన ప్రముఖులు లియో కొలిజీయన్, ఫ్రెడ్ రూయిజ్, స్థానిక కమ్యూనిటీ, బిజినెస్ లీడర్లు ఆర్ట్ కుమంగర్, కెల్విన్ బ్రైట్ తదితరులున్నారు. ఇప్పుడు లకిరెడ్డితో పాటు మెడల్ కు ఎంపికైన మర్ఫీ.. మెర్సడ్ కు వరుసగా రెండు దఫాలుగా మేయర్ గా ఎంపికయ్యారు. 
 
తెలుగు నేలలోని ఓ మారుమూల పల్లెలో జన్మించిన లకిరెడ్డి... ప్రాథమిక విద్యాభ్యాసంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు. తాను పడ్డ కష్టాలు ఏ ఒక్క విద్యార్థికి ఎదురు కాకూడదన్న భావనతో విద్యకు ఎంతో ప్రామఖ్యతను ఇచ్చిన లకిరెడ్డి.. అమెరికాలోనూ నాణ్యమైన విద్యా బోధనకు తనవంతు కృషి చేశారు.
ఎన్ని వ్యాపకాలు ఉన్నా విద్యకు సంబందించిన కార్యక్రమాల్లోల చురుగ్గా పాలుపంచుకునే లకిరెడ్డి.. ఇప్పుడు యూసీ మెర్స్ డ్ ఛాన్సలర్ మెడల్ కు ఎంపికవడం నిజంగానే ముదావహమని చెప్పక తప్పదు. ఇదిలా ఉంటే.. ఇప్పటికైతే వర్సిటీ నుంచి లకిరెడ్డితో పాటు మర్ఫీకి మెడల్స్ ప్రకటన వచ్చింది గానీ... మెడల్స్ ప్రదానం మాత్రం కరోనా వైరస్ వ్యాప్తి తగ్గానే ఉంటుందని వర్సిటీ ఓ ప్రకటనలో తెలిపింది.