బీజేపీ వార్నింగ్ 2: జగన్ కు బహిరంగ బెదిరింపు

July 13, 2020

2019 ఎన్నికలు అనేక పాఠాలు నేర్పుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోడీ అధికారాన్ని పునర్నిర్వచించారు. ప్రతి వ్యవస్థను తనకు అనుకూలంగా పనిచేసేలా ఆయన పక్కా ప్లాన్ వేసుకున్నారు. గతంలో ఎన్నికలంటే ఒక ప్రత్యేక భయం ఉండేది. కానీ ఈసారి మోడీ ఎన్నికల సంఘం బీజేపీకి అనుకూలంగా ఎన్నికల షెడ్యూల్ ఇచ్చేలా ప్రధాని పదవిని నరేంద్రమోడీ దుర్వినియోగం చేశారని ఆరోపణలున్నాయి. ఎన్నికల ప్రచారంలో ఇతరుల మీద ఏ తప్పులు చూపి కేసులు పెట్టారో, అవే తప్పులు మోడీ షాలు చేస్తే కేసులు పెట్టకపోవడంతో ఎన్నికల సంఘంపై ప్రజలకు అనుమానాలు కలిగాయి.
ఇదిలా ఉంటే... బీజేపీకే కాకుండా ఆ పార్టీతో అంటకాగిన వారంతా ఫలితాలకు ముందే తాము గెలుస్తున్నామని ప్రకటించి అందుకు అనుగుణమైన అధికార మార్పిడి ఏర్పాట్లు చేసుకోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. అంటే తనకు అనుకూలంగా ఉన్న వారికోసం కూడా బీజేపీ వ్యవస్థలను వాడుకుంది. అయితే... ఎవరైనా తమకు తలొగ్గి ఉంటేనే బాగుంటామని, లేకపోతే తోక కట్ చేస్తామని బీజేపీ నేతలే కాకుండా ఆ కూటమి నేతలు కూడా బహిరంగంగా చెబుతుంటే... ఇంతకంటే దారుణ ప్రజాస్వామ్యంలో ఏముంటుంది?
కేంద్రంతో గొడవలు పెట్టుకుని నష్టపోయిన నేతలను ఉదాహరణగా చూపిస్తూ ఏకంగా ముఖ్యమంత్రులనే బెదిరించేటంత స్థాయికి తీసుకెళ్లారు ప్రజాస్వామ్యాన్ని. అంటే ఏపీలో జగన్ ఏమనుకుంటే అది జరగదు. మోడీ ఏమనుకుంటే అది జరుగుతుంది. తాజాగా ఈరోజు జగన్ కు వార్నింగ్ ఇచ్చిన కేంద్ర మంత్రి మాటలు వింటే ఈ విషయం మీకే అర్థమవుతుంది.
టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన తప్పు జగన్‌ చేయొద్దని, ఆయనలా నష్టపోవద్దని కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత స్వతంత్ర మంత్రి రాందాస్‌ అథవాలె అన్నారు. ఎన్డీయేతో సఖ్యతగా మెలగాలని జగన్‌కు ఆయన సూచించారు. ఎన్డీయేను వ్యతిరేకించొద్దని చంద్రబాబుకు తాను చెప్పానని, అయినా ఆయన ఎన్డీయేకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా తిరిగారని తెలిపారు. ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయారన్నారు. అలాంటి తప్పు జగన్‌ చేయకూడదని కోరుతున్నానన్నారు. ఏపీ అభివృద్ధి కోసం ఎన్డీయేతో సఖ్యతగా ఉండాలని ఆయన హెచ్చరించారు. అలా ఉంటే ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం మద్దతు ఉంటుందన్నారు.
ముందు ఈ కేంద్ర మంత్రి గారు తెలుసుకోవాల్సిన విషయం.... మనది సమాఖ్య ప్రభుత్వం. అంటే రాష్ట్రాల సమాఖ్యే కేంద్రం... అంతేగాని రెండు వేర్వేరు పవర్ సెంటర్లు కాదు. కేంద్రం ఎంతో రాష్ట్రం అంతే. ఒక రాష్ట్రం నచ్చినా నచ్చకపోయినా... అన్ని రాష్ట్రాలతో సమానంగా దానిని చూడాలి. దురదృష్టం ఏంటంటే... సుప్రీంకోర్టు రాజ్యాంగాన్ని అవమానపరిచే ఇలాంటి వ్యాఖ్యలను సుమోటోగా తీసుకోకపోవడం. దీంతో కేంద్రం రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతూ రాష్ట్రాలను తన చెప్పుచేతుల్లోకి తీసుకుంటుంది. కేంద్రానికి సొంత ఆదాయమార్గాలు చాలా తక్కువ. రాష్ట్రాలు వసూలుచేసి ఇచ్చేపన్నులే కేంద్రానికి ప్రధాన ఆదాయ వనరు. ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమర్థతను బట్టి కేంద్రానికి ఎంత ఆదాయం వస్తుందో నిర్ణయమవుతుంది. అలాంటపుడు కేంద్రానికి లొంగి ఉండాల్సిన అవసరం ఏ రాష్ట్రానికి లేదు.