జగన్ కోసం ఉండవల్లి తాపత్రయం... ముచ్చటగా లేదూ!!

November 11, 2019

సరిగ్గా ఎన్నికల ముందు చంద్రబాబు హయాంలో జరుగుతున్న వాటిని అనుమానించి ప్రజల్లో అనేక సందేహాలు ఉద్దేశపూర్వకంగా సృష్టించేవారు ఉండవల్లి అరుణ్ కుమార్. కానీ జగన్ హయాంలో మాత్రం... అయ్యో జగన్, జాగ్రత్త నీ పదవి ఎక్కడ పోతుందో అని నా బాధ అన్నట్టు స్పందిస్తున్నారు. కనిపించడానికి వినిపించడానికి ఉండవల్లి జగన్ పై సంచలన కామెంట్లు చేసినట్లు అనిపిస్తుంది గాని... వాస్తవం మాత్రం వేరు. 

పోలవరం గురించి ఇటీవల కేంద్రం ఏం చెప్పిందో అందరికీ తెలిసిందే. అక్కడ ఏ అవినీతి జరగలేదని, దుర్వినియోపు అంచనాలు కూడా ఏం లేవని తేల్చిచెప్పింది. కానీ గతంలో ఆ ప్రాజెక్టుపై సరిగ్గా ఎన్నికల ముందు అనేక ఆరోపణలు చేస్తూ, అనుమానాలు వ్యక్తంచేశారు ఉండవల్లి. 

​తాజాగా ​ఏపీ ప్రభుత్వ అసమర్థ పాలన కారణంగా రాష్ట్రంలో కోటి మందికి పైగా ప్రత్యక్షంగా ప్రభావితం అవుతున్నా నోరు మెదపని ఉండవల్లి... ప్రజలు ఇసుక కొరతతో బాధపడుతున్నారని చెప్పడం లేదు. ప్రజలు విద్యుత్ కొరతతో బాధపడుతున్నారని చెప్పడం లేదు. ప్రజలు ఉపాధి లేక బాధపడుతున్నారని చెప్పలేదు. కానీ... నీ పదవి పోతుంది కాబట్టి ప్రజలను జాగ్రత్తగా చూసుకుని నీపదవిని కాపాడుకో జగన్ అన్నట్టు సుత్తిమెత్తగా మాట్లాడారు. 

ఉండవల్లి మాటల్లోనే చెప్పాలంటే...

‘‘విద్యుత్ కోతలు జగన్ ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చాయి. విద్యుత్ కోతలకు కారణం బొగ్గా లేక ఇంకోటా అనేది జనాలకు అవసరం లేదు, విద్యుత్ వస్తుందా? లేదా అన్నదే ప్రజలకు ఇంపార్టెంట్. 151 సీట్లు, 51 శాతం ఓట్లు శాశ్వతం అనుకోవాల్సిన అవసరం లేదు.  1972లో 51శాతం ఓట్లు, 220 సీట్లు సాధించిన పీవీ నరసింహారావును 9 నెలలకే దింపేశారు. 1994 లో 54 శాతం ఓట్లు 223 సీట్లు సాధించిన ఎన్టీఆర్ నూ అదే 9 నెలలకు దింపేశారు. అసలు ఎన్టీఆర్ ను చంద్రబాబు పదవిలో నుంచి దింపేస్తారని ఎవరైనా ఊహించారా?. ప్రజలనే కాదు తమతో పాటు గెలిచిన పార్టీ ఎమ్మెల్యేలను జగన్ సంతృప్తి పరచాలి. ముఖ్యమంత్రి తమకు గౌరవం ఇస్తున్నారని ఎమ్మెల్యేలు భావించేలా జగన్ చూసుకోవాల్సి ఉంటుంది. నవరత్నాలలో ఒకటి తేడా వచ్చినా జగన్ మనుషులే తిరగబడతారు. ఎమ్మెల్యేలే ఆయనపై తిరుగుబాటు చేస్తారు. ఇన్ని సీట్లు ఇంత ఓట్లు సాధించడం జగన్ స్వయం కృషే. అందులో అనుమానం ఏంలేదు’’

ఇందులో ప్రతి వాక్యంలోనూ జగన్ ని కాపాడాలి, జగన్ చుట్టు కుట్రలు జరుగుతున్నాయి, చంద్రబాబు చెడ్డోడు అని చెప్పడం మినహా మరేం లేదు. ఇవి ప్రజల కోసం మాట్లాడిన మాటలు కాదు, జగన్ కోసం తాపత్రయంతో చెప్పిన మాటలు. ఇలాంటి మాటలు మాట్లాడితే... జనం జగన్ దింపడం తర్వాత.. ముందు ఉండవల్లిని వెంటాడుతారు. ​