ఉండవల్లి సార్... బాబు హయాంలో ఈ పని ఎందుకు చేయలేదు?

May 31, 2020

తెలుగు నేల రాజకీయాల్లో విషయ పరిజ్ఝానంలో మేటిగా గుర్తింపు సంపాదించిన సీనియర్ రాజకీయవేత్త, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ గురువారం రాజమహేంద్రవరం వేదికగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన తీరు అత్యంత ఆసక్తి రేకెత్తిస్తోంది. నవ్యాంధ్ర రాజధాని విషయంలో అటు మాజీ సీఎం, టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడును తప్పుబడుతూనే... ఇప్పుడు కొత్తగా సీఎం పదవిని చేపట్టిన వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కూడా తప్పుబట్టిన ఉండవల్లి... చాలా అంశాలనే చర్చకు వచ్చేలా చేశారని చెప్పాలి. ఏపీకి ప్రత్యేక హోదా సంజీవని అన్న విషయాన్ని అన్ని పార్టీలు వినిపిస్తున్నా... దానిని కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారు ఎలాగూ ఇవ్వదు కదా అన్న విషయాన్ని ఇప్పుడు ఉండవల్లి కొత్తగా బయటపెట్టారు. ఏపీకి మోదీ సర్కారు ప్రత్యేక హోదాను ఇవ్వదంటే ఇవ్వదన్నట్లుగా మాట్లాడిన ఉండవల్లి... మరి హోదా రాకుంటే ఏం చేయాలో కూడా సెలవిచ్చిన వైనం ఆసక్తి రేకెత్తించేదే. 

ప్రత్యేక హోదా రాదన్న విషయంపై ఉండవల్లి ఏమన్నారన్న విషయానికి వస్తే... ‘‘ ప్రత్యేక హోదా అనేది ఏపీకి కలిసి రాలేదు. మాకు రాయితీలు ఇవ్వండి అని కేంద్రాన్ని కోరండి. ఏదో విధంగా మనకు పని అయితే చాలు కదా’’ అంటూ ఓ కొత్త అంశాన్ని ఉండవల్లి వినిపించారు. మరి ఇవే మాటలను చంద్రబాబు సీఎంగా ఉండగా ఉండవల్లి ఎందుకు వల్లించలేదన్నది ఆసక్తికరమే. తెలుగు నేల విభజన తర్వాత అసలే అప్పులతో ప్రారంభమైన నవ్యాంధ్రకు రాజధాని కూడా లేని కష్టం గురించి తెలిసి కూడా ఉండవల్లి ఎందుకు మాట్లాడలేదన్నది ఇప్పుడు అసలు సిసలు ప్రశ్నగా మారింది. బీజేపీ సర్కారు ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వదు అన్న క్లారిటీ ఉన్నా గానీ... నవ్యాంధ్రకు చెందిన ఓ మేథావిగా, రాజకీయాల్లో తలపండిన నేతగా ఉండి కూడా చంద్రబాబు సర్కారుకు ఉండవల్లి ఎందుకు సలహాలు ఇవ్వలేదో? ఆయనే చెప్పాలన్న వాదన వినిపిస్తోంది. ఇవ్వకపోగా... ఈరోజు ఉండవల్లి చెప్పినట్లు రాయితీలైనా తీసుకుందాం అని చంద్రబాబు కేంద్రం నుంచి ప్యాకేజీకి ఒప్పుకుంటే ఇదే ఉండవల్లి, ఈయన లాంటి మేధావులంతా తప్పు పట్టారు. మళ్లీ చంద్రబాబు చేసిందే కరెక్టు అన్నట్లు మాట్లాడుతున్నారు.

ఇప్పుడు తాను అభిమాన నేత దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి కుమారుడు జగన్ సీఎం కాగానే సలహాలు, సూచనలు అంటూ ఉండవల్లి బయటకు వచ్చారంటే... ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకున్నా గానీ.. టీడీపీ మీద గానీ, చంద్రబాబు మీద గానీ ఉండవల్లికి కోపం, ధ్వేషం తగ్గలేదనే కదా అర్థం. మనసులో ఈర్ష్య అసూయలను పెట్టుకుని నాడు చంద్రబాబు ఏం చేసినా తప్పు చేశారని చెబుతున్న ఉండవల్లి.. ఇప్పుడు జగన్ బ్లండర్స్ చేస్తుంటే... సరిదిద్దుకోమని సలహాలు చెబుతున్నారు. ఆరోజు యుద్ధప్రాతిపదికన కట్టడానికి చంద్రబాబు ప్రయత్నిస్తే అక్కడ ఏముంది అన్న ఉండవల్లి... ఇపుడు అదే పని చేయమని జగన్ ని కోరుతున్నారు. ఏదేమైనా... తాను ఉంటున్న రాష్ట్రం ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఓ విజ్ఝుడిగా, అన్నీ తెలిసిన నేతగా చంద్రబాబు సర్కారుకు ఉండవల్లి సలహాలు ఇవ్వని వైనం ఆయనలోని మరో కోణాన్ని బయటపెట్టిందనే చెప్పాలి.