ఆ 3 ట్యాబ్లెట్లతో కరోనాకు చెక్... ఎవరైనా వేసుకోవచ్చట

August 07, 2020

కరోనా మహమ్మారి మీద ఇప్పటికే పలువురు స్పందించారు. కానీ.. దేశ వ్యాప్తంగానే కాదు.. ప్రపంచ వ్యాప్తంగానూ ప్రముఖ వైద్యుడిగా సుపరిచితుడైన గ్యాస్ట్రో ఎంట్రాలజిస్టు నాగేశ్వరరెడ్డి నోటి నుంచి వస్తున్న మాటలు ఇప్పుడు ఆసక్తికరంగానే కాదు.. అందరిలో కొత్త ధైర్యాన్ని పెంచేలా చేస్తున్నాయి.
తాజాగా ఆయన కొన్ని మీడియా సంస్థలతో ప్రత్యేకంగా మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన చేసిన సూచనలు ఇప్పటివరకూ ఎవరూ చెప్పినవి కాకపోవటం.. సరికొత్తగా ఉండటం ఆసక్తికరంగా మారింది. కరోనా విషయంలో ఎవరూ చెప్పని కొత్త అంశాల్ని తాజాగా వెల్లడించారు. కరోనా వ్యాప్తి భారత్ లో తక్కువగా ఉండటానికి కారణం ఎండలు కావని.. దేశంలోకి వచ్చిన వైరస్ కొమ్ములు బలహీనంగా ఉండటమేనని చెప్పారు.
యూరప్.. అమెరికా దేశాల్లోని వైరస్ కొమ్ములతో పోలిస్తే.. మన దేశంలోని వైరస్ కొమ్ములు బలహీనంగా ఉండటంతో.. అవి తాను ప్రవేశించిన మనిషి లోపల నిలవలేకపోతున్నాయన్న కొత్త విషయాన్ని వెల్లడించారు.ఈ కారణంతోనే వైరస్ వ్యాప్తి పెద్ద ఎత్తున సాగటం లేదని చెప్పారు. ఇదొక అంశమైతే.. కరోనా రాకుండా ముందస్తు జాగ్రత్తలు మందుల రూపంలో కూడా తీసుకోవచ్చన్నారు. ఇందుకు మూడు ముఖ్యమైన విటమన్లతో కూడిన ట్యాబ్లెట్లు తీసుకోవాలన్న సూచన చేశారు.
విటమిన్ డి లోపం ఎక్కువగా ఉంటే వైరస్ ముప్పు ఎక్కువని చెప్పిన ఆయన.. ఈ విటమిన్ లోపం ఉన్న వారు వారానికి ఒక డి విటమిన్ ట్యాబ్లెట్ వేసుకోవాలని.. దాంతో పాటుగా విటమిన్ సి ఉన్న ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవాలన్నారు. దీంతో పాటు బీ కాంప్లెక్స్.. జింక్ టాబ్లెట్లు వేసుకోవాలన్నారు. దీంతో వైరస్ బారిన పడకుండా ఎవరికి వారుగా జాగ్రత్త పడొచ్చన్నారు. మానసికంగా హైటెన్షన్ ఉన్న వారిలో ఇమ్యూనిటీ తగ్గే ప్రమాదం ఉందని.. సానుకూల ఆలోచనలతో రోగనిరోధక శక్తి పెరుగుతుందన్నారు. ఇప్పుడాయన చెప్పిన మాటలు ఆసక్తికరంగా మారాయి.