కాలిఫోర్నియా సెనెట్ లో ఉగాది శుభాకాంక్షల తీర్మానం !

November 19, 2019

అమెరికా లో కాలిఫోర్నియా రాష్ట్ర సెనెట్ (విధానమండలి)లో ఈ ఏప్రిల్ 8వ తేదీన మధ్యాహ్నం 2:23 గంటలకు హర్షద్వానాల నడుమ తెలుగు ఉగాది శుభాకాంక్షల తీర్మానం ఆమోదం పొందింది. కాలిఫోర్నియా 16వ జిల్లా "బేకర్స్ ఫీల్ద్" సెనెట్ సభ్యురాలు, సెనెట్ మైనారిటీ నాయకురాలు అయిన "షేనన్ గ్రొవర్" ఈ తీర్మానాన్ని కాలిఫోర్నియా రాజధాని నగరమైన శాక్రమెంటో లో జరిగిన సెనెట్ సభలో చదివి వినిపించారు. అనంతరం సెనెట్ సభ్యులు 38 మంది తెలుగు ఉగాది శుభాకాంక్షల తీర్మానాన్ని తమ హర్షధ్వానాలతో ఏకగ్రీవంగా ఆమోదించారు. పలువురు సెనెట్ సభ్యులు తమ స్థానాల నుంచి లేచి వచ్చి, "షానన్ గ్రొవర్" చుట్టూ ఉన్న స్థానిక తెలుగు వారిని కరచాలనం చేసి తెలుగు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయడం, వారితో ఫోటోలు దిగడం ఆసక్తి కలిగించింది.
అంతకు మునుపు సెనెట్ ఆవరణలో ఉన్న "షేనన్ గ్రొవర్" తన కార్యాలయానికి వచ్చిన స్థానిక శాక్రమెంటో తెలుగు సంఘం (టాగ్స్) కార్యవర్గ సభ్యులు, సిలికానాంధ్ర స్థానిక సభ్యులైన తెలుగు వారందరికీ స్వయంగా స్వాగతం పలికారు. ఆమె స్వాగతం తెలుగు వారిని ఆశ్చర్యచకితులను చేసింది. తదనంతరం ఆమె తన కార్యాలయ సభ్యులందరికీ అభినందన పత్రాలను అందజేశారు. అనంతరం టాగ్స్ ప్రతినిధులు, స్థానిక తెలుగు వారిని ఆమె తెలుగు సంసృతి గురించి అడిగి తెలుసుకున్నారు.
కాలిఫోర్నియా రాష్ట్రంలో లక్ష మందికి పైగా తెలుగువారు నివాసం ఉంటున్నారు అని ఆమెకు తెలిపారు. దాదాపు 2000 మందికి పైగా విద్యార్ధులు కాలిఫోర్నియాలో ఉన్న సిలికానాంధ్ర మనబడి తరగతుల్లో తెలుగు భాష నేర్చుకుంటున్నారు అని, ప్రపంచవ్యాప్తంగా ఈ సంఖ్య 10,000 ఉంటుందని, స్థానిక శాక్రమెంటో నగరంలో 150 మంది విద్యార్ధులు టాగ్స్ సౌజన్యంతో తెలుగు అభ్యసిస్తున్నారు అని ఆమెకు టాగ్స్ ప్రతినిధులు వివరించారు.
ఉగాది పండుగ గురించి వారితో ఆమె పలు విషయాలు తెలుసుకున్నారు. ప్రకృతితో ముడిపడిన ఈ పండుగ తెలుగు వారే కాకుండా భారతదేశంలో అనేక రాష్ట్రాల వారు ఘనంగా జరుపుకుంటారని ఆమెకు వివరించారు. ఈ సందర్భంగా వారితో సరదగా ముచ్చటించిన ఆమె నెక్స్ట్ మీటింగ్ కి తప్పకుండా చీర కట్టులో వస్తానని తనను కలిసిన తెలుగు ప్రతినిధులకు చెప్పడం భారత సంస్కృతిపై అమెకున్న అభిమానాన్ని తెలియజేసింది. కాలిఫోర్నియా సెనెట్ (విధానసభ) తెలుగు ఉగాది శుభాకాంక్షల తీర్మానం ఆమోదించడం మంచి పరిణామంగా టాగ్స్ అభివర్ణించింది. కాలిఫోర్నియా సెనెట్ లో తెలుగు ఉగాది శుభాకాంక్షల తీర్మానం ఆమోద కార్యక్రమంలో టాగ్స్ కార్యవర్గ సభ్యులు మరియూ సిలికానాంధ్ర స్థానిక సభ్యులు కృష్ణ బాచిన , నాగ్ దొండపాటి, వెంకట్ నాగం, మోహన్ కాట్రగడ్డ, మనోహర్ మందడి, శ్రీమతి శ్రీనీల మండవ, సౌమ్య వీరవట్నం, దీప్తి గోగినేని, లీల సీతల, రమ్య వీరవట్నం, స్వప్న మర్రి, శాంతల గెల్లి, నవ్య దొడ్డిపట్ల, శ్రీకాంత్ దాసరి, ఆనంద్ మాగంటి, సాగర్ ఈల్ల తదితరులు పాల్గొన్నారు.