రేప్ కే కాదు, ముద్దుకూ జైల్లో వేస్తార్రోయ్.. జాగ్రత్త

July 13, 2020

పాడు పనులు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. గతానికి భిన్నంగా ఊహించని రీతిలో చోటు చేసుకుంటున్న పరిణామాలు చూస్తే.. ఎవరిని నమ్మాలో.. నమ్మకూడదో ఒక పట్టాన అర్థం కాని పరిస్థితి. ఇప్పటికే.. తమ పిల్లల్ని బయటకు పంపేందుకు దడుస్తున్న తల్లిదండ్రులకు తాజా ఉదంతం చూస్తే.. తల పట్టుకోవటమే కాదు.. ఆడ పిల్లల భద్రత మరీ ఇంత కష్టంగా మారిందేమన్న భావన కలుగక మానదు.
తమిళనాడులో చోటు చేసుకున్న ఈ ఉదంతం సంచలనంగా మారింది. కోయంబత్తూరు కారమడైలోని ఒక ఫ్యాన్సీ స్టోర్ లో పని చేస్తున్నాడు 35 ఏళ్ల మునీర్. కేరళ రాష్ట్రంలోని త్రిచూర్ కు దగ్గర్లోని సావక్కాడుకు చెందిన ఇతగాడు.. గడిచిన ఇరవైఏళ్లుగా అదే దుకాణంలో పని చేస్తున్నారు. తాజాగా ఆ షాపుకు.. అదే ప్రాంతంలో నివాసం ఉండే 15 ఏళ్ల విద్యార్థిని పుస్తకం కొనుక్కోవటానికి వచ్చింది.
పుస్తకం ఇచ్చే పేరుతో షాపులోకి తీసుకెళ్లిన మునీర్.. హటాత్తుగా సదరు విద్యార్థినిని బలవంతంగా హత్తుకొని.. ఆమెను ముద్దు పెట్టేసుకున్నాడు. దీంతో.. షాక్ తిందా బాలిక. అతడి చర్యతో భయపడిన సదరు విద్యార్థిని అతడి నుంచి తప్పించుకొని పరుగులు తీస్తూ ఇంటికి వెళ్లింది. జరిగిన విషయాన్ని తల్లికి చెప్పింది. దీంతో.. ఆమె స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయటంతో అతగాడ్ని పోలీసులు అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేశారు. అనంతరం జైలుకు తరలించారు. పిచ్చి వేషాలు వేస్తే.. ఇలాంటివి తప్పవు మరి.