ఐక్యరాజ్య సమితి దివాలా... కారణమే సంచలనం

October 14, 2019

అంతర్యుద్ధాలు, చమురు దేశాల్లో కల్లోలం, అంతర్జాతీయంగా అనేక దేశాల్లో ఆర్థిక ప్రగతి మందగించడం, రాజకీయ అనిశ్చితులు వంటి ప్రభావం ఏకంగా ఐక్యరాజ్యసమితిపైనా పడింది. సమితిని చాలా దేశాలు సీరియస్‌గా తీసుకోకపోవడం ఒకెత్తయితే సమితి కార్యకలాపాల నిర్వహణ ఇవ్వాల్సిన డబ్బు కూడా చాలా దేశాలు ఇవ్వడం లేదట. దీంతో ఐరాస వద్ద నిల్వలు అడుగంటిపోయి పొదుపు చర్యలు ప్రారంభించింది. ఖర్చులకు కూడా కటకటలాడుతుండడంతో కంగారుపడుతోంది. ఐక్యరాజ్యసమితి ఆర్థిక కష్టాలను స్వయంగా సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్‌ వెల్లడించారు. ఆర్థిక ఇబ్బందులను వివరిస్తూ ఐక్యరాజ్యసమితి సచివాలయంలో పనిచేసే 37 వేల మందికి లేఖ రాశారాయన.
2019లో సాధారణ బడ్జెట్‌కు వివిధ సభ్యదేశాల నుంచి 70 శాతం నిధులు మాత్రమే వచ్చాయని లేఖలో వివరించారు. దీంతో సెప్టెంబర్‌ చివరకి 23 కోట్ల డాలర్ల లోటు ఏర్పడిందని వివరించారు. ఉన్న నిధులు కూడా ఈనెలాఖరుకు అయిపోయే అవకాశం ఉందన్నారు. కాబట్టి ఖర్చులను భారీగా తగ్గించుకోవాల్సి వస్తోందన్నారు. నిధులు ఇబ్బంది కారణంగా వివిధ సమావేశాలను, సదస్సులను వాయిదా వేస్తున్నట్టు ఆయన ప్రకటించారు. మరీ అవసరం అయితే తప్ప పర్యటనలకు అనుమతి ఇచ్చే అవకాశం లేదని చెప్పారు. సేవా కార్యక్రమాలను కూడా తగ్గిస్తామని వెల్లడించారు. ఐక్యరాజ్యసమితి ఇలా నిధుల ఇబ్బందులు ఎదుర్కోవడానికి సభ్యదేశాల నిర్లక్ష్యమే ప్రధాన కారణమని ఆయన ఆరోపించారు.
కాగా నిధుల కొరతను ముందే ఊహించి గుటెరస్‌ సభ్యదేశాలను హెచ్చరించినా ఫలితం లేకపోయింది. 2018-19లో ఐక్యరాజ్యసమితి 5.4 బిలియన్ డాలర్ల బడ్జెట్‌ను పెట్టింది. ఇందులో 22 శాతం అమెరికా నుంచే ఐక్యరాజ్యసమితికి అందాయి. మిగతా దేశాల నుంచి పెద్దగా స్పందన లేకపోవడంతో సమితికి కష్టాలు మొదలయ్యాయి.అందుకే ఈ పొదుపు చర్యలు ప్రారంభించింది. 

Read Also

​బే ఏరియాలో ఘనంగా టీడీఎఫ్ బతుకమ్మ
లండన్  బతుకమ్మ,  దసరా సంబరాల రికార్డు
జబర్దస్త్ పై మంచులక్ష్మి దారుణమైన కామెంట్లు ?