This is వాస్తవం : జగన్ ను ఉతికారేసిన ఉండవల్లి

June 01, 2020

ఎవరు అవునన్నా.. కాదన్నా.. తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో కాస్త గుజ్జున్న నేతల్లో ఉండవల్లి ముందుంటారు. విషయం ఏదైనా సూటిగా సుత్తి లేకుండా మాట్లాడేస్తారు. ఇలాంటి నాయకులు ఇప్పటితరంలో కనిపించరు. తాను నమ్మిన సిద్దాంతాలకు భిన్నంగా వ్యవహరించకున్నా..క్లిష్టమైన సమయాల్లో మాత్రం ఆయనలోని నిజాయితీపరుడైన రాజకీయనాయకుడు బయటకు వచ్చేస్తాడు. వ్యక్తిగతంగా తనకున్న ప్రేమాభిమానాల్ని పక్కన పెట్టేసి.. తమ్ముడు తన వాడైనా ధర్మం ధర్మమే అన్నట్లుగా మాట్లాడే అరుదైన నాయకుల్లో ఉండవల్లి ఒకరు.
తాజాగా ఒక ప్రైవేటు చానల్ తో మాట్లాడిన సందర్భంలో కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన మాటల్ని యథాతధంగా తీసుకోకపోవటానికి కారణం.. ఇప్పుడు మీరు చూసే వీడియోలో వినిపించే మాటల్ని కాస్తంత కత్తిరించారు. అదేనండి ఎడిట్ చేశారు. అలాంటప్పుడు మొత్తం భావం వినకుండా.. విన్న అరకొర మాటల్ని గొప్పగా చెప్పటం తప్పు అవుతుంది. కాకుంటే.. వీడియోలని సారాంశాన్ని కుదిస్తూ.. స్పైసీగా ఉండేందుకు.. అందరి కంట్లో పడేందుకు వీలుగా దీన్ని కట్ చేశారని చెప్పాలి.
అయినప్పటికీ రెండున్నర నిమిషాలకు కాస్త తక్కువగా ఉన్న ఈ వీడియోలోని విషయాలు చాలా కీలకమే కాదు.. కరోనా లాంటి మహమ్మారి విరుచుకుపడుతున్న వేళ.. రాజకీయాల్ని ఎలా చూడాలి? నాయకుడు అన్నోడు ఎలా ఉండాలన్న విషయాన్ని ఆయన స్పష్టంగా చెప్పేశారు. ఆయన చెప్పిన పాయింట్లలో కీలకమైనవి ఆయన మాటల్లోనే చూస్తే..
*  నాకే మాత్రం నచ్చట్లేదు. చిన్నప్పటి నుంచి రాజకీయాల్లో ఉన్న నాకు.. ఇప్పుడున్న పరిస్థితులు నచ్చటం లేదు. నచ్చుతాయని కూడా అనుకోవటం లేదు.
*  ఈ రోజు మోడీ అనే వ్యక్తి దేశానికి నాయకుడు. ఆయన్ను నేను అస్సలు అంగీకరించను. ఆయన ఏ సందర్భంలోనూ నచ్చరు. ఏ విషయంలోనూ ఆయన తీసుకునే నిర్ణయాలు నచ్చవు. ఆయనతో పూర్తిగా విభేధిస్తాను. కానీ.. ఈ రోజున ఆయన దేశానికి నాయకుడు. ఇవాళ ఇంత సంక్షోభంలో ఉన్నప్పుడు నిర్ణయం తీసుకుంటే దాన్ని సపోర్టు చేయాలి.
* ఏపీకి లీడర్ ఎవరు జగన్మోహన్ రెడ్డి. ఈ రోజు ఈ స్టేట్ కు ఏం జరిగినా.. దానికి బాధ్యత జగనే వహించాల్సి ఉంటుంది. ఏం తప్పు జరిగినా.. దానికి కారణం ఎవరైనా సరే.. బాధ్యత మాత్రం జగన్ దే. అంత బాధ్యతాయుతంగా వ్యవహరించటం లేదేమోననిపిస్తోంది.
* స్థానిక సంస్థలను వాయిదా వేస్తూ తీసుకున్న నిర్ణయంపై సీఎం జగన్మోహన్ రెడ్డి అలా మాట్లాడాల్సింది కాదు.  చాలా ఎక్కువగా మాట్లాడారు. చాలా తప్పుగా మాట్లాడారు. అందులో నాకు ఎలాంటి రెండో అభిప్రాయంలేదు. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వ్యవహరించే వ్యక్తి అలా మాట్లాడకూడన్నది నా అభిప్రాయం.
* కరోనా ఎఫెక్ట్ కాకుండా మన ఆర్థిక పరిస్థితి చాలా వీక్ గా ఉంది. రేపొద్దున ఏం చేయబోతున్నారు. ఇవన్నీ పాలనా పరమైన ఇబ్బందులు. రాజకీయ సమస్యలన్ని తాను కొని తెచ్చుకున్నవే తప్పితే.. వాటంతట అవే వచ్చినవి కావు. ముఖ్యమంత్రిగా ఆయన మాట్లాడే మాట ఆచితూచి అన్నట్లు మాట్లాడాలి. కులం పేరుతో ఆయన అలా మాట్లాడతారని నేనెప్పుడూ అనుకోలేదు.
* ఎవరి కులం వారికి గొప్పది. ఇందులో తక్కువ కులం ఒకటి.. ఎక్కువ కులం ఒకటి.. స్వార్థపరులైన కులం ఒకటి. సేవాతత్పరత ఉన్న కులం ఒకటి ఉండదు. ఎవరి కులం వారిది. కులమన్నది మరేమీ కాదు.. కుటుంబ పరిధిని పెంచితే అది కులమవుతుంది. అవన్నీ కుటుంబాల కిందనే వచ్చాం. ఇప్పుడు ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ లు అవుతున్నాయి. ఇప్పుడిప్పుడే కులభావన తగ్గుతుంది. అలాంటిది ఒక కులాన్ని అంత దారుణం మాట్లాడటమా? అలా అయితే..జగన్ పక్కన ఆ కులం వారు లేరా? మీ పక్కన వారు ఉండొచ్చు.కానీ.. వారిలోపల కూడా ఎంతోకొంత బాధ ఉంటుంది. అదేంటి ఇలా మాట్లాడుతున్నారని. ఎందుకు అనాల్సి వచ్చిందో నాకు అర్థం కాలేదు.