కర్మ: టీ.కాంగ్రెస్ బాగు ప‌డే చాన్సే లేదుగా

May 22, 2020

తెలంగాణ కాంగ్రెస్ అంటేనే అనైక్య‌త‌కు, కుమ్ములాట‌ల‌కు, సొంత పోక‌డ‌ల‌కు సుప‌రిచితం అనే పేరున్న సంగ‌తి తెలిసిందే. అయితే, ఈ విమ‌ర్శ‌ళు ఎదురైన స‌మ‌యంలో అయినా...ఆ పార్టీ నేత‌లు త‌మ వైఖ‌రిని స‌వ‌రించుకుంటారా? అనే ఆశ కొద్దో గొప్పో కార్య‌క‌ర్త‌ల్లో, ద్వితీయ శ్రేణి నేత‌ల్లో వ్య‌క్త‌మ‌వుతుంది. కానీ...ఆ ఆశ ఆశ‌గానే మిగులుతోంది. పీసీసీ చీఫ్ ఉత్త‌మ్‌కుమార్ రెడ్డి గాందీ భవన్‌లో జరిగిన కాంగ్రెస్‌పార్టీ సమావేశానికి ఆ పార్టీ కీలకనేతలు హాజరు కాకపోవడం నేప‌థ్యంలో ఈ చ‌ర్చ జ‌రుగుతోంది.
రాబోయే బడ్జెట్‌ సమావేశాల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహంతో పాటు రైతుల సమస్యలపై చర్చించేందుకు టీపీసీసీ అధ్యక్షులు ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో గాంధీభవన్‌లో కాంగ్రెస్‌ పార్టీ కీలక నేతలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఎంపీలు ఎ.రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి రాలేదు. ఆరుగురు ఎమ్మెల్యేల్లో సీఎల్పీ నేత భట్టి విక్ర మార్క, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి మాత్రమే హాజరయ్యారు. దుద్ధిళ్ల శ్రీధర్‌బాబుతో పాటు కోమటిరెడ్డి రాజగో పాల్‌రెడ్డి, సీతక్క, పొడెం వీరయ్య హాజరుకాలేదు. ఇంత‌టి కీల‌క సమావేశానికి ఎమ్మెల్యేలు అందుబాటులో లేకపోవడంతో గాంధీభవన్‌ వర్గాల్లో చర్చ జరుగుతుంది.
మ‌రోవైపు టీపీసీసీ ప‌ద‌విపై కాంగ్రెస్ పెద్ద‌ల లీకులే ఈ ప‌రిస్థితికి కార‌ణ‌మ‌ని అంటున్నారు. త్వరలోనే టీపీసీసీ అధ్యక్షుని మార్పు ఉంటుందని జోరుగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో సమావేశానికి పలువురు హాజరు కాలేదన్న అభిప్రాయం కాంగ్రెస్‌ వర్గాల్లో రకరకాలుగా విశ్లేషణలు జరుగుతున్నాయి. మొత్తంగా ఇటు కాంగ్రెస్ నాయ‌కులు అటు శ్రేణులు మాత్రం..పార్టీలోని ప‌రిణామాల‌పై ఆందోళ‌న చెందుతున్నార‌నే చ‌ర్చ జ‌రుగుతోంది.