ఉండవల్లి శ్రీదేవి- ఎల్వీ సుబ్రహ్మణ్యం... ఈ కథేంటి? దానివెనుక సంగతేంటి?

July 12, 2020

ఆంధ్రప్రదేశ్‌లో తీవ్ర సంచలనం రేపిన చీఫ్ సెక్రటరీ ఎల్వీ సుబ్రహ్మణ్యం బదిలీపై రోజుకో కథనం, కారణం బయటకొస్తోంది. ఇందులో సత్యాసత్యాలు పక్కనపెడితే జనం వీటిపై విపరీతంగా చర్చించుకుంటున్నారు. మరో ఐఏఎస్ అధికారి ప్రవీణ్ ప్రకాశ్‌తో వివాదం.. ముఖ్యమంత్రి జగన్‌తోనూ అభిప్రాయభేదాలు వంటివి ఆయన బదిలీకి కారణమయ్యాయన్న వాదనలు వినిపిస్తుండగా తాజాగా మరో కారణం ప్రచారంలోకి వచ్చింది. ఎల్వీ సుబ్రహ్మణ్యం బదిలీకీ తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి కారణమనే ప్రచారం ఒకటి జరుగుతోంది.
గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గం నుంచి మొన్నటి ఎన్నికల్లో ఉండవల్లి శ్రీదేవి గెలుపొందారు. ఈ నియోజకవర్గం ఎస్సీ రిజర్వ్‌డ్ నియోజకవర్గం. ఆ మధ్య వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా టీడీపీ వర్గానికి, ఎమ్మెల్యే శ్రీదేవికి మధ్య వివాదం జరిగింది. తాడికొండ నియోజకవర్గంలోని అనంతవరంలో గణేష్ మండపానికి వచ్చిన ఆమెను టీడీపీ కార్యకర్తలు వ్యతిరేకించారు. తుల్లూరు మండలంలో జరిగిన గణేష్ మండపంలో ఇదే విధంగా వ్యతిరేకించారు. మాజీ సీఎం వైఎస్ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొని నేరుగా వచ్చిన ఆమెను టీడీపీ కార్యకర్తలు వ్యతిరేకించి, తిప్పి పంపించారు. తాను దళితురాలిని కాబట్టే తనను వినాయక మండపానికి రానివ్వలేదని అప్పట్లో ఆమె ఆరోపించారు. తుళ్లూరు పోలీసులకు నలుగురు వ్యక్తులపై ఎస్సీ, ఎస్టీ వేధింపుల చట్టం కింద ఫిర్యాదు చేయడమే కాకుండా జాతీయ ఎస్సీ కమిషన్‌కూ ఆమె కంప్లయింట్ చేశారు. సీఎం జగన్, ఏపీ డీజీపీలను కలిసి కూడా ఆమె దీనిపై ఫిర్యాదులు చేశారు.
దీంతో టీడీపీ నాయకత్వం జాతీయ మానవ హక్కుల కమిషన్, జాతీయ ఎస్సీ కమిషన్, రాష్ట్రపతికి కూడా ఫిర్యాదు చేసింది. శ్రీదేవి హిందువు కాదని, క్రిస్టియన్ అని ఆధారాలతో సహా ఫిర్యాదు సమర్పించింది. దాంతో ఈ వివాదంలో వాస్తవ వివరాలు తమ చెప్పాలని కోరుతూ రాష్ట్రపతి కార్యాలయం నుంచి ఏపీ ప్రధాన కార్యదర్శి ఎల్వీ.సుబ్రహ్మణ్యానికి కొద్దిరోజుల కిందట నోటీసులు వచ్చాయి.
రాష్ట్రపతి కార్యాలయం నుంచి నోటీసు రావడంతో ఈ వ్యవహారంపై నివేదిక ఇవ్వడానికి సీఎస్ సిద్ధమయ్యారు. అయితే.. శ్రీదేవి క్రిస్టియన్ కాదు, హిందువేనంటూ నిర్ధారించి నివేదిక పంపించాల్సిందిగా సీఎం జగన్ కార్యాలయం సుబ్రహ్మణ్యంపై ఒత్తిడి తెచ్చిందట. అయితే, రాష్ట్రపతి కార్యాలయం నుంచి నోటీసులు రావడంతో వాస్తవ నివేదిక పంపించాల్సిన బాధ్యత తనపై ఉందని, మీరు చెప్పినట్లు చేయలేనని సుబ్రహ్మణ్యం కుండబద్ధలు కొట్టి చెప్పడంతో ఆయనపై బదిలీ వేటు వేశారని వినిపిస్తోంది. సుబ్రహ్మణ్యం వాస్తవ వివరాలు రాష్ట్రపతి కార్యాలయానికి పంపితే ఉండవల్లి శ్రీదేవి దళితురాలు కాదని తేలుతుందని.. ఆమె ఎమ్మెల్యే పదవి ఊడుతుందని వైసీపీ ఆందోళన చెందుతోందట.