బండబూతులు : మోడీషాల్ని కడిగేసిన పెద్ద‘పులి’

May 30, 2020

మహారాష్ట్ర రాజకీయం మరింత ముడులు పడుతోంది. ఎన్నికల్లో కూటమిగా పోటీ చేసి.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే మెజార్టీ ఉన్నా పవర్ ను పంచుకునే విషయంలో బీజేపీ.. శివసేనలు ఎంతకూ తగ్గకపోవటంతో ఇప్పుడేం జరుగుతుందోనన్న ఉత్కంఠ నెలకొంది. ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు? అన్న క్వశ్చన్ ఒకవైపు.. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రభుత్వ ఏర్పాటు కాకుండా గవర్నర్ పాలనకు మొగ్గు చూపుతారా? అన్నది మరో సందేహంగా మారింది.
ఇలాంటివేళ శివసేన పెద్ద పులి ఉద్దవ్ ఠాక్రే బరస్ట్ అయ్యారు. 50-50 ఫార్ములా గురించి.. ఫడ్నవీస్ తో కలిసి అమిత్ షా తమ ఇంటికి వచ్చి ఏం మాట్లాడిన విషయాన్ని చెప్పటమే కాదు.. మోడీని తానెప్పుడూ వ్యక్తిగత దూషణలకు పాల్పడలేదంటూ పలు ఆసక్తికర విషయాల్ని వెల్లడించారు.
తమ ఇంట్లో షాతో కలిసి వచ్చిన దేవేంద్ర ఫడ్నవీస్ కు 50-50 ఫార్ములా గురించి తెలుసని.. ఇరు పార్టీల మధ్య బంధం బలపడాలని కూడా ఆయన కోరిన విషయాన్ని చెప్పారన్నారు. అబద్ధాలు..నిందలతో శివసేన మీద ఫడ్నవీస్ ఆరోపణలు చేయటం బాధ కలిగించిందన్నారు. ప్రధాని మోడీపై తాము విమర్శలు గుప్పిస్తున్నామన్న మాటలోనూ నిజం లేదన్నారు ఉద్దవ్. తాము ఏ రోజు మోడీ మీద వ్యక్తిగత దూషణలకు దిగలేదన్నారు. బీజేపీ దిగజారుడుతనాన్ని తాము ఊహించలేదని.. రాముడు పేరు చెప్పి అబద్ధాలు ఎలా చెబుతారని మండిపడ్డారు.
బీజేపీనే తమ ముందు మోకరిల్లాలని.. శివసేన వెనక్కి తగ్గదన్నారు. ఆర్ ఎస్ఎస్ పైన తమకెంతో గౌరవం ఉందని.. అబద్ధాలు ఎవరు చెప్పాలో సంఘ్ తేల్చుకోవాలన్నారు. ఇంత ఓపెన్ గా సంఘ్ ను సీన్లోకి ఇప్పటివరకూ తెచ్చింది లేదు. తమను బీజేపీ అబద్దాలకోరుగా చిత్రీకరిస్తోందని.. తాము చెప్పిన అబద్ధాల్ని నిరూపించగలరా? అంటూ సవాలు విసిరారు.
మహారాష్ట్ర ప్రజలు థాక్రేలను నమ్మారని.. అమిత్ షా అండ్ కోను కాదన్నారు. మహారాష్ట్రకు శివసేన సీఎంను చేస్తానని బాలాసాహెబ్ కు తాను ప్రామిస్ చేశానని.. ఇప్పటికి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు మార్గాలు మూసుకుపోలేదన్నారు. బీజేపీతో తెగతెంపులకు ఒక అడుగు దూరంలో ఉంచిన ఉద్దవ్ ఇంతలా ఫైర్ కావటం ఇప్పటివరకూ లేదంటున్నారు. చూస్తుంటే.. మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటానికి అనూహ్య వ్యూహాన్ని అమలు చేసే క్రమంలో ఉద్దవ్ ఈ టర్న్ తీసుకున్నారా? అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారిందని చెప్పక తప్పదు.