దారుణం: తండ్రికి బాగవ్వాలని.. కోడలికి 101 గాట్లు

August 09, 2020

మూఢ నమ్మకాలు మనిషిని ఎంత మూర్ఖంగా తయారు చేస్తాయో చెప్పడానికి ఈ ఉదంతం ఉదాహరణ. పదవీ యోగం వస్తుందని.. ఆర్థిక ప్రయోజనాలు చేకూరుతాయని నరబలులు ఇవ్వడం గురించి వింటుంటాం. చదువుతుంటాం. ఐతే ఒక వ్యక్తి అనారోగ్యం నుంచి కోలుకోవడం కోసం మరో వ్యక్తి ఒంటి నిండా కత్తితో గాట్లు పెట్టిన దారుణ ఉదంతం గురించి ఇప్పుడే వింటున్నాం. ఉత్తరప్రదేశ్‌ బరేలీలోని భోజిపురా అనే గ్రామంలో ఈ దారుణం చోటు చేసుకుంది. ఆ ప్రాంతంలో రేణు అనే మహిళకు ఆమె అత్తింటి వాళ్లు నరకం చూపించారు. ఆమెకు సంజీవ్ అనే వ్యక్తితో ఎనిమిదేళ్ల కిందట పెళ్లి జరిగింది. ఐతే ఈ మధ్య ఆ ఇంటి పెద్ద అనారోగ్యం పాలయ్యాడు. ఆయనకు జబ్బు నయం కావడం కోసం ఎవరో చెప్పిన ప్రకారం కోడలికి ఒంటి మీద 101 గాట్లు పెట్టారట. ఇది ఆమె భర్త ఇంట్లో లేని సమయంలో జరిగింది.

ఒంటి మీద చిన్న కత్తి గాటు పడ్డా నొప్పితో విలవిలలాడిపోతాం. అలాంటిది ఒళ్లంతా ఏకంగా 101 గాట్లు పెడితే ఆమె ఎంత నరకం చూసి ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ప్రధానంగా ఈ దారుణానికి పాల్పడింది రేణు.. ఆడబిడ్డ అయిన మోని అట. ఆమెకు ఇంకో ఇద్దరు కూడా సహకరించారట. ఈ దారుణం గురించి ఎలాగోలా బయటికి తెలిసి.. రేణును అత్యవసరంగా ఆసుపత్రికి తరలించారు. ఈ గాట్ల ఫలితంగా రేణు ఒంటి మీద మొత్తం 300 కుట్లు పడటం గమనార్హం. కేవలం ముఖం మీద మాత్రమే 25 కుట్లు వేయాల్సి వచ్చిందట. దీన్ని బట్టి గాట్ల తీవ్రత ఎలాంటిదన్నది కూడా అంచనా వేయొచ్చు. అంటే రేణు ఒంటిమీద నిలువెల్లా గాయాలే అన్నమాట. మనిషిని చంపడం కంటే కూడా దారుణమైన పని ఇది. ఈ దారుణానికి ఒడిగట్టిన ముగ్గురినీ పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు.