దేశ ప్ర‌ధానికే క‌రోనా సోకింది

August 11, 2020

క‌రోనా వైర‌స్‌కు రాజు, పేద అనే తేడా ఏమీ లేద‌ని స్ప‌ష్ట‌మ‌వుతోంది. అత్యంత జాగ్ర‌త్త‌తో వ్య‌వ‌హ‌రించే ఉన్న‌త స్థాయి వ్య‌క్తులను కూడా క‌రోనా వ‌ద‌ల‌ట్లేదు. ఏకంగా ఒక దేశ ప్ర‌ధానే క‌రోనా బారిన ప‌డ‌టం శుక్ర‌వారం నాటి షాకింగ్ అప్ డేట్. క‌రోనా ధాటికి అల్లాడుతున్న ఐరోపా దేశాల్లో ఒక‌టైన బ్రిట‌న్‌లో ఆ దేశ ప్ర‌ధాన మంత్రి బోరిస్ జాన్సన్‌కు కరోనా సోకిన‌ట్లు వెల్ల‌డైంది. శుక్ర‌వారం ఆయ‌న కరోనా వైరస్ టెస్ట్ చేయించుకోగా పాజిటివ్ వ‌చ్చింది. త‌న‌కు క‌రోనా ఉన్న‌ట్లు బోరిస్ జాన్స‌నే స్వ‌యంగా వెల్ల‌డించారు. త‌న‌కు తేలిక‌పాటి క‌రోనా ల‌క్ష‌ణాలున్న‌ట్లు ప్ర‌ధాని చెప్ప‌డంతో బ్రిట‌న్ ప్ర‌భుత్వ చీఫ్ మెడికల్ ఆఫీసర్ ప్రొఫెసర్ క్రిస్ విట్టి సలహా మేరకు ఆయ‌న క‌రోనా ప‌రీక్ష చేయించుకోగా పాజిటివ్ వ‌చ్చింది.
రెండు రోజుల కింద‌టే బ్రిట‌న్ యువ‌రాజు క‌రోనా బారిన ప‌డ్డ సంగ‌తి తెలిసిందే. అంతకుముందు క్వీన్ ఎలిజ‌బెత్‌-2కు కూడా క‌రోనా ఉన్న‌ట్లు తేలింది. ఇప్పుడు ఏకంగా ప్ర‌ధానే క‌రోనా బారిన ప‌డి క్వారంటైన్‌లో చికిత్స తీసుకోవాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది. గ‌త ప‌ది రోజుల నుంచి బ్రిటన్‌లో కరోనా ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. ఇట‌లీ, స్పెయిన్‌ల త‌ర్వాత యూర‌ప్ దేశాల్లో క‌రోనా ప్ర‌భావం చాలా ఎక్కువ‌గా ఉన్నది బ్రిట‌న్‌లోనే. రోజు రోజుకూ అక్క‌డ క‌రోనా కేసులు పెరుగుతుండ‌టంతో జ‌నాల్లో ఆందోళ‌న పెరుగుతోంది. బ్రిటన్‌లో 11,658 మందికి కరోనా పాజిటివ్ ఉన్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. కరోనా వల్ల ఆ దేశంలో ఇప్ప‌టికే 578 మంది మరణించారు. ఇలాంటి సంక్షోభ స‌మ‌యంలో ఏకంగా దేశాధినేతే కరోనా బారిన పడటం ప్రజలను దిగ్భ్రాంతిలోకి నెట్టేసింది. 

అయితే... ఇప్పటికే బ్రిటన్ యువరాజుకి కరోనా సోకిన విషయం మనకు తెలుసు. తాజాగా ప్రధానికి సోకింది. ప్రధానికి సోకిన విషయం తెలిసిన రెండు గంటల్లో బ్రిటన్ ఆరోగ్యమంత్రికి కూడా సోకినట్లు తేలింది. దీన్ని బట్టి... కరోనా యూరప్ ను ఎంత కబళిస్తుందో అర్థమవుతోంది.