సీన్ రివర్స్ -యువకుడిపై ప్రియురాలి యాసిడ్ దాడి

February 23, 2020

ప్రేమించాలని వెంటపడటం.. దానికి అమ్మాయి సానుకూలంగా స్పందించకపోవటం.. ఆగ్రహంతో రగిలిపోతూ.. తనను కాదన్న అమ్మాయి మీద యాసిడ్ దాడికి పాల్పడటం లాంటివి ఇప్పటికి చాలానే విని ఉంటాం. కాకుంటే.. ఇప్పుడు చెప్పే వ్యవహారం కాస్త రివర్స్. యువతుల మీద యువకులు యాసిడ్ దాడికి పాల్పడటం చూశాం. కానీ.. యూపీలో ఈ రోజు జరిగిన ఉదంతం దీనికి రివర్స్. యువకుడి మీద యువతి యాసిడ్ దాడికి దిగిన వైనం అక్కడ సంచలనంగా మారింది. ఇంతకూ ఏం జరిగిందన్న విషయంలోకి వెళితే..
ఉత్తరప్రదేశ్ లోని మౌరావణ్  ప్రాంతంలోని గోనమావ్ అనే గ్రామం ఉంది. ఆ గ్రామానికి చెందిన యువకుడు పాల కేంద్రాన్ని నిర్వహిస్తుంటాడు. గ్రామంలోని వారి వద్ద నుంచి పాలు సేకరించి.. పాల ఫ్యాక్టరీకి పంపుతుంటాడు. రోజు మాదిరే పాలకేంద్రంలో పని చేస్తున్న అతడి వద్దకు ఒక యువతి రావటం.. తన వెంట తెచ్చుకున్న యాసిడ్ ను అతడి ముఖం మీద పోయటం జరిగిపోయింది. ఆ వెంటనే అక్కడి నుంచి యాసిడ్ దాడికి పాల్పడిన యువతి పారిపోయింది.
జరిగిందేమిటో అర్థమయ్యేసరికి సదరు యువకుడి ముఖంతో పాటు.. మెడ.. చెవులు.. ఛాతీ తో పాటు వెనుక భాగం కాలిపోయింది. పోలీసులకు ఫోన్ చేసిన యువకుడు.. జరిగింది చెప్పి తనకు సాయం చేయాలని కోరటంతో వెంటనే అంబులెన్స్ పంపి.. ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆ యువకుడ్ని లక్నోకు తరలించి చికిత్స చేస్తున్నారు. యువకుడి మీద యువతి యాసిడ్ దాడి చేసిందన్న విషయం గ్రామంలో దావనలంగా వ్యాపించింది. అక్కడదో సంచలనంగా మారింది.
యువతి.. యువకుడి మధ్య కొంతకాలం ప్రేమాయణం సాగిందని.. ఈ మధ్యన తనను పట్టించుకోవటం లేదన్న కోపంతోనే యువకుడి మీద యాసిడ్ దాడికి దిగి ఉంటుందని భావిస్తున్నారు. సదరు యువతి దొరికితే కానీ.. ఈ వ్యవహారం వెనుక అసలు విషయం ఏమిటో బయటకు వచ్చే అవకాశం ఉంది.