ఆ ఎన్నారైలకు గుడ్ న్యూస్ 

August 04, 2020

కరోనా కొన్ని ఉపశమనాలను ఇవ్వడమే కాదు... కొందరిలో హ్యుమానిటీని కూడా బయటకు రప్పిస్తోంది. దేశమంతటా ప్రజలు తమకు తోచిన సహాయం చేసి పెద్ద మనసు చాటుకోవడానికి అవకాశం కల్పించింది. ఇది మనుషులకే పరిమితం కాలేదు. దేశాలు కూడా తమ పెద్ద మనసు చాటుకుంటున్నాయి. బ్రిటన్ లో ఇమ్మిగ్రెంట్ వీసాపై పనిచేస్తున్న వైద్య విభాగ సిబ్బందికి పెద్ద ఊరట లభించింది. వీరి పట్ల బ్రిటన్ ఉదారంగా స్పందించింది. వాస్తవంగా చెప్పాంటే... ఉదారంగా స్పందించాల్సిన పరిస్థితి ఆ దేశానికి వచ్చింది. 

బ్రిటన్ లో వైద్య, పారా మెడిక్ సిబ్బందిగా అనేక మంది భారతీయులు ఇమ్మిగ్రెంట్ వీసాలపై పని చేస్తున్నారు. వారి వీసా కాలపరిమితి అక్టోబరుతో ముగియనుంది. అంటే వారు రెన్యువల్ కోసం ఇప్పటి నుంచి ప్రయత్నాలు ప్రారంభించాలి. ఈ నేపథ్యంలో బ్రిటన్ అలాంటి వారికి గుడ్ న్యూస్ చెప్పింది. యూకే హోం శాఖ కార్యదర్శి ప్రీతి పటేల్‌ యూకేలో సేవలు అందిస్తున్న విదేశీ వైద్యులు, నర్సులు, పారామెడికల్‌ సిబ్బంది వీసా కాల పరిమితిని ఏడాదిపాటు ఆటోమేటిక్ గా పొడిగిస్తున్నట్లు ప్రకటన చేశారు. కరోనాపై పోరులో వారు బ్రిటన్ దేశానికి ఎంతో సేవ చేస్తున్నారని, వారి సేవకు ప్రతిఫలంగా ఈ రిటర్న్ గిఫ్ట్ ఇస్తున్నట్లు చెప్పారు. ఈ నిర్ణయం యూకేలోని 2800 మంది వైద్య విభాగ వలసజీవులకు వరంలా మారింది.

మరో వైపు అమెరికాలో హెచ్‌1బీ వీసా పరిమితిని తాత్కాలికంగా 60 నుంచి 180 రోజులకు పెంచాలని అక్కడివారు ప్రభుత్వాన్ని అడుగుతున్నారు. వారి వినతి మేరకు  హౌస్ లో బిల్ కూడా ప్రవేశపెట్టారు. అయితే, అదింకా చట్టంగా ఆమోదం పొందలేదు. అక్కడి వైద్యుల కొరత వల్ల బహుశా అమెరికా కూడా దీని పట్ల సానుకూలంగా స్పందించే అవకాశం కనిపిస్తోంది.