అ ఫర్ అమెరికా... అ ఫర్ అరాచకం...

August 05, 2020

అమెరికాలోని మినియాపోలిస్ నగరంలో జార్జ్ ఫ్లాయిడ్ (46) అనే నల్ల జాతి వ్యక్తి మరణం దేశవ్యాప్తంగా పెను ప్రకంపనలు రేపిన సంగతి తెలిసిందే. మే 25న ఫ్లాయిడ్ గొంతుపై ఓ పోలీసు అధికారి కాలు వేసి గట్టిగా అదిమిపట్టడంతో...అతడు చనిపోయాడు. జాత్యహంకారం నేపథ్యంలోనే ఫ్లాయిడ్ చనిపోయాడని అమెరికా వ్యాప్తంగా నల్లజాతి వారు నిరసనలు చేపట్టారు.

అమెరికాలోని అనేక నగరాలు ఆందోళనలతో రగిలిపోతున్నాయి. పలుచోట్ల నిరసనకారులు దుకాణాలు లూటీ చేస్తున్నారు. అమెరికాలో అత్యధిక చోట్ల కర్ఫ్యూ ఉన్నప్పటికీ...లూటీలు ఆగడం లేదు.1992 తర్వాత సైన్యం రంగంలోకి దిగిందంటే పరిస్థితి ఎంత అధ్వాన్నంగా ఉందో తెలుస్తోంది.

ఆందోళనలు, లూటీలతో సాధారణ ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. న్యూయార్క్, చికాగో, అట్లాంటా, లాస్ ఏంజెలెస్ వంటి చాలా నగరాల్లో కర్ఫ్యూ విధించినా నిరసనకారులు వీధుల్లోకి వచ్చి విధ్వంసం సృష్టిస్తున్నారు.
చాలా ప్రాంతాల్లో కార్లు, దుకాణాలు భవనాలకు నిప్పుపెట్టారు. లాస్ ఏంజెలెస్ లో ప్రముఖ దుకాణాలు లూటీ కాగా, న్యూయార్క్ లో ఆందోళనకారులు దాదాపు 20 కార్లను దగ్ధం చేశారు. కాలిఫోర్నియా, చికాగో,  అట్లాంటాలో  హింసాత్మక నిరసనలను నియంత్రించటానికి కర్ఫ్యూ విధించినా ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి.

ఘటన జరిగిన మినియాపోలిస్ లో పరిస్థితి కొద్దిగా సద్దుమణిగినా...దేశవ్యాప్తంగా వేలాది మంది నిరసనకారులను అరెస్ట్ చేశారు. నిరసనల ముసుగులో కొందరు ఆకతాయిలు పలు నగరాల్లో లూటీలకు పాల్పడ్డారు. రాళ్లు, పెట్రోల్ బాంబులతో పోలీసులపై దాడి చేసి ఓ  పోలీస్‌ స్టేషన్‌కు నిప్పు పెట్టడంతో శాంతి భద్రతలు పూర్తిగా అదుపుతప్పాయి.
 
ఫ్లాయిడ్‌ మరణానికి కారణమైన డెరెక్‌ చావిన్‌ ను అరెస్టు చేశారు. కాగా, కెంటకీ రాష్ట్రంలోని లూయిస్‌ విల్లీ నగరంలోనూ నల్లజాతి ప్రజలు ప్రదర్శనలు చేశారు. 2020 మార్చిలో బ్రెయోనా టేలర్‌(26) అనే నల్లజాతి మహిళ ఇంట్లో మాదక ద్రవ్యాలున్నాయన్న అనుమానంతో పోలీసులు కాల్పులు జరిపారు. కాల్పుల్లో ఆమె తీవ్రంగా గాయపడింది. ఆమె ఇంట్లో ఎలాంటి మాదక ద్రవ్యాలు దొరకలేదు. దీంతో, ఫ్లాయిడ్ నిరసనలతో పాటు టేలర్ కు న్యాయం చేయాలని ఆందోళన జరుగుతోంది.